Manchu Manoj: మాటల్లో చెబుతున్నంత ఈజీగా మా జీవితాలు సాగలేదు: మంచు మనోజ్‌

Manchu Manoj - Bhuma Mounika Reddy: వెన్నెల కిషోర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న చాట్‌ షో ‘అలా మొదలైంది’లో మంచు మనోజ్‌ ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి విచ్చేసి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Published : 22 Apr 2023 14:11 IST

మ అభిమాన నటుడు/నటి ప్రేమ, వివాహ విషయాలను తెలుసుకోవాలని ప్రతి ప్రేక్షకుడు ఆశిస్తాడు. సెలబ్రిటీలకు వారి భాగస్వామితో పరిచయం ఎలా జరిగింది? అది ప్రేమగా మారి, వివాహం వరకూ ఏం జరిగింది? అన్న ఆసక్తికర విషయాలను పంచుకునేందుకు తీర్చిదిద్దిన సరదా కార్యక్రమం ‘అలా మొదలైంది’. హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న తాజా ఎపిసోడ్‌కు మంచు మనోజ్‌ (Manchu Manoj), ఆయన సతీమణి మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy) విచ్చేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అసలు మీరిద్దరూ మొదట ఎలా కలిశారు? ఏం జరిగింది? ఏం జరగబోతోంది? చెప్పండి!

మనోజ్: మేము మొదటగా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. 15 ఏళ్లకు పైగా మా తల్లిదండ్రుల మధ్య స్నేహం ఉంది. ఇరు కుటుంబాల్లో మంచీ చెడులకు హాజరయ్యేవాళ్లం. మా ఇద్దరి జీవితాల్లో వేర్వేరుగా అడుగులు వేశాం. వివిధ దశలనూ చూశాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకున్నాం. అలా మా జర్నీ మొదలైంది. (ఇవన్నీ చెబుతుంటే సిగ్గేస్తోంది.. నవ్వులు)

ఒకరిపై ఒకరికి ఇష్టం ఉందనే విషయం మొదట ఎవరికి అనిపించింది?ఎవరు చెప్పారు?

మనోజ్: నేనే చెప్పాను. నా జీవితంలో ఎదుర్కొన్న బాధలే చాలా పెద్దవి అనుకునేవాడిని. కొన్ని రోజుల పాటు ఏ పనీ చేసేవాణ్ని కాదు. ఆ సమయంలో మౌనిక పడిన కష్టాలు చూసిన తర్వాత నా బాధలు చాలా చిన్నవి అనిపించాయి. అప్పుడు ‘నువ్వంటే ఇష్టం.. ప్రాణం అని చెప్పా.. మళ్లీ సంతోషం.. ఆశ.. జీవితంలో వెలుగు వస్తుందంటే అది నీ వల్లే.. నాకు హ్యాపీగా బతకాలని ఉంది. నలుగురితో సంతోషంగా ఉండాలని ఉంది. నువ్వు ఒప్పుకొంటే నిన్ను, బాబుని నా జీవితంలోకి ఆహ్వానిస్తా’ అని చెప్పా. అప్పుడు మౌనిక ‘సరిగానే ఆలోచించి చెప్పావా? ఈ సొసైటీ గురించి ఆలోచించావా? ఇంట్లో ఒప్పుకొంటారా’ అని అడిగింది.

‘అవన్నీ నేను పట్టించుకోను. ఇంట్లో నేను ఒక మాట చెబితే నో చెప్పరు. పైగా అది నా సమస్య. అవన్నీ నేను చూసుకుంటాను’ అని చెప్పా. తను కూడా ఓకే చెప్పేసింది. శివుడికి వినాయకుడు దొరికినట్లు నాకు బాబు దొరికాడు. ఆ తర్వాతే మా వనవాసం మొదలైంది. కట్‌ చేస్తే, ‘ఉప్పెన’ సినిమాలో ‘ఈశ్వర...’ పాటలా దేశ దేశాలు తిరిగాం. ఇలా చెప్పుకొంటూ పోతే, రెండో సీజన్‌ కూడా మన షోనే నడుస్తుంది. ఒక్కో ఎపిసోడ్‌ ఒక్కో కథ చెబుతా. కానీ, మాటల్లో చెబుతున్నంత ఈజీగా ఏమీ మా జీవితాలు సాగలేదు. ‘ఎన్ని డోర్లు మూస్తారో మూయండి చూద్దాం’ అని ముందుకు సాగాం.

మీ భాగస్వామి గురించి ఒకరికొకరు చెప్పండి?

మౌనిక: మనోజ్‌ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మాకు ‘ఎప్పుడూ సమయానికి ఇంట్లో ఉండరు’ అనే బిరుదు ఉంది. అలాంటిది మనోజ్‌ ఇంట్లో అంతా క్రమశిక్షణ. దీంతో అనుకున్న సమయానికి రెండు నిమిషాలు ముందే ఉండేదాన్ని. కమిట్‌మెంట్, సిన్సియారిటీ.. ఇలా మనోజ్‌ నుంచి చాలా విషయాల్లో నేర్చుకున్నా.

మనోజ్: నా మైనస్‌లన్నీ తను కవర్‌ చేస్తుంది. నేను చాలా ఎమోషనల్‌.. దీంతో చాలా ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు నేను ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌ తప్పాను కూడా. నాకేదైనా అనాలనిపిస్తే, వెంటనే అనేస్తాను. కానీ, తను అలా కాదు. తనదంతా వేరే స్కూలు. సమయం కోసం వేచి చూస్తుంది. అప్పుడు తగిన విధంగా సమాధానం ఇస్తుంది. ఒక్కోసారి రెండు నెలల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని మరీ అడుగుతుంది. ఒక విధంగా ఇలా చేయడం కూడా మంచిదే. ఏ పరిస్థితిని ఎప్పుడు? ఎలా? హ్యాండిల్‌ చేయాలో బాగా తెలుస్తుంది. వాళ్ల అమ్మగారు చనిపోయిన సమయంలో నేను అక్కడే ఉన్నాను. మళ్లీ మూడేళ్ల తర్వాత అంకుల్‌కు కూడా అలా జరగడం ఊహించలేదు. మౌనిక చాలా ధైర్యంగా ముందుకు సాగింది. పరిస్థితులతో పోరాటం చేసే తెగువ ఉంది. నాలో చాలా స్ఫూర్తి నింపింది. ఎన్ని కష్టాలొచ్చినా జీవితంలో ముందడుగు వేయాలే తప్ప.. వెనకడుగు వేయొద్దని తెలుసుకున్నా.

ఆ పరిస్థితులను ఎలా డీల్‌ చేశారు!

మౌనిక: ‘పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు’ అంటారు. అలాంటిదే నా పరిస్థితి. అమ్మ చనిపోవడం, ఆ రెండో రోజే రోడ్‌ క్యాంపెయిన్‌లో పాల్గొనాల్సి రావడం, అక్క, నేను, తమ్ముడు, నాన్న ఇలా ప్రజా జీవితంలోనే ఉండిపోయాం. ఎన్నికలు కావడంతో ‘ఏం చేద్దాం’ అనుకునే సమయం కూడా లేదు. ఆ తర్వాత అక్క రాజకీయాల్లోకి వచ్చారు. నేను నా జీవితంలో ముందుకు వెళ్లిపోయా. నాన్న బాగా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత నాన్న కూడా మాకు దూరమయ్యారు. ఒక్కసారిగా పాతాళానికి వెళ్లిపోయినట్లు అనిపించింది. ‘జీవితంలో ఇంతకన్నా ఇంకా ఏం జరుగుతుంది’ అన్న తెగింపు వచ్చింది. మా కుటుంబాన్ని నమ్ముకుని చాలా మంది ఉన్నారు. వాళ్ల కోసం మొండిగా ముందుకు వెళ్లిపోయాం.

మీ ఇద్దరి మధ్య జరిగిన ఓ మంచి సంఘటన ఏది?

మౌనిక: అమ్మ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆమె జయంతి రోజున చాలా ఒంటరిగా ఫీలయ్యా. అమ్మానాన్నలు చనిపోయారు, ముగ్గురం చిన్న పిల్లలమే. పైగా నా వ్యక్తిగత జీవితంలో సమస్యలు అన్నీ కలసి ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు అమ్మను తలుచుకుంటూ ‘అమ్మా.. నువ్వు ఎక్కడ ఉన్నా, నాకేం కావాలో నీకు తెలుసు. నీ దీవెనలు కావాలి. అంతా నీకే వదిలేస్తున్నా. నా జీవితంలో నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానో అక్కడ ఉంచు’ అని చెప్పా. అదే రోజు మనోజ్‌ ఆళ్లగడ్డ వచ్చారు. ఆయన వస్తున్నారన్న విషయం నాకు తెలియదు.

మనోజ్‌: నా ప్రతి క్షణం మధుర జ్ఞాపకమే (వెంటనే వెన్నెల కిషోర్‌ అందుకుని.. ఇలాంటివే చెప్పొద్దు.. నవ్వులు) మేము ఒకసారి కూర్గ్‌ వెళ్లాం. అదే సమయంలో ఆళ్లగడ్డ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘నువ్వు వెళ్లిపో.. మేము రేపు బయలుదేరుతాం’ అని మౌనికతో చెప్పా. తను ఆళ్లగడ్డ వెళ్లిపోయి గంటలో ఆ పని పూర్తి కావడంతో అక్కడి నుంచి ఫోన్‌ చేసింది. ‘మీరు రావద్దు.. నేను కూర్గ్‌ వచ్చేస్తున్నా’ అని చెప్పింది. నిజంగా అంత జర్నీ చేసి మళ్లీ మా దగ్గరకు రావడమంటే ఆమె ఓపికకు మెచ్చుకోవాల్సిందే.

మీ ఇద్దరిలో రొమాంటిక్‌ ఎవరు? సర్‌ప్రైజ్‌లు ఎవరు ఇస్తారు?

మనోజ్: మనమే! మౌనిక కోసం నా భావాలన్నీ పంచుకుని అనంత శ్రీరామ్‌తో పాట రాయించుకున్నా. ఇదిగో అదే ఈ పాట.

మీ జీవితభాగస్వామిపై ఉన్న కోపాన్ని వేరే వాళ్లపై చూపించారా?

మనోజ్: చూపించాను. మా బావకు ఫోన్‌ చేసి తిడుతుంటాను (నవ్వులు). అతనొక్కడే ఓపికగా నా మాటలు వింటాడు.

మనోజ్‌కు ఇటీవల చెప్పిన ఒక అబద్ధం ఏమిటి?

మౌనిక: ఉదయం ఆరున్నరకే నిద్రలేచాను (నవ్వులు).

మంచు లక్ష్మితో మీ అనుబంధం ఎలా ఉంటుంది?

మౌనిక: మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు. మా మధ్య అందమైన అనుబంధం ఉంది. సోదరి, స్నేహితురాలిలా కాకుండా నాకు అమ్మ స్థానంలో నిలబడింది. మనోజ్‌ గురించి ఏమైనా చెప్పాలన్నా ఆమెతోనే చెబుతుంటాను. ఆమే నాకు అన్నీ. నన్ను ఒక చిన్నపిల్లలా చూస్తుంది. 

వెన్నెల కిషోర్‌: నేను మీ పెళ్లికి వచ్చినప్పుడు లక్ష్మిని కలిసి.. ‘ఎలా అనిపిస్తుంది?’ అని అడిగాను. ‘నా చేతుల మీదుగా ఒక పెళ్లి చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. పెద్దరికం వచ్చినట్లు అనిపిస్తుంది’ అని ఆనందపడింది.

అత్తయ్య, మామయ్యలతో రిలేషన్‌ ఎలా ఉంది?

మౌనిక: మామయ్య గారు చాలా సరదాగా ఉంటారు. పెళ్లి కాకముందు ఇంటికి వెళ్లినప్పుడు అన్నం తినిపించారు. నన్నూ, నా కొడుకు ధైరవ్‌ని వాళ్లిద్దరూ సొంతవాళ్లలా దగ్గరకు తీసుకున్నారు. అది నాకు దేవుడిచ్చిన వరం. అత్తయ్య ఎప్పుడూ ఫోన్‌ చేసి మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడే కాదు... మా అమ్మ చనిపోయినప్పుడు కూడా ఆంటీ నాకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. నన్ను ఒక కోడలిగా కన్నా ఒక కూతురుగా కుటుంబంలోకి ఆహ్వానించారు. అంతకుమించి నాకేం కావాలి.

మనోజ్: మా మొత్తం ప్రేమ, పెళ్లి ప్రయాణంలో మా అమ్మ ఎంతో ఇబ్బందిపడింది. నా వల్ల అమ్మా, అక్కా బాధపడుతున్నారని అనిపిస్తుండేది. వాళ్లిద్దరే నాకు అండగా నిలిచారు. పెళ్లి బాధ్యత మొత్తం అక్కే దగ్గరుండి చూసుకుంది. జీవితాంతం వాళ్లిద్దర్నీ కష్టపెట్టకుండా సుఖంగా ఉండేలా చూసుకుంటా.

మనోజ్‌కు కోపం వచ్చినప్పుడు ఎలా డీల్‌ చేస్తారు?

మౌనిక: మనోజ్‌ది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఆయన కోపాన్ని ఎలా డీల్‌ చేస్తానో అనుకున్నాను. కానీ, ఇప్పుడు మనోజ్‌ నా కోపాన్ని డీల్‌ చేస్తున్నాడు (నవ్వులు).

బాధ ఏమైనా ఉందా?

మనోజ్: బాధ అని చెప్పను కానీ, వ్యక్తిగత అనుభవంతో నాకు రియలైజేషన్‌ వచ్చింది. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయాలి కానీ, మరి ఎక్కువగా చేయకూడదు. ఎందుకంటే ఎవరి జీవితాన్ని వారు చూసుకోవాలి. బయటవాళ్లు, ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులు.. ఇలా ఎంతోమందికి సాయం చేశాను. వాళ్లు అడగకపోయినా సాయం చేయడానికి ముందుకొచ్చాను. అయితే అది తప్పు అనిపించింది. ఎవరైనా సాయం అడిగితే చేయడం వేరు. కానీ, అడగకపోయినా మనకు మనమే వెళ్లి సాయం చేయడం వల్ల తెలియని ఇబ్బందులు వస్తాయి. అలాంటి వాటి వల్ల బాధపడ్డాను. సినిమాల్లో నటిస్తున్నప్పుడు నా పనులన్నీ పక్కనపెట్టి వేరే వాళ్ల పనులు చేసేవాణ్ని. ఆ తర్వాత నా పనులు పూర్తి కావడానికి సమయం పట్టేది. దాని వల్ల బాగా డిస్ట్రబ్‌ అయ్యాను. అప్పుడు బ్రేక్‌ తీసుకుందామనుకున్నా. నాకు సినిమా అంటే ప్రాణం. 11 నెలలప్పుడే సెట్‌కు వచ్చాను. అప్పటి నుంచి సినిమాపైనే నా దృష్టి ఉంది. ఇప్పుడు నాకు భార్య, పిల్లాడు ఉన్నారు. వాళ్లిద్దరే నాకు మొదటి ప్రాధాన్యం. ఇప్పటి నుంచి నేను ఏం చేసినా అది వాళ్ల కోసమే.. అది నా బాధ్యత కూడా. నన్ను నమ్ముకుని తన బిడ్డతో పాటు నా జీవితంలోకి వచ్చింది. ఆ నమ్మకాన్ని జీవితాంతం నేను నిలబెట్టుకోవాలి. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. అనవసరమైన వాటి జోలికి వెళ్లొద్దనే నిర్ణయానికి వచ్చాను.

‘అహం బ్రహ్మాస్మి’ సినిమా ఏమైంది?

మనోజ్: ఆ సినిమా కోసం రెండేళ్లపాటు మనమెంతో కష్టపడ్డాం. ఆ సినిమా ప్రారంభోత్సవానికి నా మిత్రుడు రామ్‌చరణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. మౌనికతో నా బంధాన్ని అంగీకరించని సమయంలో.. సినిమా లేదా ప్రేమ ఏదో ఒకటి నిర్ణయించుకో అనే పరిస్థితి వచ్చింది. నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి నిలబడింది.. అలాంటి సమయంలో డబ్బు, లేదా కెరీర్‌కు ఆశపడి నేను అడుగు అటు వేసి ఉంటే నేను ప్రాణాలతో ఉండి వేస్ట్‌ అనిపించింది. అలా, నేను బతకలేను కూడా. అలా, నేను మౌనిక, బాబుని ఎంపిక చేసుకున్నాను.

ఇక్కడ ఉంటే ఇబ్బంది అవుతుందని మేము చెన్నైకు వెళ్లిపోయాం. ఏడాదిన్నర అక్కడే ఉన్నాం. ఈ విషయం ఎవరికీ తెలియదు. నిజాయతీగా ముందుకు వెళ్లే వాళ్లకు కష్టాలు కాస్త ఎక్కువగా వస్తాయి. ‘అహం బ్రహ్మాస్మి’ దర్శకుడు శ్రీకాంత్‌కు సారీ చెప్పి ఆ ప్రాజెక్ట్‌ వదిలేశాను. శ్రీకాంత్‌ ఇప్పుడు నా సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌తో సినిమా చేస్తున్నాడు. నాకెంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో తప్పకుండా ‘అహం బ్రహ్మాస్మి’ చేస్తాను. కాకపోతే ముందు వేరే సినిమాల్లో చేసి కాస్త డబ్బు కూడబెట్టుకుని మనమే నిర్మిద్దాం (నవ్వులు).

భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా?

మౌనిక: మనస్సాక్షిగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోనే ఉన్నాను. నాకు జనాలతో మమేకం కావడం ఇష్టం. అవసరం ఉంటే తప్పకుండా నిలబడతా. రాజకీయాలంటే మాకొక బాధ్యత. మనోజ్‌ నాకెంతో సపోర్ట్‌ చేస్తుంటాడు. అందుకు సంతోషిస్తున్నా.

జస్ట్‌ మిస్‌ బతికిపోయాను అనుకున్న సందర్భాలేమైనా ఉన్నాయా?

మనోజ్: అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను బరువు తగ్గడానికి డైట్‌ మొదలు పెట్టాను. కానీ, నాకు బనానా చిప్స్‌ అంటే చాలా ఇష్టం. నా కబోర్డ్‌లో దాచుకుని తినేవాణ్ని. ఒక రోజు అలా తింటూ దొరికిపోయాననుకున్నా. ఎలాగో మేనేజ్‌ చేశా. రెండోసారి తింటుండగానే చిప్స్‌తో సహా పట్టుకుంది (నవ్వులు).

ఇక చాలా షోలకు రమ్మని మమ్మల్ని అడిగారు. కానీ, ఈ షోకి రావడం చాలా బాగా నచ్చింది. పైగా నువ్వు (వెన్నెల కిషోర్‌) చేస్తున్నావని తెలిసిన తర్వాత మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశాం.

ఆద్యంతం అలరించేలా సాగిన మంచు మనోజ్‌, భూమా మౌనికా రెడ్డిల ‘అలా మొదలైంది’ ఎపిసోడ్‌లోని సరదా సన్నివేశాలు, ఎమోషన్స్‌, సరదా ఆటలను ఈటీవీ విన్‌ యాప్‌లో వీక్షించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని