Suriya: ఆ విషయంలో చిరంజీవే స్ఫూర్తి: సూర్య

తాను ‘అగరం ఫౌండేషన్‌’ నెలకొల్పేందుకు చిరంజీవి స్ఫూర్తిగా నిలిచారని ప్రముఖ కోలీవుడ్‌ నటుడు సూర్య తెలిపారు.

Updated : 03 Mar 2022 22:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను ‘అగరం ఫౌండేషన్‌’ నెలకొల్పేందుకు చిరంజీవే స్ఫూర్తిగా నిలిచారని ప్రముఖ కోలీవుడ్‌ నటుడు సూర్య తెలిపారు. తాను హీరోగా నటించిన ‘ఈటి- ఎవరికీ తలవంచడు’ చిత్ర ప్రీ రిలీజ్‌ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. దర్శకుడు పాండిరాజ్‌ తెరకెక్కించిన చిత్రమిది. మార్చి 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా రానా, బోయపాటి శ్రీను, గోపీచంద్‌ మలినేని ముఖ్య అతిథులుగా చిత్ర బృందం వేడుకను నిర్వహించింది.

సూర్య మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ వచ్చి, మిమ్మల్ని ఇలా చూసి చాలా కాలమైంది. ఈ వేడుకకు ఎక్కడ నుంచో విచ్చేసిన అభిమానులకు ధన్యవాదాలు. మీ ప్రేమ నన్నెప్పుడూ వేరే రాష్ట్రం వాడిలా చూడలేదు. ఇక్కడికొస్తే నా హోమ్‌టౌన్‌కు వచ్చినట్టే ఉంటుంది. ఈ వేదికపై బోయపాటి శ్రీను, గోపీచంద్‌ మలినేని, రానాను కలవడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు కొవిడ్‌ పాండమిక్‌ నేపథ్యంలోనూ థియేటర్లకు వెళ్లి సినిమాపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇతర చిత్ర పరిశ్రమలకు ధైర్యానిచ్చారు. నా సినిమాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్‌’ థియేటర్లలో విడుదలవకపోయినా ఓటీటీ ద్వారా అందించిన ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేను. నిర్మాత అల్లు అరవింద్‌గారి వల్లే నేను ఇలా మీ ముందు ఉన్నా. ఆయనే నన్ను మీకు పరిచయం చేశారు. చిరంజీవిగారి స్ఫూర్తితోనే నేను ఫౌండేషన్‌ నెలకొల్పా. ఆయన ‘బ్లడ్‌ బ్యాంక్‌’ ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. సమాజ సేవ చేసేలా అదే నన్ను నడిపించింది. కంఫర్ట్‌ జోన్‌లో ఉంటే ఎప్పటికీ ఎదుగుదల ఉండదు’’ అని అన్నారు.

అప్పుడు సూర్య ఎవరో తెలియదు: రానా

‘‘నేను ‘పితామగన్‌’ (తెలుగులో శివపుత్రుడు) సినిమా చూసిన సమయంలో సూర్య అంటే ఎవరో తెలియదు. కానీ, తన నటనకు అభిమానిగా మారాను. తర్వాత మంచి స్నేహితులమయ్యాం. ఓసారి ఎడిటింగ్‌ రూమ్‌లో నా సినిమా ఒకటి చూసి నాకు క్లాస్‌ ఇచ్చాడు. ఆయన మాటలే నన్ను ‘భల్లాల దేవ’ (బాహుబలి), ‘డానియల్‌’ (భీమ్లా నాయక్‌) తదితర పాత్రలు చేసేలా ప్రేరేపించాయి’’ అని రానా తెలిపారు.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని