Allu Arjun: చిరంజీవికి పద్మ విభూషణ్‌.. అల్లు అర్జున్‌ ఏమన్నారంటే..?

కేంద్ర ప్రభుత్వం చిరంజీవి (Chiranjeevi)కి పద్మ విభూషణ్‌ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మేనల్లుడు, నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) స్పందించారు.

Updated : 26 Jan 2024 15:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పద్మ విభూషణ్‌ పురస్కారానికి ఈ ఏడాది అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) పేరు ప్రకటించడంపై నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) ఆనందం వ్యక్తం చేశారు. ‘‘దేశంలోనే రెండో అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మ విభూషణ్‌కు ఎంపికైనందుకు మన మెగాస్టార్‌ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. కుటుంబం, అభిమానులతో పాటు యావత్‌ తెలుగు వారికి ఇది ఎంతో గర్వకారణం. ఈ విజయంపై సంతోషంగా ఉన్నా. మేము గర్వపడేలా చేసినందుకు ధన్యవాదాలు’’ అని బన్నీ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

రామ్‌చరణ్‌ (Ram Charan) స్పందిస్తూ.. ‘‘ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైనందుకు ధన్యవాదాలు. భారతీయ సినీ పరిశ్రమ, సమాజానికి మీరందించిన సేవలు నాతోపాటు ఎంతోమంది అభిమానులను ప్రేరేపించడంలో కీలకపాత్ర పోషించాయి. ఈ గొప్ప దేశంలో మీరొక అద్భుతమైన పౌరుడు. మీ సేవలను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు థ్యాంక్యూ’’ అని పేర్కొన్నారు.

Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్‌ చేసింది: పద్మ విభూషణ్‌ చిరంజీవి ప్రయాణమిది!

గణతంత్ర దినోత్సవంలో భాగంగా చిరు బ్లడ్‌బ్యాంక్‌లో ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. అభిమానుల వల్లే తాను ఈ స్థాయికి రాగలిగానని అన్నారు. ‘‘45 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో కళామతల్లికి నావంతు సేవలు అందించాను. కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉందని గ్రహించి.. సాయం కోరిన వాళ్లకు ఎన్నోఏళ్లుగా అండగా నిలబడ్డా.  ఇందులోభాగంగానే చిరు బ్లడ్‌బ్యాంక్‌ స్థాపించా. దీని ఆధ్వర్యంలో ఎంతోమందికి సేవ చేస్తున్నందుకు గర్వపడుతున్నా.  అభిమానుల వల్లే ఇది ఇంత గొప్పగా ముందుకువెళ్తోంది. ప్రతిఒక్కరికి ఎప్పుడూ రుణపడి ఉంటా. ఈ గణతంత్ర దినోత్సవం ఎంతో ప్రత్యేకం. నా సేవలను గుర్తించి 2006లో పద్మభూషణ్‌ అవార్డు ఇచ్చారు. అదే నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఊహించనివిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మవిభూషణ్‌ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని చిరు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని