Stalin: ₹400 కోట్లతో ఫుట్‌వేర్‌ పార్కు.. 20వేల మందికి ఉద్యోగాలు: సీఎం స్టాలిన్‌

తమిళనాడులో 250 ఎకరాల విస్తీర్ణంలో ఫుట్‌వేర్‌ పార్కును ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు సీఎం స్టాలిన్‌ వెల్లడించారు.

Published : 28 Nov 2023 18:10 IST

చెన్నై: రాష్ట్రంలో రూ.400 కోట్లతో పాదరక్షలు (ఫుట్‌వేర్‌) తయారీ పార్కును ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ వెల్లడించారు. రాణిపేట్‌ జిల్లాలో సుమారు 250 ఎకరాల స్థలంలో ఈ పార్కును నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ పారిశ్రామిక ప్రాజెక్టుతో 20వేల కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.  పెరంబలూరు జిల్లా ఎరైయూర్‌లో జేఆర్ వన్ ఫుట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన పాదరక్షల తయారీ కేంద్రాన్ని సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ..   గత రెండేళ్లలో ప్రభుత్వం లెదర్, పాదరక్షల పరిశ్రమలలో అనేక ప్రాజెక్టులను తీసుకువచ్చిందని చెప్పారు. 2022లో పాదరక్షలు, తోలు ఉత్పత్తుల పాలసీని విడుదల చేసిన తర్వాత ఈ రంగాలలో మంచి మార్పు కనిపిస్తోందన్నారు.  వెనుకబడిన జిల్లాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితాలు కనబడుతున్నాయన్నారు. ఎరైయూర్‌లోని పరిశ్రమ ద్వారా పెరంబలూరు,  పొరుగు జిల్లాల్లోని ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఉపాధి కలుగుతుందని చెప్పారు.

అలాంటి రోజు ఇంకెంతో దూరం లేదనిపిస్తోంది!

ఇలాంటి వృద్ధిని చూస్తుంటే..  2030 నాటికి తమిళనాడు 1 ట్రిలియన్ డాలర్‌ ఆర్థిక వ్యవస్థను సాధించే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదన్న విశ్వాసం తనకు కలుగుతోందని సీఎం స్టాలిన్‌ అన్నారు. లెదర్‌, ఫుట్‌ వేర్‌ రంగాల్లో తమిళనాడు స్థానం మరింత మెరుగుపడుతుందని, ఈ రంగంలో ఈ రంగంలో పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు.  రాణిపేట జిల్లా పనపక్కంలో పాదరక్షల తయారీ పార్కును ఏర్పాటు చేసే అంశాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని