Supreme Court: అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం.. సెబీ దర్యాప్తులో జోక్యానికి సుప్రీం నిరాకరణ

 Adani-Hindenburg case: అదానీ గ్రూప్(Adani Group)పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై మిగిలిన దర్యాప్తును మూడు నెలల్లోగా పూర్తిచేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Updated : 03 Jan 2024 13:05 IST

దిల్లీ: అదానీ (Adani)-హిండెన్‌బర్గ్‌ (Hindenburg) వివాదం విషయంలో అదానీ గ్రూపునకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రముఖ బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ నేతృత్వంలోని ఆర్గనైజ్డ్‌ క్రైమ్ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (OCCRP) నివేదిక ఆధారంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తును అనుమానించలేమని బుధవారం కోర్టు వెల్లడించింది. ఈ మేరకు సెబీ చేస్తోన్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణను సెబీ నుంచి సిట్‌కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. మిగిలిన దర్యాప్తును మూడు నెలల్లోగా పూర్తి చేయాలని నియంత్రణ సంస్థను ఆదేశించింది.

హిండెన్‌బర్గ్ వివాదానికి సంబంధించి 24 కేసుల్లో 22 కేసుల విచారణను సెబీ పూర్తి చేసింది. మిగతా రెండు కేసుల్లో మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ‘షార్టింగ్‌’ విషయంలో హిండెన్‌బర్గ్ మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా..? లేదా..? అని తనిఖీ చేయాలని ప్రభుత్వాన్ని, సెబీని ఆదేశించింది. ‘వార్తా పత్రికలు, థర్డ్ పార్టీ నివేదిక ఆధారంగా సెబీని ప్రశ్నించలేం. వాటిని ఇన్‌పుట్స్‌గా పరిగణించవచ్చు. సెబీ దర్యాప్తును అనుమానించడానికి అవి ఆధారాలు కావు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

అదానీ గ్రూప్(Adani Group) తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిండెన్‌బర్గ్‌  ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. నాలుగు పిటిషన్లపై తీర్పును వెలువరించింది. తీర్పుపై అదానీ గ్రూప్‌ స్పందించింది. చివరకు సత్యమే గెలించిందంటూ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ సంతోషం వ్యక్తం చేశారు.

‘అదానీ’ షేర్ల ర్యాలీ..

అదానీ- హిండెన్‌బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రూప్‌లోని నమోదిత కంపెనీల షేర్ల విలువ బుధవారం గణనీయంగా పెరిగింది. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ షేరు ధర ఓ దశలో 18 శాతం వరకు లాభపడింది. గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 9 శాతానికి పైగా పుంజుకుంది. ఈ ఒక్కరోజే 10 నమోదిత సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఓ దశలో రూ.1.18 లక్షల కోట్ల వరకు పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని