Pawan kalyan: పవన్‌ షూ రూ.లక్ష.. అక్షయ్‌ బ్యాక్‌ప్యాక్‌ రూ.35వేలు.. ఇదే టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌!

మన సినీతారలు ఏది చేసినా, ఏం ధరించినా సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. తాజాగా పవన్‌ షూ, సమంత చెప్పులు, అక్షయ్‌ బ్యాక్‌ప్యాక్‌ ధరలు ఇవేనంటూ వార్తలు ట్రెండ్‌ అవుతున్నాయి.

Updated : 30 May 2023 16:54 IST

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో సినీ తారలకు సంబంధించిన సినిమాల కంటే కూడా వారు ధరించిన దుస్తులు, ఇతర యాక్ససరీస్‌పై సామాజిక మాధ్యమాల వేదికగా చర్చ నడుస్తోంది.  కొద్ది రోజుల కిందట ఊర్వశి రౌటెల ధరించిన నెక్లెస్‌ రూ.కోట్ల రూపాయాలంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు పవన్‌కల్యాణ్‌ షూ, అక్షయ్‌ కుమార్‌ బ్యాక్‌ ప్యాక్‌ గురించి చర్చ జరుగుతోంది.

పవన్‌ షూ ఖరీదు అంతా!

పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan), సాయి ధరమ్‌తేజ్‌కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. తాజాగా  ఈ సినిమాకు సంబంధించి ఇద్దరూ కలిసి ఉన్న  ఓ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో పవన్‌ వేసుకున్న షూ ప్రత్యేకంగా ఉండటంతో నెటిజన్ల దృష్టి వాటిపై పడింది. ఆ షూ వివరాలు, ధర గురించి ఆన్‌లైన్‌లో చూసి, అందరూ షాకవుతున్నారు. పారిస్‌కు చెందిన ప్రముఖ కంపెనీ బాల్మేన్ వీటిని తయారు చేసింది. పవన్ కోసం ఇలాంటివి 3 జతలు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇంతకీ ఈ జత షూ ధరెంతో తెలుసా అక్షరాల రూ.లక్ష. తమిళంలో వచ్చిన ‘వినోదయసిత్తం’కు రీమేక్‌గా ‘బ్రో’ వస్తోంది. జూన్‌ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


సమంత చెప్పులు కూడా అంతే!

‘శాకుంతలం’ ఆశించిన విజయాన్ని అందించలేకపోయినా, వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు సమంత (Samantha). రాజ్‌-డీకే దర్శకత్వంలో ‘సిటడెల్‌’ ఇండియన్‌ వెర్షన్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొన్న సమంత హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. ఎయిర్‌పోర్టులో నడుముకు జాకెట్‌ కట్టుకుని నడిచి వస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. పైగా ఆమె అందరి దృష్టి ఆమె ధరించిన చెప్పులపై పడింది. ఇంకేముందు ఆన్‌లైన్‌ వాటి వివరాల కోసం చూడగా, ‘లూయిస్‌ విట్టన్‌ పూల్‌ స్లైడ్స్‌’గా తేల్చేశారు. అత్యంత ఖరీదైన ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేస్తుంది. ఆన్‌లైన్‌ సమంత ధరించిన చెప్పుల ధర 1490 యూరోలు ఉంది. అంటే మన కరెన్సీలో రూ.1.30లక్షలు.  ఆ ధర చూడగానే వామ్మో అంతా అని అందరూ నోరెళ్ల బెడుతున్నారు.


అక్షయ్‌ మెరుపుల బ్యాక్‌ ప్యాక్‌

పవన్‌, సమంతల షూ, చెప్పుల గోల అలా ఉంటే, అక్షయ్‌ బ్యాక్‌ప్యాక్‌ది మరో ట్రెండింగ్‌ వార్త. తాజాగా ఓ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాక్‌ప్యాక్‌ తగిలించుకుని నడిచి వస్తూ అక్షయ్‌కుమార్‌ (akshay kumar) కనిపించారు. ఎరుపురంగు ఎల్‌ఈడీ లైట్స్‌ కలిగిన ఆ బ్యాక్‌ప్యాక్‌ చూస్తుంటే డ్రాగన్‌ ముఖాన్ని గుర్తు చేసేలా ఉంది.  ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ బ్యాక్‌ప్యాక్‌ గురించి ఆన్‌లైన్‌ వెతగ్గా రూ.9వేల నుంచి రూ.35వేల ధరల శ్రేణిలో ఇవి లభిస్తున్నాయట. ప్రస్తుతం అక్షయ్‌ ‘ఓ మై గాడ్‌2’లో నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని