Corona: అక్కడ 51% పిల్లల్లో యాంటీబాడీలు!

ముంబయిలో దాదాపు 51శాతం పిల్లల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నట్లు తాజాగా జరిపిన సీరో సర్వేలో తేలింది.

Updated : 29 Jun 2021 10:36 IST

తాజా సీరో సర్వేలో వెల్లడి

ముంబయి: కరోనా వైరస్‌ థర్డ్‌వేవ్‌ వస్తే పిల్లలపై ప్రభావం చూపించే అవకాశం ఉందన్న నివేదికలు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబయిలో దాదాపు 51శాతం పిల్లల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్నట్లు తాజాగా జరిపిన సీరో సర్వేలో తేలింది. అంటే ఇప్పటికే అక్కడ సగానికిపైగా పిల్లలు వైరస్‌ ప్రభావానికి లోనైనట్లు ముంబయి మునిసిపల్‌ అధికారులు చేపట్టిన సీరో సర్వేలో వెల్లడైంది.

దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ అనివార్యమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంచేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, రెండో వేవ్‌ కొనసాగుతున్న సమయంలో 1 నుంచి 18ఏళ్ల పిల్లలపై వైరస్‌ ప్రభావం ఏవిధంగా ఉందని తెలుసుకునేందుకు బృహన్‌ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్‌ (BMC) అధికారులు ఏప్రిల్‌-జూన్‌ 15 మధ్యకాలంలో సీరో సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా 2176 మంది చిన్నారుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. వీటిని  ల్యాబ్‌లలో పరీక్షించారు. వాటిలో దాదాపు 51.1శాతం నమూనాల్లో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు.

18ఏళ్లలోపు పిల్లలపై ఈ సర్వే నిర్వహించగా.. వీరిలో 10-14ఏళ్ల పిల్లల్లోనే సీరో పాజిటివిటీ ఎక్కువగా (53.43శాతం) ఉన్నట్లు తేలింది. ఇక 1-4ఏళ్ల పిల్లల్లో 51శాతం, 5-9ఏళ్ల చిన్నారుల్లో 47శాతం, 10-14 ఏళ్ల వయసువారిలో 53శాతం సీరో పాజిటివిటీ ఉందని వెల్లడైంది. ఇలా 1 నుంచి 18ఏళ్ల వయసు చిన్నారుల్లో సీరో పాజిటివిటీ రేటు 51.18శాతంగా ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.

సెకండ్‌ వేవ్‌లోనే ఎక్కువగా..

ముంబయి నగరంలో కొవిడ్‌ ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు బీఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు సీరో సర్వే చేపడుతున్నారు. ఇప్పటివరకు మూడు సీరో సర్వేలను నిర్వహించారు. ఇంతకుముందు (మార్చి నెలలో) చేపట్టిన సర్వే ఫలితాలతో పోలిస్తే ప్రస్తుత సర్వేలో సీరో పాజిటివిటీ రేటు గణనీయంగా పెరిగినట్లు అధికారులు గుర్తించారు. సెకండ్‌ వేవ్‌ సమయంలో 39శాతంగా ఉన్న సీరో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 51శాతానికి పెరిగిందని చెప్పారు.

ఇదిలాఉంటే, థర్డ్‌వేవ్‌ ప్రభావం పిల్లలపై ఉంటుందా? లేదా అనే విషయంపై స్పష్టత లేదని.. ఈ నేపథ్యంలో ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు సంసిద్ధంగా ఉండాలని సూచించింది. ఇక పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ కూడా సెప్టెంబర్‌-అక్టోబర్‌ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం వారిలో వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని