సోషల్‌మీడియాను వదులుతున్న సెలబ్రిటీలు

సినిమా ప్రచారానికి ట్విటర్‌...అందచందాలు ప్రదర్శించడానికి ఇన్‌స్టాగ్రామ్‌... అభిమానులకు దగ్గరవ్వడానికి ఫేస్‌బుక్‌ పేజీ... అభిప్రాయాలు

Published : 22 Mar 2021 12:05 IST

సినిమా ప్రచారానికి ట్విటర్‌... అందచందాలు ప్రదర్శించడానికి ఇన్‌స్టాగ్రామ్‌... అభిమానులకు దగ్గరవ్వడానికి ఫేస్‌బుక్‌... అభిప్రాయాలు పంచుకోవడానికి వాట్సాప్‌...  సామాజిక మాధ్యమాలను సెలబ్రిటీలే బాగా ఉపయోగిస్తారన్నది జగద్విదితం... అలాంటిది.. సోషల్‌ మీడియా ప్రేమలో నిండా మునిగిన తారలు ఉన్నపళంగా వాటికి బ్రేకప్‌ చెప్పేస్తున్నారు... ప్రైవసీకి భంగం కలుగుతోందంటూ ఆ యాప్‌లకి దూరంగా వెళ్లిపోతున్నారు... తెరపై నటించే మేమూ ఇక్కడా నటించలేమంటూ ఖాతాలు ఎత్తేస్తున్నారు...అలా బైబై చెప్పిందెవరు? ఎందుకిలా?

ఆమీర్‌ ఖాన్‌: ట్విటర్‌ ఫాలోయర్లు: 2.67 కోట్లు

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ఖాన్‌ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటాడు. అభిమానులతో అభిప్రాయాలు పంచుకుంటాడు. సినిమా కబుర్లు చెబుతుంటాడు. అలాంటిది మార్చి 14న తన పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న తర్వాత మొత్తం సోషల్‌ మీడియా నుంచి సెలవు తీసుకుంటున్నానంటూ షాకింగ్‌ వార్త చెప్పాడు. ‘నా బర్త్‌డే విషెస్‌ చెప్పిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది. సామాజిక మాధ్యమాల్లో ఇదే నా చివరి పోస్టు కావొచ్చు. ఇక్కడ నటించడం నాకిష్టం లేదు. ఇక సెలవ్‌’ అంటూ ఓ ట్వీట్‌ చేశాడు. మరి తన సినిమా ప్రచారం, అభిమానులతో టచ్‌లో ఉండటం ఎలా అంటే.. ‘ఆమీర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌’ అధికారిక వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు, సమాచారమూ అందుబాటులో ఉంటుందని ప్రకటించాడు. ఖాన్‌ని గతంలో కొందరు మత ఛాందసవాదులు దేశం వదిలి వెళ్లిపోవాలంటూ ట్వీట్లతో విరుచుకుపడ్డప్పుడు తాత్కాలికంగా కొన్నాళ్లు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండిపోయాడు.

సోనాక్షి సిన్హా: ట్విటర్‌ ఫాలోయర్లు: 1.6కోట్లు

గతేడాది జూన్‌లో సోనాక్షి సిన్హా ట్విటర్‌కి గుడ్‌బై చెప్పేసింది. ఎంతో ఆలోచించిన తర్వాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నానంది. ‘సామాజిక మాధ్యమాల్లో ఉండాలంటే నిత్యం మన చిత్తశుద్ధిని పరీక్షించుకుంటూ ఉండాలి. మనల్ని మనం ఆత్మరక్షణ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ చూసినా ప్రతికూలతలే. ఈ. కల్మషాన్ని నేను భరించలేకపోతున్నా. చలో.. నేను ఖాతాని డియాక్టివేట్‌ చేస్తున్నా. నాకు ఇప్పుడైనా కొంచెం మానసిక ప్రశాంతత దొరుకుతుందని ఆశిస్తున్నా. ‘ఆగ్‌ లగే బస్తీమే.. మై అప్నీ మస్తీ మే. బై ట్విటర్‌’ అంటూ ట్విటర్‌కి బ్రేకప్‌ చెప్పేముందు తన మనసులోని భావాల్ని వెల్లడించింది. మరి ఫ్యాన్స్‌ని పలకరించడం ఎలా? అంటే యూట్యూబ్‌లో ‘సోనా సేస్‌ సెషన్స్‌’ పేరుతో అప్పుడప్పుడూ ఇంటరాక్ట్‌ అవుతోంది. ట్విటర్‌ని వదిలేసినా సోనా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికీ యాక్టివ్‌గానే ఉంది.

షకీబ్‌ సలీం: ట్విటర్‌ ఫాలోయర్లు: 42 లక్షలు

మోడల్‌, బాలీవుడ్‌ నటుడు షకీబ్‌ సలీం.. సామాజిక మాధ్యమాలకు బై చెప్పడాన్ని కాస్త కవితాత్మకంగా వివరించాడు. ‘హే ట్విటర్‌. మనం మొదటిసారి కలిసినప్పుడు నువ్వు ఒంటరివి. నా భావోద్వేగాలు పంచుకోవడానికి నువ్వొక అద్భుతమైన స్నేహితుడిగా, వేదికగా కనిపించావు. నీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఎన్నో వైరుధ్యమైన అభిప్రాయాలు విన్నాను. కానీ రాన్రాను నువ్వు నాకు అస్సలు నచ్చడం లేదు. నువ్వు ఇప్పుడు ఇతరుల్ని అసహ్యించుకునే కేంద్రంగా మారావు. బుల్లీయింగ్‌కి వేదికయ్యావు. నిన్ను చూస్తున్నప్పుడల్లా నా ఆలోచనలన్నీ ప్రతికూలంగా మారుతున్నాయి. ఇలాంటి నెగెటివ్‌ ఎనర్జీ నాకు అక్కర్లేదని అర్థమైంది బై’ అంటూ ట్వీట్లకు సెలవు ప్రకటించాడు.

సూరజ్‌ పంచోలీ: ఇన్‌స్టా ఫాలోయర్లు: 15లక్షలు

ఆదిత్య పంచోలీ కుమారుడు, వర్ధమాన నటుడు సూరజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాని వదిలేశాడు. ఖాతాలోని అన్ని పోస్ట్‌లు, ఫొటోలు తొలగించాడు. ‘నేను శ్వాస పీల్చుకోవడానికి కాస్త సమయం కావాలి. ఇన్‌స్టాగ్రామ్‌ సానుకూల ప్రపంచానికి ఓ మంచి వేదిక అయినప్పుడు తప్పకుండా తిరిగొస్తా’ అని ప్రకటించాడు. జియాఖాన్‌, దిశా సాలియన్‌, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌లు ఆత్మహత్య చేసుకున్నప్పుడు చాలామంది సూరజ్‌ సామాజిక ఖాతాల వేదికగా విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. దూషించారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు సూరజ్‌. ఫలితంగానే ఈ నిష్క్రమణ.

నేహా భాసిన్‌: ట్విటర్‌ ఫాలోయర్లు: 30లక్షలు

పాట, అందంతో ఆకట్టుకున్న నేహా భాసిన్‌ తన ట్వీట్లతో అభిమానులకు దగ్గరైంది. అదేసమయంలో తనంటే గిట్టనివాళ్లు ట్విటర్‌ వేదికగా ట్రోలింగ్‌ చేసేవాళ్లు. కొన్నిసార్లు వాళ్లతో వాదనకు దిగినా తర్వాత ఇంక ముందుకెళ్లలేకపోయింది. ‘ఇది విషతుల్య ప్రపంచం. మంచి కారణంతో ట్విటర్‌ని వదలేస్తున్నా. ఇది నా మెదడుని ఛిద్రం చేస్తోంది. నేను కేవలం సంగీతంతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నా. కానీ, మురికి మనస్తత్వం ఉన్న వాళ్లు నాతో వాదిస్తున్నారు. చాలా తేలికగా నా వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకొని వస్తున్నారు. వాళ్లకి నా మెదడులో స్థానం ఇవ్వదలచుకోలేదు. గుడ్‌బై ట్విటర్‌’ అంటూ ట్వీట్‌ చేసి ఖాతాను మూసేసింది.

ఎందుకు వదిలేస్తున్నారంటే..

సెలబ్రిటీలకు ఎంత ఎక్కువ ప్రచారం దక్కితే అంత ప్రయోజనం. పైసా ఖర్చు లేకుండా సోషల్‌ మీడియా ఆ పని చేస్తోంది. తారలు కోట్లమందికి దగ్గర చేస్తోంది. అయినా కొందరు వీటిని వదిలేయడానికి కారణం.. ఈ సామాజిక మాధ్యమాలతో బాగా విసిగిపోవడమే. దర్శకుడు శశాంక్‌ ఖైతాన్‌ మాటల్లో చెప్పాలంటే.. ‘సోషల్‌ మీడియా రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దీన్ని సరిగ్గా వాడుకోకపోతే చాలా ప్రమాదకరం. సున్నిత మనస్కులకు ఇది అనువైన ప్రదేశం కాదు. ఎవరో ట్వీట్‌ చేశారనో, కామెంట్‌ పెట్టారనో... దాన్ని పరిగణనలోకి తీసుకొని బాధ పడే మనస్తత్వం ఉన్నవాళ్లకి ఇది పనికిరాదు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా’ అంటాడు.

సహజంగానే పేరు, ఫేమ్‌ ఉన్న హీరోహీరోయిన్లని లక్షలు, కోట్లమంది అనుసరిస్తుంటారు. అందులో వ్యతిరేకించేవాళ్లూ ఉంటారు. ఏవైనా వివాదాస్పద సంఘటనలు జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సెలబ్రిటీలు వెంటనే స్పందించాలని కోరుకుంటారు. సాయం చేయడానికి ముందుకు రావాలని ఆశిస్తారు. వాళ్లు ఎక్కడ ఉన్నారు? ఏ పరిస్థితుల్లో ఉన్నారని పట్టించుకోరు. అనుకున్నట్టు జరగనప్పుడు వ్యక్తిగత దూషణకు సైతం వెనుకాడరు. పోనీ తారలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకున్నా అభిమానుల్లో కొందరికి నచ్చదు.

కొన్ని వ్యాఖ్యలు, కామెంట్లు, ట్వీట్లు అనవసర వివాదాల్లోకి లాక్కెళ్తాయి. వీటికితోడు ట్రోలింగ్‌లు, గాసిప్‌లు.. సరేసరి. నటి కృతి సనన్‌ సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న బాధల్ని ట్వీట్‌ రూపంలో చెప్పింది. ‘సోషల్‌ మీడియా ఓ నకిలీ ప్రపంచం. పూర్తిగా విషతుల్యం. ఒకరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోయినా నిలదీస్తారు. బాధల్లో ఉన్నవారిని ఓదార్చకపోయినా తిడతారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామన్నది వాళ్లకి అనవసరం. మన కష్టసుఖాలు, బాధలు ఈ నకిలీ ప్రపంచానికి పట్టవు. ట్వీట్లు, కామెంట్లతో మమ్మల్ని నియంత్రించాలని చూస్తారు’ అని ఆవేదనని ట్వీట్‌ రూపంలో చెప్పింది. ఇవన్నీ భరించే బదులు సోషల్‌ మీడియా నుంచి సెలవు తీసుకుంటే మంచిది అనే భావనలో పడిపోయి దానికి బైబై చెబుతున్నారు కొందరు తారలు.

కింగ్‌ఖాన్‌ షారూఖ్‌ఖాన్‌, దర్శకుడు అనుభవ్‌ సిన్హా, పాప్‌ కింగ్‌ జస్టిన్‌ బీబర్‌, ఎమ్మా స్టోన్‌, కీరా నైట్లీ, మేఘన్‌ మార్‌క్లే, మెగాన్‌ ఫాక్స్‌, లిండ్సే లోహన్‌, కేన్‌ వెస్ట్‌, రిహానా, మిలీ సైరస్‌.. వీళ్లంతా సామాజిక మాధ్యమాలకు బైబై చెప్పినవాళ్లే. ఇందులో కొందరు మళ్లీ తిరిగొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని