Nagarjuna: నేనెలాంటి ఎన్నికల్లో పోటీ చేయటం లేదు: అక్కినేని నాగార్జున

విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారంలో నిజం లేదని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున తెలిపారు.

Updated : 30 Sep 2022 17:12 IST

హైదరాబాద్‌: రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఆయన కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం ‘ది ఘోస్ట్‌’ (The Ghost) ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. తాను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. మంచి కథ వస్తే పొలిటికల్‌ లీడర్‌గా మాత్రం నటిస్తానన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ తాను పోటీ చేస్తానని ప్రచారం జరుగుతోందని, అది నిజం కాదని అన్నారు.

అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఓ సెంటిమెంట్‌తో ప్రారంభమైంది. నాతో సినిమా తీయాలనేది దివంగత నిర్మాత నారాయణదాస్‌ నారంగ్‌గారి కోరిక. అలా ఆయన తనయుడు సునీల్‌ నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. సునీల్‌తోపాటు ఈ సినిమాని నిర్మించిన జాన్వీ, అదిత్‌,శరత్‌ మరార్‌, రామ్మోహన్‌గారికి ధన్యవాదాలు. నాలానే ఈ చిత్రానికి పనిచేసిన వారంతా చాలా యంగ్‌ (నవ్వుతూ..). కసి, ప్రేమతో ఈ చిత్రాన్ని తీశాం. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలంటే కంటెంట్‌తోపాటు సాంకేతికంగా ఉన్నతంగా ఉండాలి. ఈ రెండింటితో దర్శకుడు ప్రవీణ్‌, అతని టీమ్‌ ‘ది ఘోస్ట్‌’ను నింపేశారు’’

‘‘సినిమాపై మాకు నమ్మకం ఉంది. ఈ చిత్రంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాలకు చెందిన నటులున్నారు. ప్రీ రిలీజ్‌ వేడుకలో మాకు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవిగారికి థ్యాంక్స్‌. ఆయన చెప్పినట్టు అన్ని సినిమాలూ మంచి విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను గతంలో నటించిన ‘కిల్లర్‌’, ‘ది ఘోస్ట్‌’కు ఎలాంటి సంబంధం లేదు. ఇందులో యాక్షన్‌ మాత్రమే కాదు చాలా ఎమోషన్‌ ఉంది. ఇది బాగుంది అని ప్రేక్షకులు చెబితే తప్పకుండా కొనసాగింపు చిత్రాలను తీస్తాం’’ అని నాగార్జున తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని