AR Rahman: ఆయన్ని నిందించకండి.. ఏ.ఆర్‌.రెహమాన్‌ కోసం సెలబ్రెటీల ట్వీట్స్‌

తాజాగా ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahman) కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటపై కొందరు నెటిజన్లు ఆయన్ని నిందిస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు. దీంతో పలువురు సెలబ్రెటీలు రెహమాన్‌కు మద్దతు తెలుపుతూ #standwithARRతో పోస్ట్‌లు పెడుతున్నారు.

Updated : 12 Sep 2023 14:25 IST

చెన్నై: తాజాగా ఏ.ఆర్‌.రెహమాన్‌ (AR Rahman) కాన్సర్ట్‌లో తీవ్ర గందరగోళం తలెత్తిన సంగతి తెలిసిందే. టికెట్ల కోసం అధికమొత్తంలో డబ్బు చెల్లించినప్పటికీ కనీసం స్టేజ్ దాక కూడా చేరుకోలేకపోవడంతో అభిమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై నెటిజన్లు, రెహమాన్‌ అభిమానులు ఆ కాన్సర్ట్‌ నిర్వాహకులను తిట్టిపోస్తున్నారు. అలాగే మరికొందరు రెహమాన్‌ను కూడా విమర్శిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో పలువురు సెలబ్రెటీలు ఆయనకు మద్దతుగా ట్వీట్స్ చేస్తున్నారు.

ప్రముఖ తమిళ హీరో కార్తి (Karthi) ఈ ఘటనపై ట్వీట్‌ చేశారు. ‘మనందరికీ రెహమాన్‌ 3 దశాబ్దాల నుంచి తెలుసు. ఎంతోమందికి ఆయన అభిమాన సంగీత దర్శకుడు. తాజాగా జరిగిన ఘటన కారణంగా ఆయన కూడా ఎంతో బాధపడుతుంటారు. ఆ కచేరీకి వెళ్లిన వారిలో నా కుటుంబం కూడా ఉంది. వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. దీనికి పూర్తి బాధ్యత ఆ ఈవెంట్‌ నిర్వాహకులు తీసుకుంటారని భావిస్తున్నాను. రెహమాన్‌ ఎప్పుడూ తన చుట్టూ ఉండే వాళ్లపై ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. ఈ ఘటనకు ఆయన్ని బాధ్యుడిని చేయకండి’ అని పేర్కొన్నారు. 

 సెప్టెంబర్‌ 28.. వెనక్కి వెళ్లిన మరో రెండు సినిమాలు!

అలాగే నటి ఖుష్భూ (Khushbu) కూడా దీనిపై స్పందించారు. ‘ రెహమాన్‌ ఈవెంట్‌లో అంతమంది ఇబ్బంది పడడం దురదృష్టకరం.  ఆ కాన్సర్ట్‌కు నా కుమార్తెలు, వాళ్ల స్నేహితులు కూడా వెళ్లారు. వాళ్లకు డైమండ్‌ పాస్‌ ఉన్నప్పటికీ లోపలికి ప్రవేశించడానికి అనుమతి లభించలేదు. పాస్‌ వివరాలు చూపించి వాళ్లు లోపలికి వెళ్లడానికి మూడు గంటల సమయం పట్టింది. ఆ సమస్యకు రెహమాన్ బాధ్యత వహించలేడు. ఆయనకు ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకోవడంలో ఈవెంట్‌ నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ విషయంలో రెహమాన్‌ను నిందించకండి. ఆయన తన అభిమానులను ఎప్పుడూ నిరాశపరచరు. మనమంతా ఆయనతో ఉందాం’ అంటూ #standwithARR అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.

సంగీత దర్శకుడు యువన్ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja) కూడా ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. ‘ఇలాంటి కచేరీలు నిర్వహించడం చాలా కష్టమైన పని, జనాలను నియంత్రించడంలో సమస్యలు ఎదురవుతాయి. ఇది నిర్వాహకులతో పాటు పాల్గొన్నవారిపై కూడా ఎంతో ఒత్తిడి కలిగిస్తుంటుంది. ఈ విషయంలో తోటి కళాకారుడిగా నేను రెహమాన్‌కు  మద్దతు ఇస్తాను’ అని తెలిపారు. ఇక ఈ విషయంపై ఏఆర్‌ రెహమాన్‌  ఇప్పటికే స్పందించిన సంగతి తెలిసిందే. ‘‘దురదృష్టకర పరిస్థితుల కారణంగా కాన్సర్ట్‌లోకి అడుగుపెట్టలేకపోయిన వారు.. తాము కొనుగోలు చేసిన టికెట్‌, తమకు ఎదురైన ఇబ్బందులను తెలియజేస్తూ arr4chennai@btos.in లో పోస్ట్‌ చేస్తే నా టీమ్‌ అతిత్వరలో మిమ్మల్ని సంప్రదిస్తుంది’’ అని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని