Shirdi Sai movie: మరోసారి ‘అన్నమయ్య’ తీద్దామనుకుంటే ‘శిరిడిసాయి’ పట్టాలెక్కింది!

నాగార్జున (Nagarjuna), రాఘవేంద్రరావు (K.Raghavendra Rao) కాంబినేషన్‌లో వచ్చిన భక్తిరస చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే.

Updated : 08 Sep 2023 13:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాగార్జున (Nagarjuna), రాఘవేంద్రరావు (K.Raghavendra Rao) కాంబినేషన్‌లో వచ్చిన భక్తిరస చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ‘అన్నమయ్య’ (Annamayya), ‘శ్రీరామదాసు’ (Sri ramadasu)తో వీరిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తుండిపోయే సినిమాలు చేశారు. 2012లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మరో ఆధ్యాత్మిక చిత్రం ‘శిరిడిసాయి’ (shirdi Sai). తొలి రెండు చిత్రాల్లో భక్తుడిగా నటించిన నాగార్జున ఈ మూవీలో సాయిబాబాగా నటించారు. అయితే, ఈ సినిమా కన్నా ముందు ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్‌లో ‘అన్నమయ్య’ తరహా మూవీ చేయాలనుకున్నారట.

ఒకరోజు రాఘవేంద్రరావు, నాగార్జున సరదాగా కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో ‘ఇంటింటా అన్నమయ్య’ అనే సోషియో ఫాంటసీ తీద్దామని దర్శకేంద్రుడు సూచించారు. అయితే, ఆ ప్రతిపాదనను ఎలా తిరస్కరించాలో నాగార్జునకు అర్థం కాలేదు. ఎందుకంటే, ‘అన్నమయ్య’లాంటి క్లాసిక్‌ను క్యాష్‌ చేసుకుని అలాంటి పేరుతోనే మరో సినిమా తీస్తే బాగుండదని ఆయనకు అనిపించిందట. పైగా ‘అన్నమయ్య’ పేరు టైటిల్‌లో కనిపిస్తే, ఏదో ఊహించుకుని ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారని అనుకున్నారు. ఆ అంచనాలను అందుకోలేకపోతే, అందరూ బాధపడాల్సి వస్తుందని నాగార్జున భావించారు. దీంతో ఆ టాపిక్‌ను పక్కన పెడుతూ ‘మీరు శిరిడి సాయికి భక్తులు కదా! అలాంటి కథ ఏమైనా ఆలోచించండి’ అని రాఘవేంద్రరావుకు సలహా ఇచ్చారు. అక్కడే ఆ చర్చ ముగిసిపోయింది.

అట్లీ.. అన్నీ హిట్లే.. అక్కడా.. ఇక్కడా..

ఆ తర్వాత అనూహ్య సంఘటన జరిగింది. నాగార్జున ప్రతి ఆదివారం ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా పార్టీ చేసుకుంటూ కావాల్సింది తింటూ ఆ రోజును ఆస్వాదిస్తారు. అలా నాగార్జున ఓ ఆదివారం సరదాగా పార్టీ చేసుకుంటున్న సమయంలో ఎందుకో శిరిడి వెళ్లాలని అనిపించింది. ఆ విషయం రాఘవేంద్రరావుకు చెప్పకుండా తెలిసిన స్నేహితుడు మహేశ్‌రెడ్డి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి శిరిడి ఆలయానికి వెళ్లారు. ఆరోజు నాగార్జున సాయిబాబాను దర్శించుకుని తిరిగి హైదరాబాద్‌ రాగానే రాఘవేంద్రరావు నేరుగా ఆయన ఇంటికి వచ్చారు. ‘మీరు అన్నట్లుగానే మనం శిరిడి సాయిపై మూవీ చేస్తున్నాం. మీరే బాబాగానే కనిపిస్తారు’ అని చెప్పేసరికి నాగార్జున ఆశ్చర్యపోయారు.  జీవితం ఎవరి దగ్గరకు ఎలాంటి పాత్రలు తీసుకొస్తుందే ఎవరికీ తెలియదు. రాఘవేంద్రరావుతో తీసిన తొలి రెండు చిత్రాల్లో భక్తుడిగా కనిపించిన నాగార్జున ‘శిరిడీసాయి’లో భగవంతుడిగా నటించి మెప్పించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని