Modi: కాంగ్రెస్‌ ‘ఫోన్‌ బ్యాంకింగ్‌ స్కామ్‌’.. ఆ రంగం నడ్డి విరిచింది: మోదీ

గత ప్రభుత్వం పాల్పడిన భారీ కుంభకోణాల్లో ఫోన్‌ బ్యాంకింగ్‌ స్కామ్‌ ఒకటని ప్రధాని మోదీ (PM Modi) కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ఈ కుంభకోణంతో బ్యాంకులు భారీ నష్టాలను చవిచూశాయన్నారు.

Published : 22 Jul 2023 12:25 IST

దిల్లీ: కాంగ్రెస్‌ (Congress) నేతృత్వంలోని గత యూపీఏ పాలన (UPA Govt)పై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) మరోసారి విరుచుకుపడ్డారు. ఆ ప్రభుత్వం స్కామ్‌లతో బ్యాంకింగ్‌ రంగాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆ కుంభకోణాల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు (Public sector banks) భారీ నష్టాలను చవిచూశాయన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే బ్యాంకులు మళ్లీ కోలుకున్నాయని, ఇప్పుడు ఈ రంగం మరింత బలోపేతమైందని చెప్పారు.

‘రోజ్‌గార్‌ మేళా (Rozgar Mela)’లో భాగంగా శనివారం మరో 70వేలకు మందికి పైగా ప్రధాని మోదీ (PM Modi) వర్చువల్‌గా నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ హస్తం పార్టీపై ధ్వజమెత్తారు. ‘‘గత యూపీఏ హయాంలో బ్యాకింగ్‌ రంగం (Banking Sector) తీవ్రంగా నాశనమైంది. గత ప్రభుత్వాలు పాల్పడిన అతిపెద్ద కుంభకోణాల్లో ఫోన్‌ బ్యాంకింగ్‌ స్కామ్‌ ఒకటి. ఇది బ్యాంకింగ్‌ వ్యవస్థ వెన్నెముకను విరిచేసింది’’ అని మోదీ విమర్శించారు.

వంద రోజులు జనంలోనే.. భాజపా నిర్ణయం

‘‘ఫోన్‌ బ్యాంకింగ్‌ (బ్యాంకులకు ఫోన్లు చేసి)తో ఆ ప్రభుత్వం రూ.వేల కోట్ల రుణాలను వారికి అనుకూలంగా ఉన్న కొందరు శక్తిమంతమైన నేతలు, కుటుంబాలకు మంజూరు చేయించింది. ఆ రుణాలు తిరిగి రాలేదు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ నష్టాలను చవిచూశాయి. నిరర్ధక ఆస్తులు విపరీతంగా పెరిగాయి’’ అని మోదీ ఆరోపించారు.

ఎన్డీయే (NDA) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం బ్యాంకింగ్‌ రంగంలో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. బ్యాంకుల నిర్వహణను బలోపేతం చేయడం, చిన్న బ్యాంకులను విలీనం చేయడం, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచడంతో ఈ రంగం కోలుకుందన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇప్పుడు బ్యాంకులు రికార్డు లాభాలను నమోదు చేస్తున్నాయన్నారు. ముద్రా స్కీమ్‌ వంటి పథకాలతో పేద, అసంఘటిత రంగ కార్మికులకు రుణాలు అందుతున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు