Imran Khan: అమెరికా పక్షాన ఉన్నందుకు భారీ మూల్యం చెల్లించాం..!

అఫ్గాన్‌ యుద్ధంలో అమెరికా పక్షాన నిలిచినందుకు పాకిస్థాన్‌ భారీ మూల్యమే చెల్లించిందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వాపోయారు.

Updated : 19 Sep 2021 14:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గాన్‌ యుద్ధంలో అమెరికా పక్షాన నిలిచినందుకు పాకిస్థాన్‌ భారీ మూల్యమే చెల్లించిందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వాపోయారు. దీనికి తోడు అవమానకర రీతిలో అమెరికన్లు అఫ్గానిస్థాన్‌ను వీడటానికి కూడా ఇస్లామాబాదే  కారణమని నిందిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘రష్యా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధికారులపై ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాపై నిందలు వచ్చిన ప్రతిసారి వారు పాకిస్థాన్‌ వైపు వేలెత్తి చూపుతారన్నారు. ఇటీవల అమెరికా సెనేట్‌లోని విదేశీ వ్యవహారాల కమిటీ విచారణలో చాలా మంది అధికారులు పాక్‌ను నిందించారు. తాలిబన్లకు వారే ఆశ్రయమిచ్చారని ఆరోపించారు.

‘‘ఆ సెనేటర్లు చేసిన ఆరోపణలు విని ఒక పాకిస్థానీగా నేను చాలా బాధపడుతున్నాను. అఫ్గానిస్థాన్‌లోని వైఫల్యానికి పాకిస్థాన్‌ని నిందించడం చాలా బాధాకరం’’ అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు.

అమెరికాపై 9/11 దాడి జరిగిన సమయంలో పాకిస్థాన్‌లో రాజకీయ సుస్థిరత లేదు. అప్పుడు పర్వేజ్‌ ముషారఫ్‌ సైనిక తిరుబాటు చేసి అధికారంలోకి వచ్చారు. అధికారం నిలపుకొనేందుకు తనకు అమెరికా మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో అమెరికా యుద్ధానికి పాకిస్థాన్‌ మద్దతు పలికింది. ఇది ఒక తప్పుడు నిర్ణయమని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇప్పటికీ భావిస్తున్నారు. ‘‘విదేశీ ఆక్రమణల నుంచి రక్షించుకునేలా వారికి శిక్షణ ఇచ్చాం. అది పవిత్ర యుద్ధం. జిహాద్‌. కానీ, అమెరికాకు వ్యతిరేకంగా పోరాడితే అది ఉగ్రవాదం అవుతుందని వారికి చెప్పాం. అందుకే ముజాహిద్దీన్‌లు మాకు వ్యతిరేకమయ్యారు. మేం కుమ్మక్కయ్యామని భావించారు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని