Modi: ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మోదీ ఏమన్నారంటే..?

Loksabha Elections: సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సందర్భంగా ప్రధాని మోదీ(PM Modi) సోషల్ మీడియాలో స్పందించారు. 

Published : 16 Mar 2024 18:21 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు శనివారం షెడ్యూల్ విడుదలైంది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దీనిపై ప్రధాని మోదీ(PM Modi) ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా స్పందించారు. వరుస పోస్టులు పెట్టారు.(Loksabha Elections)

‘‘అదిపెద్ద ప్రజాస్వామ్య పండగ మొదలైంది. 2024 ఎన్నికల తేదీలను ఎలక్షన్‌ కమిషన్ ప్రకటించింది. భాజపా, మిగిలిన ఎన్డీయే పార్టీలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయి. సుపరిపాలనలో మా ట్రాక్‌ రికార్డు ఆధారంగా ప్రజల వద్దకు వెళ్తున్నాం. పదేళ్లక్రితం వరకు ఈ దేశ ప్రజలు మోసానికి గురయ్యామనే భావనలో ఉన్నారు. కుంభకోణాలు జరగని రంగం లేదు. ప్రపంచం మనవైపు చూడటం మానేసింది. అక్కడినుంచి అద్భుతమైన మలుపు తిరిగింది. ఇప్పుడు 140 కోట్ల మంది భారతీయుల సహకారంతో అభివృద్ధిలో ఈ దేశం దూసుకెళ్తోంది.

మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏప్రిల్‌ 19 నుంచి లోక్‌సభ పోలింగ్‌

ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందాం. కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. దూరదృష్టి కలిగిన ప్రభుత్వం ఏం చేయగలదో భారత ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఈసారి 400 స్థానాలు అని ప్రజలు నినదిస్తున్నారు. మన దేశంలోని విపక్షానికి ఒక లక్ష్యం, విధానం లేదు. వారికి నిందించడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు. వారి వారసత్వ, విద్వేష రాజకీయాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీంతో పాటు అవినీతి ట్రాక్‌ రికార్డు వారిని దెబ్బతీసింది. ప్రజలు అలాంటి నాయకత్వాన్ని కోరుకోవడం లేదు’’ అని మోదీ అన్నారు. పదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వెల్లడించిన ఆయన విపక్ష పార్టీలపై విమర్శలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని