Bollywood Stars: ముంబయి నుంచి వచ్చి మెప్పించారు.. వారు ఫస్ట్‌టైమ్.. వీరు రిపీట్!
ఈ ఏడాది తెరకెక్కిన దక్షిణాది సినిమాల్లో బాలీవుడ్ తారలు ఎవరెవరు మెరిశారో? గుర్తున్నారా? లేదంటే ఇక్కడ ఓ లుక్కేయండి..
దక్షిణాది నటులు హిందీ సినిమాల్లో కనిపించినా, బాలీవుడ్ స్టార్లు దక్షిణాది చిత్రాల్లో నటించినా సినీ ప్రియులకు ఆనందం. పూర్తి స్థాయిలో కాకపోయినా చిన్న పాత్రల్లోనైనా ఒకే తెరపై సౌత్, నార్త్ తారలను చూస్తే వారికి సంబరం. అందుకే చాలామంది దర్శకనిర్మాతలు ఈ కాంబినేషన్లలో సినిమాలు తీసేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. 2022కు మరికొన్ని రోజుల్లో గుడ్ చెప్పబోతున్న సందర్భంగా ఈ ఏడాదిలో దక్షిణాది చిత్రాల్లో సందడి చేసిన బాలీవుడ్ స్టార్లను గుర్తు చేసుకుందాం..
అలియా భట్..
ప్రముఖ దర్శకుడు మహేశ్ భట్ వారసురాలిగా తెరంగేట్రం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అలియా భట్ (Alia Bhatt). ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘2 స్టేట్స్’, ‘ఉడ్తా పంజాబ్’, ‘రాజి’, ‘గుంగూబాయి కాఠియావాడి’ తదితర విభిన్న చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈమె ‘ఆర్‌ఆర్‌ఆర్’ (తెలుగు) సినిమాతో దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా (RRR)లో సీత పాత్ర పోషించి, తొలి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు అలియా. రామ్ చరణ్‌కు జోడీగా కనిపించే ఆ క్యారెక్టర్ నిడివి తక్కువే అయినా ఆమె గుర్తుండిపోయారు.
అనన్య పాండే..
ప్రముఖ నటుడు చంకీ పాండే తనయ అనన్యపాండే (Ananya Panday) ‘లైగర్’ (తెలుగు) చిత్రంతో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా ఇది. ఈ చిత్రం (Liger)లో ఆమె తానియా పాండే అనే గ్లామర్ రోల్‌లో కనిపించారు. సినిమా పరాజయం పొందడంతో అనన్య పేరు అంతగా వినిపించలేదు.
హ్యుమా ఖురేషి.. రెండోసారి
‘ఏక్ థి దాయన్’ ‘డి- డే’, ‘బదలాపూర్’ తదితర చిత్రాలతో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న హ్యుమా ఖురేషి (Huma Qureshi) ఈ ఏడాది ‘వలిమై’ (తమిళం) సినిమాతో దక్షిణాదిలో సందడి చేశారు. సోఫియా పాత్రతో మెప్పించారు. అజిత్ హీరోగా హెచ్. వినోద్ తెరకెక్కించిన సినిమా (Vaalimai) ఇది. రజనీకాంత్ హీరోగా పా. రంజిత్ రూపొందించిన ‘కాలా’తో హ్యూమా తొలిసారి ఇక్కడి ప్రేక్షకులను పలకరించారు.
రవీనా టాండన్.. అప్పుడలా ఇప్పుడిలా
అక్కినేని నాగేశ్వరరావు, వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రథసారథి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు రవీనా టాండన్ (Raveena Tandon). ‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశ వీధిలో’ మెరిసి, తన అందంతో ఆకట్టుకున్నారు. కొన్నాళ్ల విరామం తరువాత ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ (కన్నడ) పాన్ ఇండియా సినిమాతో సౌత్ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇందులో (KGF Chapter 2) ఆమె పోషించిన ప్రధాన మంత్రి రమికా సేన్ పాత్రకు అందరూ ఫిదా అయ్యారు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం.
ఐశ్వర్య రాయ్.. కొత్తేమీ కాదోయ్!
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan) సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు బాగా పరిచయం. ‘జీన్స్’, ‘ఇద్దరు’, ‘విలన్’, ‘రోబో’ తదితర అనువాద చిత్రాల్లోని నటనతో ఇక్కడి వారిని కట్టిపడేసిన ఐశ్వర్య చాలాకాలం తర్వాత ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (తమిళం)లో నటించారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వహించిన ఈ సినిమా (Ponniyin Selvan)లో ఆమె నందిని, మందాకిని దేవి అనే పాత్రల్లో కనిపించి, మరోసారి తన సత్తా చాటారు.
తండ్రిగా అజయ్ దేవ్‌గణ్..
బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరు అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn). నటుడిగా 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఈ ఏడాదిలోనే సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)లో రామ్ చరణ్ తండ్రిగా నటించారు. ఆయన తెరపై కనిపించింది కొన్ని నిమిషాలే అయినా వీరోచితమైన ఆ క్యారెక్టర్ ప్రేక్షకులపై ప్రభావం చూపింది.
సల్మాన్ ఖాన్.. తార్ మార్
బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ‘గాడ్ ఫాదర్’ (తెలుగు)తో దక్షిణాది చిత్ర పరిశ్రమ వారిని పలకరించారు. చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించిన ఈ సినిమా (God Father)లో సల్మాన్ కీలక పాత్ర పోషించారు. తన నటనతోపాటు ‘తార్ మార్ తక్కర్’ అనే పాటలో చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
సంజయ్ దత్.. అధీరా
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కనిపించిన తొలి తెలుగు చిత్రం ‘చంద్రలేఖ’. నాగార్జున హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో అతిథి పాత్ర పోషించారాయన. ఆ తర్వాత పలు డబ్బింగ్ సినిమాలతో అలరించారు. ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ (KGF Chapter 2)తో మరోసారి సౌత్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సంజయ్ పోషించిన అధీరా పాత్ర ఆయన కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలిచింది.
అనుమప్ ఖేర్.. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్
1987లో వచ్చిన ‘త్రిమూర్తులు’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు అనుపమ్ ఖేర్ (Anupam Kher). భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, చైనీస్ భాషల్లోనూ నటించిన దిగ్గజ నటుడాయన. చాలాకాలం విరామం తర్వాత ఈ ఏడాది ‘కార్తికేయ 2’ (Karthikeya 2) తో తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చారు. నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో ఆయన ధన్వంతరి అనే పాత్ర పోషించారు.
వివేక్ ఒబెరాయ్
విభిన్న పాత్రలు ఎంపిక చేసుకుంటూ తనదైన ముద్ర వేసిన నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi). ‘రక్త చరిత్ర 1’, ‘రక్త చరిత్ర 2’ (తెలుగు) చిత్రాలతో 2010లో సౌత్ ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన 2019లో ‘వినయ విధేయ రామ’ (తెలుగు), ‘లూసిఫర్’ (మలయాళం), ‘రుస్తుం’ (కన్నడ)లో నటించారు. ఈ ఏడాది ‘కడువా’ (Kaduva) (మలయాళం)లో కనిపించారు.
- ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Naga Chaitanya: నాగచైతన్యతో నేను టచ్‌లో లేను.. ‘మజిలీ’ నటి
-
India News
Delhi : దిల్లీకి ఖలిస్థానీ ఉగ్ర ముప్పు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
-
General News
NTR: తారకరత్నకు తాతగారి ఆశీర్వాదం ఉంది.. వైద్యానికి స్పందిస్తున్నారు: ఎన్టీఆర్
-
Politics News
Rahul Gandhi: భారత్ జోడో యాత్ర రేపు ముగింపు..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Odisha: ఒడిశా మంత్రిపై కాల్పులు.. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు