I.N.D.I.A: ‘ఇండియా’తో భాజపాలో కలవరం.. అందుకే ఇదంతా..: విపక్షాల ధ్వజం

ఇండియా పేరును ఆంగ్లంలోనూ ‘భారత్‌’గా మార్చాలని కేంద్రం యోచిస్తున్నట్టు వస్తోన్న వార్తలపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.

Updated : 05 Sep 2023 15:53 IST

దిల్లీ/చెన్నై: జీ-20 సమావేశాల సందర్భంగా నేతలకు విందు కోసం President of India బదులుగా President of Bharat అనే పేరుతో రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం పంపడంపై దుమారం కొనసాగుతోంది. ఆంగ్లంలోనూ ఇండియా పేరును ‘భారత్‌’గా మార్చే యోచనలో కేంద్రం ఉందన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ వ్యవహారంపై విపక్ష నేతలు తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

మరి విపక్ష కూటమి పేరు ‘భారత్‌’గా మార్చుకుంటేనో..!: కేజ్రీవాల్‌ ప్రశ్న

విపక్ష కూటమి ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవడంతో భాజపా ఆందోళనలో ఉందని.. మరి ఇప్పుడు అదే కూటమి భారత్‌ అని పెట్టుకుంటే ఆ పేరునూ మార్చేస్తారా? అని ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘దీనిపై అధికారిక సమాచారం ఏమీ లేదు. కానీ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతోంది? కొన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ‘ఇండియా’గా కూటమిని ఏర్పాటు చేయడం వల్లే. ఒకవేళ ‘ఇండియా’ కూటమి తన పేరును ‘భారత్’ అని మారిస్తే.. అప్పుడు భారత్‌ పేరును కూడా మారుస్తారా? ఇది ద్రోహం. విపక్ష కూటమి వల్ల భాజపాలో కలవరం నెలకొంది. అందుకే ఒకే దేశం-ఒకేసారి ఎన్నిక ప్రతిపాదనతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది’’ అని అన్నారు. 

భాజపాలో ‘ఇండియా’ కలవరం: స్టాలిన్‌

‘‘నియంతగా వ్యవహరిస్తోన్న భాజపా సర్కార్‌ను గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం వల్లే ‘ఇండియా’ పేరును భారత్‌గా మార్చాలనుకుంటున్నారు. భారతదేశంలో మార్పు తీసుకొచ్చి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దగలుగుతామని అధికారంలోకి వచ్చిన భాజపా..  9ఏళ్ల తర్వాత ‘భారత్‌’అని పేరు మార్చాలనుకోవడాన్ని మనం చూస్తున్నాం. విపక్షాల ఐక్యతలో ఉన్న బలాన్ని గుర్తించిన భాజపాలో ‘ఇండియా’ అనే పదం కలవరం రేపుతోంది. ‘ఇండియా’ భాజపాకు అధికారాన్ని దూరం చేస్తుంది’’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు.

దేశం పేరు మార్చే అధికారం ఎవరికీ లేదు.. శరద్‌ పవార్‌

‘‘దేశం పేరు విషయంలో అధికార పార్టీ ఎందుకింత కంగారుపడుతోందో అర్థం కావట్లేదు. రాజ్యాంగంలో ‘ఇండియా’ పేరును మారుస్తారా? అన్నదానిపై నాకు సమాచారం లేదు. దీనిపై విపక్ష కూటమి సమావేశంలో చర్చిస్తాం. అయితే, ఈ దేశం పేరు మార్చే అధికారం ఎవరికీ లేదు’’ - ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌

ఉన్నట్టుండి మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?: మమత

‘‘ఇండియా అనే పేరును మారుస్తున్నారని తెలిసింది. ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌ పేరుతో జీ-20 విందుకు ఆహ్వానాలు పంపారు. మన దేశాన్ని ‘భారత్‌’ అని పిలుస్తాం కదా..! ఇందులో కొత్తేముంది? ఆంగ్లంలో ‘ఇండియా’ అని కూడా అంటాం. ప్రపంచమంతా మన దేశం పేరు ‘ఇండియా’ అనే తెలుసు. ఇప్పుడు ఉన్నట్టుండి దేశం పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?చరిత్రను తిరగరాయాలని చూస్తున్నారు’’ - పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

భాజపా అసహనానికి నిదర్శనం.. మెహబూబా

‘‘భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రాథమిక సూత్రం భాజపాకు నచ్చట్లేదు. ఆంగ్లంలోనూ ఇండియా పేరును ‘భారత్‌’ అని మార్చాలనుకోవడం వారి అసహనానికి నిదర్శనం. స్వతంత్ర భారతంలో తొలిసారి భారీ మెజార్టీ ఉన్న ఓ పార్టీ యావత్ దేశాన్ని తమ నియంత రాజ్యంగా భావిస్తోంది’’- జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ

  • ఇండియా అనే పేరును దేశం మొత్తం ఆమోదించింది. ప్రత్యేకంగా భారత్‌ అని మార్చాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలోనే ఇండియా అంటే భారత్‌ అని ఉంది  - కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని