‘విషం తాగి చనిపోదామంది’

తన కవితలతో, ప్రత్యేక మేనరిజంతో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తోంది ఒకరైతే, తన సహజ నటనతో.. కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను అలరిస్తోంది మరొకరు. కామెడీ పాత్రల నుంచి క్యారెక్టర్‌ రోల్స్‌ దాకా ఏ పాత్రకైనా ప్రాణం పోయగల వారిద్దరే సీనియర్‌ నటి శ్రీలక్ష్మి, నటి

Updated : 18 Feb 2021 14:35 IST

తన కవితలతో, ప్రత్యేక మేనరిజంతో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తోంది ఒకరైతే, తన సహజ నటనతో.. కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నారు మరొకరు. కామెడీ పాత్రల నుంచి క్యారెక్టర్‌ రోల్స్‌ దాకా ఏ పాత్రకైనా ప్రాణం పోయగల వారిద్దరే సీనియర్‌ నటి శ్రీలక్ష్మి, నటి హేమ. వారిద్దరూ ఈ వారం ఆలీతో సరదాగా షోకు అతిథులుగా విచ్చేశారు. వారి జీవితాల్లోని కష్టసుఖాలను మనతో పంచుకున్నారు. మరి లేటెందుకు చదివేయండి!

ఆలీ: శ్రీలక్ష్మి అక్కగారూ ఎలా ఉన్నారు?

శ్రీలక్ష్మి: బాగున్నా!

కృష్ణవేణిగారూ ఎలా ఉన్నారు? అసలు మీ సొంతూరు ఎక్కడ?

హేమ: చాలా బాగున్నా! మాది తూర్పుగోదావరి జిల్లా..రాజోలు. 

శ్రీలక్ష్మి: మా సొంతూరు రాజమండ్రి. అయితే, ఊహ తెలిసినప్పటి నుంచి చెన్నైలోనే పెరిగా. మా తల్లిదండ్రులు నేను పుట్టకముందే చెన్నై వచ్చేశారు. మా నాన్నగారు అమర్నాథ్‌‌. ఆయన కూడా నటుడే. పాతతరం సినిమాల్లో నటించారు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలు ఎక్కువగా యూట్యూబ్‌లోనే చూశా. మా తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం. నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. నేను రెండో బిడ్డను. అక్క, తమ్ముళ్లిద్దరూ ఈ లోకంలో లేరు. పెద్ద తమ్ముడు రాజేష్‌ హీరోగా నటించేవాడు. జంధ్యాల గారు తీసిన ‘ఆనంద భైరవి’,  ‘రెండుజళ్ల సీత’ సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతని కూతురే ప్రస్తుతం కోలీవుడ్‌లో కథానాయికగా వెలుగుతున్న ఐశ్వర్య రాజేష్‌. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోనే సెటిల్‌ అయ్యా.

హేమకు మొత్తం ఎన్ని పేర్లున్నాయి?

హేమ: మా కుటుంబమంతా గ్రామదేవత పెద్దింట్లమ్మను కొలుస్తారు. ఆ దేవత పేరు మీదనే మా అమ్మ నాకు పద్మ అని పేరు పెట్టింది. తర్వాత జాతక ప్రకారం కృష్ణవేణి అని నామకరణం చేశారు. నాన్నేమో నన్ను అబ్బాయిలాగే పెంచారు. అందుకే ‘రాజు..రాజు’ అని పిలిచేవారు. సినిమాల్లోకి వచ్చాక నేనే ‘హేమ’అని పేరు మార్చుకున్నా. మా అమ్మే స్వయంగా నన్ను చిత్ర పరిశ్రమలోకి తీసుకొచ్చింది.

చిన్నతనంలో హేమ పెద్ద ‘రౌడీ’ అంటగా?

హేమ: అలా ఏం కాదు కానీ! ఇంట్లో అందరికంటే నేనే చిన్నదాన్ని. అక్కలతో పాటు జాతరలకు, అంతర్వేది తీర్థాలకు వెళ్తుండేదాన్ని. అక్కడకి ఎంతో మంది జనం వచ్చేవారు. ఎవరైనా మాతో వెకిలి వేషాలు వేస్తే అక్కడే కొట్టేసేదాన్ని. అలా ఒకబ్బాయిని కొడితే తలపై బొప్పి కట్టింది. అప్పట్లో నా చేతికి ఇనుప గాజులు ఉండేవి. నేను ప్రతీసారి గాజులు పగలగొట్టుకుంటున్నానని మా అమ్మే.. ఆ ఇనుప గాజులు వేసేది.

నీ చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి మళ్లీ కనిపించాడా?

హేమ: లేదు. అప్పుడు బాగా చిన్నదాన్ని. ఊళ్లో 7వ తరగతి పూర్తవగానే సినీ అవకాశాల కోసం కుటుంబమంతా చెన్నై వచ్చేసింది. నేను పెరిగిందంతా చెన్నైలోనే.

మొదటి సినిమా ఏది? అవకాశం ఎలా వచ్చింది?

హేమ: బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన ‘భలేదొంగ’ చిత్రంలో రావుగోపాలరావుగారి కుమార్తెగా నటించా. ఆ తర్వాత ‘క్షణ క్షణం’తో పాటు పది సినిమాల్లో వరుస పెట్టి నటించా. కమలహాసన్‌ గారి వ్యక్తిగత డ్యాన్స్‌మాస్టర్‌ రఘు మాస్టర్‌ దగ్గర డ్యాన్స్‌ నేర్చుకునేదాన్ని. అప్పుడే ఆ చిత్ర బృందంవారు నన్ను చూసి అవకాశం ఇచ్చారు . అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.

శ్రీలక్ష్మి.. అమాయకత్వం రెండూ పర్యాయ పదాలనుకుంటా?

శ్రీలక్ష్మి: ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో అలాగే ఉండేదాన్ని. కాలం గడుస్తున్న కొద్దీ చాలా నేర్చుకున్నా. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి 40ఏళ్లు అవుతోంది. ఇప్పటికీ జీవితం గురించి కొత్త పాఠం నేర్చుకుంటూనే ఉన్నా. ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జీవితానుభవాలు సముద్రం వంటివి. నేర్చుకునే కొద్దీ వస్తూనే ఉంటాయి. మనకంతా తెలుసనుకోవడం బుద్ధి తక్కువ తనం.

మహిళా కమెడియన్లలో అద్భుతమైన ఫాలోయింగ్‌ ఉన్న శ్రీలక్ష్మి, ఎప్పుడు చూసినా డిప్రెషన్‌లో ఉన్నట్టు కనిపిస్తారు ఎందుకు?

శ్రీలక్ష్మి: లేడీ కమెడియన్‌ ఆర్టిస్ట్‌ అవ్వడం నా అదృష్టం. అభిమానుల ఆదరణ వల్ల ప్రేక్షకులను నవ్విస్తూ.. నా నిజజీవితంలో ఉండే బాధల్ని మర్చిపోతా. నాకుండే సమస్యలను ఎవరికైనా చెబుతుంటే లోకువగా చూస్తున్నారు. గడ్డిపోచ తీసేసినట్టు నన్ను తీసేస్తున్నారు. అప్పటి నుంచి నాకు ఎన్ని సమస్యలున్నా ఇతరులకు చెప్పడం మానేశా. పైపైన బంధాలనే కొనసాగించాలని నిర్ణయించుకున్నా. ఆ రోజుల్లో ఎవరితోనైనా కష్టాలు పంచుకుంటే ఓదార్చేవారు, ఆదరించేవారు. ఇప్పుడలా లేదు. ఒక్కోసారి కష్టమొస్తే గోడకు చెప్పుకుంటున్నా. ఎందుకంటే అది ప్రతిస్పందించదు. మనుషుల్ని లోకువ చేయదు. నాకంటూ ఇండస్ట్రీలో ఉన్న అత్మీయులు నటి అన్నపూర్ణమ్మగారు. కానీ, ఈ షోలో ఆలీ ముఖం చూశాక నా కష్టాల్లో కొన్ని పంచుకుంటా.

హేమ ఏ ఉద్దేశంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు?

హేమ: ఏమో, అదిప్పటికీ తెలియదు! కేవలం చిరంజీవి గారిని చూడాలనే ఉద్దేశంతోనే వచ్చేశాననుకుంటున్నా. పద్నాలుగేళ్ల వయసులో పెద్దగా ప్రణాళికలేముంటాయ్‌. ఆటలు ఆడుకోవడం, బడికెళ్లటం తప్ప. మా ఇంటి పక్కనే ఉండే దుకాణం అతను ఒక పేపర్‌లో వేసిన ‘యాక్టింగ్‌ స్కూల్’ ప్రకటనను మా అమ్మకు చూపించి అక్కడ ప్రయత్నించమన్నాడు. దీంతో మా అమ్మ నన్ను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది.  ఆవిడ చాలా ధైర్యవంతురాలు. వచ్చేటప్పుడు రాజోలు పోలీస్‌స్టేషన్‌ నుంచి ఒక లెటర్‌ తీసుకొచ్చి ఇక్కడి పోలీసులకు ఇచ్చింది. మాతో పాటు ఆ యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి ఒక కానిస్టేబుల్‌ను పంపించారు. అదంతా మా రక్షణ కోసమే. తీరా ఇక్కడికొస్తే ఆ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్కడో మారుమూలన ఉంది. అక్కడ ఏం జరిగినా ఎవరికీ తెలిసే అవకాశం లేదు. దాంతో మళ్లీ రాజోలు వెళ్లిపోయి, అక్కడి నుంచి ఫ్యామిలీ మొత్తం చెన్నైకి మారిపోయాం. అక్కడ కోడంబాకం ఏరియాలో మీరు, మేము పక్క పక్క ఇళ్లల్లోనే ఉండేవాళ్లం (ఆలీని ఉద్దేశిస్తూ). ఆ ఇంటి నెల అద్దె రూ.250.

అక్కా.. మీరు ఇప్పటిదాకా ఎన్ని సినిమాల్లో నటించారు?

శ్రీలక్ష్మి: సుమారు 500 చిత్రాలకు పైనే ఉండొచ్చు. మొదటి సినిమా ‘పుణ్యభూమి కళ్లు తెరిచింది’లో సెకండ్‌ హీరోయిన్‌గా నటించా. దేవదాస్‌ కనకాలగారు దర్శకులు. నటులు శ్రీధర్‌, సంగీత గారు ఒక జంటైతే, గుమ్మడి గారి అబ్బాయి, నేను మరో జంటగా ఆ సినిమాలో నటించాం. ఆ తర్వాత తమిళంలో ఐదు , మలయాళంలో నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించా. ఆపై కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా 500 నుంచి 600 మధ్యలో సినిమాలు చేశాను. మా గురువుగారు జంధ్యాలగారి చిత్రాల్లో కచ్చితంగా ఉండేదాన్ని. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డిగారు నాకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు.

ఇంట్లో వాళ్లకు తెలియకుండా రూ.10 తీసుకుని సినిమాకు వెళ్లావంటకదా? తర్వాత అమ్మ బడితపూజ చేశారంటగా?

హేమ: అవును(నవ్వులు), ఇంట్లోవాళ్లు గట్టిగా దంచేశారు. మా పిల్ల గ్యాంగ్‌ను సినిమాకెళ్లమని నాన్న డబ్బులిచ్చారు. ఆ గ్యాంగ్‌కు నేనే లీడర్ని. దానికితోడు మా అమ్మ పర్సులో నుంచి రూ.10 దొంగతనం చేశా. థియేటర్‌కు వెళ్లాక నేను, మా అక్క వాళ్ల ముందు ఏం తెలియనట్టు రూ.10 నోటు కింద పడేసి ‘ఏయ్‌ చూడండి. ఎవరో డబ్బులు పడేసుకున్నారు. తీసుకుందాం’అన్నారు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు ఖర్చు పెట్టేశాను. నాకు డబ్బులు దొరికాయన్న విషయాన్ని మేం పెంచుకునే దత్తపుత్రుడు మా అమ్మకు చెప్పేశాడు. దాంతో మా అమ్మ నాకు బడిత పూజ చేసింది.

చిన్నప్పుడు నువ్వు బతకవు.. చనిపోతావ్‌ అనుకున్నారంట కదా?

హేమ: అవును. అప్పుడు నాకు ఏడెనిమిదేళ్లు ఉండొచ్చేమో! బహుశా. ఒకసారి కొయ్యలా బిగుసుకుపోయానంటా. చనిపోయాననుకుని మావాళ్లు నన్ను బయట పడుకోబెట్టారు. మా అమ్మవాళ్లు ఏడుస్తూ ఉన్నారట. మా నాన్నగారు పనిమీద బయటకెళ్లి ఉదయం వచ్చేసరికి ఈ దృశ్యం కనిపించింది. వెంటనే నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేసిన కొద్దిసేపటికే గట్టిగా ఏడ్చానంట(నవ్వులు). అందుకే, నాకు ఇంకా ఏ గండాలు లేవు! అలాగే ఇక్కడొకటి చెప్పాలి. మా నాన్నకు ఇద్దరు భార్యలు. నేను రెండో భార్య సంతానం. ఆయన మొదటి భార్య పిల్లలతో కలిసి పెరిగా. మా అక్కలు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలోనూ ఇదంతా నేను చెప్పలేదు. కానీ, మా అక్కావాళ్లు అడుగుతుండేవారు. ఎందుకు నువ్వు మా గురించి చెప్పడంలేదని. అందుకే ఈ షోలో చెప్పాలనిపించింది. వాళ్లంతా ప్రస్తుతం ఊళ్లోనే ఉంటున్నారు.

అక్కా..హేమ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని, మీ అంత కామెడీ ఆర్టిస్టు కావాలని పరిశ్రమకు వచ్చింది తెలుసా?

శ్రీలక్ష్మి: అవునా! తప్పకుండా తను బాగుండాలని కోరుకుంటున్నా. అలా ఒకరిని ఆదర్శంగా తీసుకుంటేనే జీవితంలో మనం అనుకున్న మార్గంవైపు త్వరగా చేరుకోగలం. నేనైతే అర్టిస్టునవుతానని కలలో కూడా ఊహించలేదు. అంతా జంధ్యాలగారి ఆశీర్వాదమే.

హేమ: ఎందుకంటే నా కెరీర్‌ మొదట్లో కొన్ని సినిమాలు చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నా. కొంత గ్యాప్ తీసుకున్నాక మళ్లీ నటిద్దామనుకున్నప్పుడు డైరెక్టర్‌ త్రివిక్రమ్‌గారు ‘నువ్వు కామెడీ ట్రై చెయ్యొచ్చుగా’అన్నారు. అలా మిమ్మల్ని దృష్టిలో ఉంచుకుని ‘అతడు’లో మీ మాదిరే అమాయకంగా నటించా (శ్రీలక్ష్మి వైపు చూస్తూ). చాలా మంచి పేరొచ్చింది.

నటుడు చంద్రమోహన్‌గారి కారణంగా జంధ్యాలగారు మిమ్మల్ని తిట్టారంట?

శ్రీలక్ష్మి: అవును. రావుగోపాల్‌రావు, చంద్రమోహన్‌ కాంబినేషన్‌లో ‘రామారావు-గోపాల్రావు’అనే సినిమా తీస్తున్నారు. అందులో భాగంగా మేమంతా పిక్నిక్‌ వెళ్లి బస్సు‌ దిగే సీన్‌ను లాంగ్‌షాట్‌లో తీస్తున్నారు. బస్సు దిగుతూ నేను డైలాగ్‌ చెప్పాలి. డైరెక్టర్‌ దూరం నుంచి మైక్‌ పట్టుకుని ఏం చేయాలో చెప్తున్నారు. బస్సు దిగే  క్రమంలో చంద్రమోహన్‌గారు వెనుక నుంచి నా చెవిపై కొడితే కళ్లు బైర్లుకమ్మాయి. దాంతో డైలాగ్స్‌ మర్చిపోయా. ఒక పక్క నుంచి జంధ్యాలగారి తిట్లు. నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. ఆ రోజు నన్ను చెడామడా తిట్టేశారు జంధ్యాలగారు. అసలేం జరిగిందో చంద్రమోహన్‌గారు కూడా చెప్పలేదు. తర్వాత ఆయన్ను ‘ఏమండీ ఇదేమన్నా పద్ధతిగా ఉందా’అని అడిగితే.. ‘నేనేం చేశా’ అంటూ ఆయన తప్పించుకున్నారు.

‘పెళ్లిసందడి’ షూటింగ్‌లో ఉన్నప్పుడే కదా మీ తమ్ముడు రాజేష్‌ చనిపోయారు ?

శ్రీలక్ష్మి: అవును. రాత్రి రెండు గంటలకు రాజేష్‌ చనిపోయాడని కాల్‌ వచ్చింది. నాకైతే ఆ క్షణం నుంచి ఏడుపు ఆగలేదు. ఒక పక్క ఉదయాన్నే కాంబినేషన్‌ సీన్లు ఉన్నాయి. ఒక్కరం లేకపోయినా ఆ రోజు షూటింగ్‌ వాయిదా వేయాల్సిందే. సినిమాలోని మా గ్యాంగ్‌నంతా డైరెక్టర్‌ రాఘవేంద్రరావుగారు ‘కుప్ప’అని పిలిచేవారు. నేను మేనేజర్‌ దగ్గరకు వెళ్లి ‘నన్ను వెంటనే మా ఇంటికి పంపండి. మా తమ్ముడు చనిపోయాడు’ అంటూ ఒకటే ఏడుపు. ఆయన రాఘవేంద్రరావుగారికి ఫోన్‌ చేసి పరిస్థితి వివరించారు. రాఘవేంద్రరావుగారు వెంటనే అనుమతి ఇచ్చారు. విమానంలో కూడా ఏడుస్తూ ఉంటే పక్కనే ఉన్న వ్యక్తి నన్ను ఓదార్చారు. మద్రాసులో దిగాక ఆయనే కారులో నన్ను ఇంటి దగ్గర దిగబెట్టారు. తర్వాత తెలిసింది.. ఆ వ్యక్తి నాటి సంగీత దర్శకుడు చక్రవర్తిగారి తనయుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీ గారని.

అక్కా..మీ రెండో తమ్ముడికి సీరియస్‌గా ఉందని చెప్తే ఒక షూటింగ్‌వాళ్లు వెళ్లేందుకు అవకాశం ఇవ్వలేదట కదా?

శ్రీలక్ష్మి: అవును. అప్పుడు తమిళంలో ఒక సీరియల్‌లో నటిస్తున్నా. తమ్ముడు ఆనంద్‌కు సీరియస్‌గా ఉంది. ఆసుపత్రిలో ఉంచారని ఫోన్‌ వచ్చింది. మామూలుగా అయితే సీరియల్‌ కాల్షీట్‌‌ రాత్రి తొమ్మిది గంటల కల్లా అయిపోతుంది. నేను ఒక గంట ముందు అనుమతి తీసుకుని వెళ్దామనుకున్నా. కానీ, వాళ్లు ఆ రోజు రాత్రి మరికొన్ని షాట్స్‌ ఉన్నాయంటూ 10గంటల దాకా చేశారు. అందులోనూ అది కామెడీ సీన్‌. నేను ఒక పక్క ఎంతో వేదన అనుభవిస్తూ ఆ సీన్‌లో నటించా. అప్పుడు ఈ జీవితం అవసరమా అనే భావన కలిగింది. షూటింగ్ ప్యాకప్‌ అవ్వగానే కార్లో సామాను వేసుకుని స్పీడ్‌గా డ్రైవ్‌ చేశా. మామూలుగా 40 కి.మీ స్పీడ్‌లో వెళ్లే నేను.. 80 కి.మీ వేగంతో ఆసుపత్రికి వెళ్లా.  స్టీరింగ్‌ తిప్పుతూనే ఆనందం..ఆనందం అంటూ వెర్రిగా అరిచాను. తీరా ఆసుపత్రికి వెళ్లేటప్పటికి తమ్ముడు చనిపోయాడు. నా ఇద్దరు తమ్ముళ్లను అలా కోల్పోయాను. ఇద్దరూ కామెర్ల కారణంగానే చనిపోయారు.(ఈ మాట చెబుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు).

హేమ: నటులకు ఇదొక శాపమేమో! నిజజీవితంలో ఎంత వేదన ఉన్నా కెమెరా ఎదుట నవ్వుతూ నటించాలి. ఎమ్మెస్‌ నారాయణ అన్నయ్యగారు కూడా ఇదే చెప్పారు. ‘దూకుడు’సినిమాలో బ్రహ్మానందంగారి కాంబినేషన్‌లో ఒక పక్క కామెడీ సన్నివేశంలో నటిస్తున్నారు. మరోపక్క ఆయన భార్యకు అపోలో ఆసుపత్రిలో బైపాస్‌ సర్జరీ జరుగుతోంది. ఆ సమయంలో ఆయన ఎంతో మనోవేదన అనుభవించారట. షాట్‌ గ్యాప్‌లో వాష్‌రూమ్‌కి వెళ్లి అద్దం ముందు నిల్చుని ఏడ్చేవారట. వెంటనే ముఖం కడుక్కుని తర్వాతి షాట్‌కు సిద్ధం అయ్యేవారంట. ఆపరేషన్‌ అనుమతి పత్రాన్ని షూటింగ్‌ లొకేషన్‌కే తెప్పించుకొని సంతకం చేశారట. ఎంత బాధాకరం అది.

 నీ దగ్గర ఒక టాలెంట్‌ ఉందట కదా? మొక్కజొన్న పొత్తు బరువు చూసి ముదరా, లేతా అని చెప్పేస్తావట?

హేమ: అవును(నవ్వులు). ఆ టాలెంట్‌కు కారణం మా నాన్నే. మగపిల్లాడిలా నన్ను పెంచాడు. సాధారణంగా మొక్కజొన్న పొత్తు ఎలా ఉందో తెలుసుకోవాలంటే దానిపై ఉండే ఆకులు తీసి గోరుతో గిచ్చి తెలుసుకుంటారు. కానీ, నేను మాత్రం బరువు చూస్తా. బాగా లేతగా ఉండే పొత్తైనా, ముదరు పొత్తైనా తేలిగ్గా ఉంటుంది. అదే సరైన పొత్తైతే కొంచెం బరువుంటుంది. అదే విధంగా కూరగాయలు కూడా. అందరూ బెండకాయలు, ములక్కాడలను మాత్రమే లేతవో, ముదరువో గుర్తించగలరు. వంకాయలను కూడా మనం తెలుసుకోవచ్చు. లేతవైతే వాటి మొదట్లో ఉండే కాండం దగ్గర ముచ్చికల మందం ఎక్కువగా ఉంటుంది. 

స్కైడైవ్‌ ఎక్కడ చేశారు?

హేమ: వాషింగ్టన్‌ డీసీలో చేశా. నేనూ, సింగర్‌ శ్రీకృష్ణ స్కైడైవింగ్‌కు వెళ్లాం. అయితే, అక్కడి నిర్వాహకులు మొదట ఒక కుర్రాడిని తీసుకొచ్చి ‘ఇతనితోనే మీరు డైవింగ్‌ చేస్తున్నారు’అని చెప్పారు. తీరా డ్రెస్‌ వేసుకొని రెడీ అయ్యాక ఒక ముసలివ్యక్తిని తీసుకొచ్చి ‘సారీ ఆ వ్యక్తి ప్రస్తుతం లేరు. ఈయనతో మీరు డైవ్‌ చెయ్యాలి’ అని చెప్పారు. నేను వెంటనే కుదరదన్నా. దీంతో సింగర్‌ శ్రీకృష్ణకు కేటాయించిన వ్యక్తిని నాకు ఇచ్చి డైవింగ్‌ చేయించారు. నిజంగా ఆ థ్రిల్‌ అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎంత కిక్కుంటదనేది!

అక్కా, మీ తండ్రి చనిపోయాక కుటుంబాన్ని పోషించడానికి ఆ స్థానం మీరు తీసుకున్నారు కదూ?

శ్రీలక్ష్మి: అవును. మా నాన్న అమరనాథ్‌గారు మా అందరినీ ఎంతో గారాబంగా పెంచారు. బయట పోకడ అస్సలు తెలీదు. ఆయన చనిపోయాక మా పరిస్థితి గందరగోళంగా మారింది. ఉన్న ఫళంగా చేప పిల్లలను చెరువులో పడేస్తే ఈత రాక ఎలా అల్లాడుతాయో అలా కొట్టుమిట్టాడాం.. నాన్న చనిపోయాక ఆయనకు తెలిసిన ఒక కలెక్టరు మా ఇంటికి వచ్చారు. ఆయన మా అమ్మతో ‘అమ్మా మీ కుటుంబంలో ఎవరైనా బాగా చదువుకున్నవాళ్లుంటే చెప్పండి. ఉద్యోగం ఇప్పిస్తా’అన్నారు. అసలు మాకు చదువులే లేవు. ఆ మాట చెప్పగానే ఆ కలెక్టర్‌ ‘మరీ అలా అయితే మేమేం చేయగలం చెప్పండి’ అన్నారు. అప్పుడు అమ్మ నాతో మాట్లాడుతూ ‘చూడమ్మాయ్‌. మనకు తెలిసిందల్లా సినిమాల్లో నటించడమే. నువ్వే చూడ్డానికి కొద్దో, గొప్పో బాగుంటావ్‌. సినిమాల్లో ప్రయత్నించు. మనకున్న పరిచయాలతో కొన్ని వేషాలు వస్తాయి. అలా ఈ కుటుంబాన్ని లాక్కురావాల్సిందే.. లేదంటే చెప్పు అందరం కలిసి తలో కొంత విషం తాగి చచ్చిపోదాం’ అంది. నేనిక ‘నీ ఇష్టం అమ్మా. ఏం చెయ్యమంటే అది చేస్తా’అని మాటిచ్చా. అంతకు ముందే హీరోయిన్‌గా విశ్వనాథ్‌ గారి సినిమాలో ఎంపికై, ముహూర్తం షాట్‌కు కూడా వెళ్లా. కానీ, ఈ లోగా నాన్నగారు చనిపోవడం, ఇతర ఇబ్బందుల వల్ల ఆ సినిమాలో అవకాశం పోగొట్టుకున్నాను. ఆ తర్వాత కొన్ని చిన్న పాత్రల్లో నటిస్తూ ఉండగా.. ‘రెండు జెళ్ల సీత’లో అవకాశం వచ్చింది. అదే సినిమాలో తమ్ముడు రాజేష్‌కు హీరోగా అవకాశం వచ్చింది. ఆ సినిమాలోని పాత్రతో నాకు మంచి పేరొచ్చింది. ఇప్పుడున్న పిల్లలు కూడా నా డైలాగుల్ని బాగా ఇష్టపడుతున్నారు. ‘బాబూ చిట్టీ’ ‘అబ్బ జబ్బ దబ్బ’ డైలాగ్స్‌తో పాటు ‘చంటబ్బాయి’లోని  ‘బంగాళా భౌభౌ’ అన్న డైలాగ్స్‌ బాగా పాపులరయ్యాయి.

హేమ.. మీ కుటుంబం గురించి చెప్పండి?

హేమ: నా భర్త పేరు జాన్‌. మాకు ఒక కూతురు ఇషా. ప్రస్తుతం బీబీఎం రెండో సంవత్సరం చదువుతోంది. తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చా. ఇండిపెండెంట్‌గా ఉండాలనే ప్రోత్సహిస్తూ ఉంటా. అలా చేస్తేనే భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు వచ్చినా తట్టుకుని నిలబడగలుగుతారు. అయినప్పటికీ తను అమ్మకూచే. ఎప్పుడైనా బయటకు వెళ్తే.. నా  కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది.

ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు?

హేమ: ఇప్పటివరకు 475 సినిమాల్లో నటించా. 500 మార్కును త్వరలోనే చేరుకుంటా. నాకు మంచైనా, చెడైనా ఇండస్ట్రీనే. ఎందుకంటే చిత్ర పరిశ్రమ నాకు జీవితాన్నిచ్చింది. మా అమ్మ కన్నా ఎక్కువగా చూసుకుంది.. నాన్నకంటే ఎక్కువ ధైర్యానిచ్చింది కూడా ఇండస్ట్రీనే. అవకాశాలు రావడం కొంచెం ఆలస్యమైనా బాధపడను. కొన్నాళ్లు జుట్టుకు రంగు వేయడం మానేస్తే తల్లి పాత్రలు, అమ్మమ్మ పాత్రలు కూడా చేయొచ్చు(నవ్వులు). నేను చనిపోయాక పాడెను సినిమా వాళ్లే మోయాలన్నది నా బలమైన కోరిక.

అక్కా.. మీ కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు ఎక్కడున్నారు?

శ్రీలక్ష్మి: నా చెల్లెళ్లందరూ చెన్నైలోనే ఉంటున్నారు. షూటింగ్స్‌ లేకపోతే ఎప్పుడూ అక్కడే ఉంటా. మా వాళ్లంతా నన్ను బాగా చూసుకుంటారు. అక్కడ మాకు సొంత ఇల్లు ఉంది. కింద ఫ్లోర్‌ అద్దెకిచ్చా. నేనెప్పుడైనా వెళ్లినప్పుడు పైన ఇంట్లో ఉంటా. నాకంటూ పిల్లలు ఎవరూ లేరు. నా చెల్లెళ్ల పిల్లలు, తమ్ముడి పిల్లలే నాకు వారసులు. అలా అనుకుంటే నన్నిప్పుడు కూడా అభిమానిస్తున్న యువ అభిమానులంతా నా పిల్లలే అనుకుంటా. అంతెందుకు, నా తమ్ముళ్లు లేకపోయినా నిన్నే నా తమ్ముడిగా భావిస్తుంటా (ఆలీని ఉద్దేశించి). అంతటి అనుబంధం మనిద్దరిది.

ఒక సినిమాకు మొత్తం మూడు షోలకు అక్కడే టికెట్‌ క్యూలో నిలబడ్డారట?

శ్రీలక్ష్మి: అవును. ఆ చిత్రం ‘సుడిగుండాలు’. అందరూ సినిమా బాగుందనడంతో చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లా. ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఇంతలో టికెట్‌ క్యూలైన్‌ పెరుగుతుండేది. అక్కడికి వెళ్తే ఆ ఒత్తిడిలో మమ్మల్ని పక్కకు తోసేసేవాళ్లు. అలా మ్యాట్నీషోకు కూడా జరిగింది. ఎలాగైనా సినిమా చూడాలనే ఉద్దేశంతో అక్కడే ఉండి చివరకు మూడో షోలో చూసి వచ్చాం.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని