Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి.. నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

Sudha Murty: ప్రముఖ విద్యావేత్త సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్‌ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ వెల్లడించారు.

Updated : 08 Mar 2024 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ వేదికగా వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడటం విశేషం.

ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని కొనియాడారు. ‘‘సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభకు నామినేట్‌ అవడం ‘నారీశక్తి’కి బలమైన నిదర్శనం. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి చక్కటి ఉదాహరణ. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలి’’ అని మోదీ ఆకాంక్షించారు.

మహిళా దినోత్సవం.. ప్రధాని మోదీ గుడ్‌ న్యూస్‌

డబుల్‌ సర్‌ప్రైజ్‌: సుధామూర్తి

రాజ్యసభకు నామినేట్‌ అవడంపై సుధామూర్తి ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం థాయ్‌లాండ్‌ పర్యటనలో ఉన్న ఆమె పీటీఐతో ఫోన్‌లో మాట్లాడారు. ‘‘మహిళా దినోత్సవం రోజున ఈ ప్రకటన రావడం డబుల్‌ సర్‌ప్రైజ్‌. చాలా ఆనందంగా ఉంది. ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిజానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఏనాడూ పదవులు కోరుకోలేదు. ప్రభుత్వం నన్ను ఎందుకు ఎంపిక చేసిందో తెలియదు. అయితే, దేశానికి సేవ చేసేందుకు ఇదో కొత్త బాధ్యత అని నమ్ముతున్నా’’ అని ఆమె పేర్కొన్నారు.

73 ఏళ్ల సుధామూర్తి ప్రస్తుతం ‘మూర్తి ట్రస్ట్‌’కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, విద్యావేత్తగా, వితరణశీలిగా దేశవ్యాప్తంగా సుపరిచతమే. ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. పలు అనాథాశ్రయాలను నెలకొల్పారు. గ్రామీణాభివృద్ధికి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్‌, గ్రంథాలయ వసతులు కల్పించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్రం పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని