Dhanush: ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: ధనుష్‌

‘సార్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో తెలుగు ప్రేక్షకులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు నటుడు ధనుష్‌. ‘ఈ రోజు నాకెంతో ప్రత్యేకం’ అని పేర్కొన్నారు.

Updated : 08 Feb 2023 21:29 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు ధనుష్‌ (Dhanush) హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘సార్‌’ (Sir). సంయుక్తా మేనన్‌ (Samyuktha Menon) కథానాయిక. నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ  సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుకను బుధవారం నిర్వహించారు.

ధనుష్‌ మాట్లాడుతూ.. ‘‘నేను నేరుగా తెలుగులో నటించిన తొలి చిత్రమిది. ఈ సినిమా వేడుకలో మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నాకెంతో ప్రత్యేకం. నిన్నమొన్నటి వరకు తమిళ్‌ సినిమా, తెలుగు సినిమా, కన్నడ సినిమా.. ఇలా పలు రకాలుగా పిలిచేవారు. ఇప్పుడు అవేవీ లేవు. ఒక్క ఇండియన్‌ ఫిల్మ్‌ అనేదే ఉంది. సార్‌ చిత్రంలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు వెంకీ అట్లూరి, త్రివిక్రమ్‌, నాగవంశీలకు థాంక్స్‌’’ అని ధనుష్‌ అన్నారు.

మీమ్‌ చూసి ప్రేమకథలు తీయకూడదనుకున్నా: వెంకీ

‘‘నేను మీమ్స్‌ ఎక్కువగా ఫాలో అవుతా. నా ‘రంగ్‌ దే’ విడుదలైన తర్వాత వచ్చిన ఓ మీమ్‌ నన్ను ఆలోచింపజేసింది. ‘నారప్ప’ చిత్రాన్ని ఒకవేళ నేను తీస్తే, అది కూడా సెకండాఫ్‌ లండన్‌లో సాగుతుందనేదే ఆ మీమ్‌. ‘ఇక చాలు. లవ్‌స్టోరీలు చేయకూడదు’ అని దాన్ని చూశాక ఫిక్స్‌ అయ్యా. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో ‘సార్‌’ కథ రాసి, నాగవంశీకి వినిపించా. ఆ తర్వాత ధనుష్‌ను కలిశా. ఆయన నా స్టోరీ వింటే చాలు నటించేందుకు ఎస్‌ చెప్పినా, నో చెప్పినా ఫర్వాలేదనుకున్నా. వినడం పూర్తయిన తర్వాత డేట్స్‌ ఎప్పుడు కావాలి అని ఆయన అడగడంతో సర్‌ప్రైజ్‌గా ఫీలయ్యా. ధనుష్‌- సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే ఎన్నో హిట్‌ పాటలొచ్చాయి. ఈ సినిమాలోని పాటలు ఎంత బాగుంటాయో నేపథ్య సంగీతం అంతకంటే బాగుంటుంది. దాని గురించి మీరంతా ప్రత్యేకంగా మాట్లాడతారు. సంయుక్తా మేనన్‌ ఈ సినిమాలోని మీనాక్షి పాత్రలో ఒదిగిపోయింది. హైపర్‌ ఆది ఈ సినిమాతో కోలీవుడ్‌లో కూడా బాగా పాపులర్‌ అవుతాడనే నమ్మకం నాకుంది’’ అని వెంకీ అట్లూరి తెలిపారు. సంయుక్తా మేనన్‌, ఆది, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని