Naga Chaitanya: ఆయన లేనిదే ‘కస్టడీ’ లేదు: నాగచైతన్య

నాగచైతన్య హీరోగా తెలుగు, తమిళ్‌లో దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన చిత్రం ‘కస్టడీ’. మే 12న సినిమా విడుదలకానున్న నేపథ్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాగచైతన్య పాల్గొన్నారు.

Published : 10 May 2023 18:14 IST

విశాఖపట్నం: అరవింద స్వామి (Arvind Swamy) లేనిదే ‘కస్టడీ’ (Custody) సినిమా లేదని నటుడు నాగచైతన్య అక్కినేని (Naga Chaitanya) అన్నారు. ఆయన పోషించిన పాత్ర ఆధారంగానే సినిమాకి ఆ టైటిల్‌ పెట్టామని తెలిపారు. సినిమా త్వరలో విడుదలకానున్న సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. చైతన్య హీరోగా కోలీవుడ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు (venkat prabhu) తెరకెక్కించిన చిత్రమిది. కృతిశెట్టి (krithi shetty) కథానాయిక. అరవింద స్వామితోపాటు ప్రియమణి, శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 12న (custody on may 12th) ప్రేక్షకుల ముందుకు రానుంది.

* ఈ సినిమాకి ‘కస్టడీ’ పేరు ఎందుకు పెట్టారు?

నాగచైతన్య: అరవింద స్వామి పోషించిన పాత్ర ఆధారంగా ఆ టైటిల్‌ పెట్టాం. ట్రైలర్‌లో దాన్ని రివీల్‌ చేశాం. సినిమా చూస్తే ఆ పేరెందుకు పెట్టామో మీకు బాగా అర్థమవుతుంది. ఆయన ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారనే విషయం తెలిగానే మా టీమ్‌కి నమ్మకం పెరిగింది. ఆయన లేకపోతే ఈ ‘కస్టడీ’ లేదు.

* కథ నచ్చి, దర్శకుణ్ని హగ్‌ చేసుకున్నానన్నారు. అంతగా ఆకట్టుకున్న అంశమేంటి?

నాగచైతన్య: ఈ సినిమాకి సంబంధించి ముందు ఓ పాయింట్‌ చెప్పిన దర్శకుడు వెంకట్‌ ప్రభు కొన్ని నెలల తర్వాత పూర్తి స్టోరీ వినిపించారు. ఆ కథ, స్క్రీన్‌ప్లే నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

* మీ నుంచి పాన్‌ ఇండియా సినిమాని ఎప్పుడు ఆశించొచ్చు?

నాగచైతన్య: ఏ కథనైనా బలంగా నమ్మి తెరకెక్కిస్తే అది ఆటోమేటిక్‌గా పాన్‌ ఇండియా స్థాయికి వెళ్తుంది. ప్రత్యేకంగా దాని కోసం ఎలాంటి ప్రయత్నం చేయనవసరంలేదనేది నా అభిప్రాయం.

* చిత్ర పరిశ్రమ విశాఖపట్నంపై ఎలాంటి అభిప్రాయంతో ఉంది. అన్నపూర్ణ స్టూడియోలాంటి సంస్థను ఇక్కడ నిర్మించే అవకాశం ఉందా?

నాగచైతన్య: చిత్ర పరిశ్రమకు విశాఖపట్నంపై ఎంతో ప్రేమ ఉంది. అందుకే మేం ఇక్కడికి వచ్చి షూటింగ్స్‌ చేస్తుంటాం. ప్రమోషన్స్‌ కోసం వస్తుంటాం. ఆ క్రమంలోనే ఈరోజు నేను మీ ముందున్నా. వ్యక్తిగతంగా వైజాగ్‌ని నేను ఇష్టపడతా. గతంలోనే నేను నటించిన ‘ప్రేమమ్‌’, ‘మజిలీ’ సినిమాల చిత్రీకరణ అధిగభాగం ఇక్కడే జరిగింది. స్టూడియో ఆలోచన ప్రస్తుతానికి లేదు.

* మీ తమ్ముడు అఖిల్‌తో కలిసి నటిస్తారా?

నాగచైతన్య: మంచి కథ ఉంటే తప్పకుండా మేం కలిసి నటిస్తాం. తమ్ముడితో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని