Indraja: ఆ మార్పు వస్తే.. బాగుంటుంది

‘‘తెరపై కనబడితే చాలనుకొని ఏది పడితే అది చేసేయాలని నేనెప్పుడూ అనుకోను. ఏ పాత్ర చేసినా.. దానికంటూ కథలో ఓ ప్రత్యేకత ఉండాలి. నటిగా నా ప్రతిభను చూపించుకోగలిగే ఆస్కారముండాలి’’ అన్నారు

Published : 15 Mar 2022 15:20 IST

‘‘తెరపై కనబడితే చాలనుకొని ఏది పడితే అది చేసేయాలని నేనెప్పుడూ అనుకోను. ఏ పాత్ర చేసినా.. దానికంటూ కథలో ఓ ప్రత్యేకత ఉండాలి. నటిగా నా ప్రతిభను చూపించుకోగలిగే ఆస్కారముండాలి’’ అన్నారు నటి ఇంద్రజ. ఇప్పుడామె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. రాజ్‌తరుణ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించారు. శాంటో మోహన్‌ వీరంకి తెరకెక్కించారు. ఈ సినిమా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను ఇంద్రజ పంచుకున్నారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..

‘‘నేను చెన్నైలో ఉన్నప్పుడు దర్శకుడు శాంటో నాకు ఫోన్‌ చేశారు. అప్పుడే ఈ కథ, నా పాత్ర గురించి వివరించారు. స్క్రిప్ట్‌ చాలా కొత్తగా ఉందనిపించింది.  నేనిందులో మురళీ శర్మకు భార్యగా కనిపిస్తాను. రాజ్‌తరుణ్‌ మా కొడుకుగా నటించారు. భర్త దగ్గర లేని ఓ లక్షణం తన కొడుకులోనైనా ఉండాలని తాపత్రయపడే తల్లి.. అందుకు తగ్గట్లుగానే ఆ బిడ్డని ఎంతో జాగ్రత్తగా పెంచుతుంది. అంత జాగ్రత్తగా పెంచినా.. ఆ కొడుకు పెద్దయ్యాక తండ్రిలాగే తయారవుతాడు. మరి దాని వల్ల ఎలాంటి సమస్యలెదురయ్యాయి? తల్లి బాధను అర్థం చేసుకొని ఆఖరికి కొడుకు ఎలా మారాడు? అన్నది తెరపై చూడాలి’’.

* ‘‘దర్శకుడు కొత్త.. పాతా? అన్నది నేనెప్పుడూ పట్టించుకోను. ఓ నటిగా నా పాత్రను దర్శకుడు సంతృప్తిపడేలా చేశానా? లేదా? అన్నదే చూసుకుంటా. సీనియర్‌ దర్శకులతో పనిచేసేటప్పుడు చాలా విలువైన విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. నటిగా నేనిప్పటి వరకు చేసిన ప్రయాణం కొంతే. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇప్పుడొస్తున్న కథల్లో పురుషులతో పోలిస్తే.. మహిళా క్యారెక్టర్‌ ఆరిస్ట్‌లకు అంత ప్రాధాన్యం దక్కడం లేదు. ఈ విషయంలో మార్పు వస్తే చాలా బాగుంటుంది’’.  

* ‘‘నా దృష్టిలో నటికి పరిమితులు ఉండవు. తాప్సీ, సమంత వంటి వారు నాయికా ప్రాధాన్య పాత్రలు చేస్తున్నారంటే.. అంతకుముందు దాదాపు అన్ని తరహా పాత్రలు వారు పోషించేశారు. పెళ్లైనా మగాడిని మగాడిగానే చూస్తారు. ఓ ఆడదాన్ని మాత్రం తల్లిగా గౌరవిస్తుంది సమాజం. ఇప్పుడు మమ్మల్ని అలా గౌరవించి చక్కటి తల్లి పాత్రలకు, అక్క పాత్రలకు పిలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చాలా మంది పెళ్లైన నాయికలు వ్యక్తిగత జీవితాల్ని త్యాగం చేసి మరీ.. సినీ కెరీర్‌ కోసం కష్టపడుతున్నారు. వాళ్లందరికీ హ్యాట్సాఫ్‌. నేను పెళ్లయ్యాక వ్యక్తిగత జీవితంపైనే దృష్టి పెట్టా. పాప పుట్టాక.. ఎనిమిదేళ్లు వచ్చే వరకు తన ఆలనాపాలనానే చూసుకున్నా. ప్రస్తుతం నేను నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలో నటిస్తున్నా. మరో మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి’’.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని