Sandeshkhali: ‘సందేశ్‌ఖాలీ తుపాను మొదలైంది’: మమత ప్రభుత్వంపై మోదీ ఫైర్‌

పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ(Modi).. టీఎంసీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీ(Sandeshkhali) ఘటనలు సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

Published : 06 Mar 2024 15:03 IST

కోల్‌కతా: టీఎంసీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ మహిళలు ఆగ్రహంతో ఉన్నారని ప్రధాని మోదీ(Modi) అన్నారు. సందేశ్‌ఖాలీ (Sandeshkhali)లో మొదలైన తుపాను అక్కడే ఆగిపోదని, రాష్ట్రం నలుమూలలకు చేరుతుందని హెచ్చరించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ ప్రాంతంలో నారీశక్తి వందన్‌ అభినందన్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

కొద్దిరోజులుగా బెంగాల్‌లో సందేశ్‌ఖాలీ ప్రాంతం వార్తల్లో నిలుస్తోంది. సస్పెన్షన్‌ ఎదుర్కొంటోన్న టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌ స్థానికుల నుంచి భూములను లాక్కోవడం, ఇవ్వనిపక్షంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ అకృత్యాలపై అక్కడి మహిళలు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తిని రక్షించడానికి బెంగాల్‌ ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు.

సందేశ్‌ఖాలీలో అకృత్యాలు.. ఎవరీ షాజహాన్‌ షేక్‌..?

‘‘ఈసారి ఎన్డీయే 400 స్థానాలు గెలుచుకుంటుంది. ఇండియా కూటమిలో ఇప్పటికే వణుకు మొదలైంది. అందుకే నన్ను నిందించడం మొదలుపెట్టారు. నాకు కుటుంబం లేకపోవడంతో  వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని అన్నారు. ఈ దేశమే నా కుటుంబమని వారు తెలుసుకోవాలి. ఈ సోదరీమణులంతా నా కుటుంబమే. నాకు ఏదైనా సమస్య వస్తే.. ఈ మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు ఓ కవచంలా నిలుస్తారు. సందేశ్‌ఖాలీ(Sandeshkhali)లో అకృత్యాలు సిగ్గుచేటు. కానీ వాటిని టీఎంసీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వం మీ మీద కంటే.. తన నేతలపైనే నమ్మకం ఉంచింది. ఈ మాఫియాపై పోరాడేందుకు బెంగాల్ మహిళలు బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ రాష్ట్రం మొత్తం సందేశ్‌ఖాలీ తుపానును ఎదుర్కోనుంది’’ అని వ్యాఖ్యలు చేశారు.

‘‘టీఎంసీ పార్టీ మహిళలను రక్షించలేదు. అత్యాచారం వంటి క్రూరమైన నేరాలకు ఉరిశిక్ష విధించాలని భాజపా నిర్ణయించింది. మహిళలు ఫిర్యాదు చేసేందుకు మేము ‘విమెన్‌ హెల్ప్‌లైన్‌’ను ఏర్పాటుచేశాం. మమతా బెనర్జీ ప్రభుత్వం వల్ల బెంగాల్‌లో అది పనిచేయడం లేదు’’ అని విమర్శించారు.

మోదీ ర్యాలీకి బయల్దేరిన బస్సుల నిలిపివేత..

మోదీ సభ నేపథ్యంలో సందేశ్‌ఖాలీ (Sandeshkhali) ప్రాంతానికి చెందిన మహిళలు బస్సుల్లో బయల్దేరారు. అయితే పోలీసులు వాటిని మధ్యలోనే అడ్డుకున్నారు. భద్రతాపరమైన కారణాలతో వాటిని నిలిపివేసినట్లు వెల్లడించారు. భాజపానే ఆ బస్సులను ఏర్పాటుచేసింది. తమను కావాలనే అడ్డుకున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. బరాసత్‌, సందేశ్‌ఖాలీ.. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ప్రాంతాలే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని