Directors turns Villains: దర్శకులు విలన్లుగా కనిపిస్తే.. ‘నా సామిరంగ’!

విలన్లుగా నటించి ప్రేక్షకులను మెప్పించిన/అలరించనున్న దర్శకులపై ప్రత్యేక కథనం. ఏ డైరెక్టర్‌ ఏ సినిమాలో నటించారంటే?

Published : 19 Sep 2023 09:25 IST

తెర వెనుక ఉండే దర్శకులు తెరపై కనిపించడం కొత్తేమీకాదు. కొందరు డైరెక్టర్లు తమ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించగా, ఇంకొందరు ఇతరుల చిత్రాల్లో అతిథులుగా మెరిసి ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చేవారు. అవన్నీ పాజిటివ్‌ క్యారెక్టర్లే. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. దర్శకులు.. విలన్లుగా నటించి ఆసక్తి రేకెత్తిస్తున్నారు. అలాంటి పలువురు దర్శకుల గురించి తెలుసుకుందాం..

శ్రీకాంత్‌ అడ్డాల

‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala). ఇలాంటి క్లాస్‌ డైరెక్టర్‌ ‘నారప్ప’ (వెంకటేశ్‌ హీరో)లాంటి మాస్‌ చిత్రాన్ని తెరకెక్కించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు మరో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం ‘పెదకాపు 1’ (Peda Kapu 1)ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారాయన. ఇందులో ఆయన నెగెటివ్‌ ఛాయలున్న పాత్ర పోషించారు. ముందుగా ఆ క్యారెక్టర్‌ కోసం మలయాళ సినిమా ‘కుంబలంగీ నైట్స్’లో నటించిన ఒకరిని ఎంపిక చేశారట. అయితే, అతడు షూటింగ్‌కు వస్తానని చెప్పి రెండు సార్లు మాట తప్పడంతో.. ఓ సన్నిహితుడు సలహా మేరకు శ్రీకాంతే నటించాల్సి వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఆయనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీకాంతే మెయిన్‌ విలనా? మరొకరా? అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ‘అఖండ’ నిర్మాత రవీందర్‌ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్‌ కర్ణ ‘పెదకాపు’తో హీరోగా పరిచయం అవుతున్నాడు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ఈ నెల 29న విడుదల కానుంది. సీక్వెల్‌ ‘పెదకాపు 2’ త్వరలో రానుంది. శ్రీకాంత్‌ అడ్డాల గతంలో వచ్చిన ‘ఆర్య’, ‘బొమ్మరిల్లు’ సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే.


కరుణ కుమార్‌

‘పలాస 1978’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించారు కరుణ కుమార్‌ (Karuna Kumar). ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’లో తొలిసారి తెరపై కనిపించిన ఆయన ‘నా సామిరంగ’ (Naa Saami Ranga)లో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో కరుణ కుమార్‌కు డైలాగ్స్‌ లేకపోయినా హావభావాలతో ఆకట్టుకున్నారు. ఆయన ప్రస్తుతం.. వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘మట్కా’ చిత్రం తెరకెక్కిస్తున్నారు.


ఎస్‌.జె. సూర్య

పవన్‌ కల్యాణ్‌ ‘ఖుషి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన తమిళ దర్శకుడు ఎస్‌.జె. సూర్య (SJ Suryah). ఆ తర్వాత, మహేశ్‌ బాబుతో ‘నాని’, పవన్‌ కల్యాణ్‌తో ‘కొమరం పులి’ తెరకెక్కించారు. నటుడవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సూర్య అనుకోకుండా దర్శకత్వంవైపు వెళ్లారు. గుర్తింపులేని ఓ పాత్రతో ‘నెతియడి’ అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన సూర్య.. ‘వాలి’తో దర్శకుడిగా మారారు. అప్పటి నుంచీ తన చిత్రాలతోపాటు వేరే దర్శకులు చిత్రాల్లోనూ ఆయన గెస్ట్‌ రోల్‌ ప్లే చేస్తూనే ఉన్నారు. నటనపై ఉన్న అమితాసక్తితో స్వీయ దర్శకత్వంలో ‘న్యూ’ చిత్రంలో కథానాయకుడి పాత్ర పోషించారు. ‘స్పైడర్‌’లో తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ తెరకెక్కించిన చిత్రంలో భైరవుడుగా విలనిజం పండించారు. సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోలేకపోయినా సూర్య కెరీర్‌ని ఓ మలుపు తిప్పింది. అప్పటి నుంచి ఆయన నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలకు కేరాఫ్‌గా నిలిచారు. అలా ఆయన నటించిన తాజా చిత్రం ‘మార్క్‌ ఆంటోని’ (Mark Antony) థియేటర్లలో సందడి చేస్తోంది. విశాల్‌ హీరో. ప్రస్తుతం ‘జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌’, రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ తదితర సినిమాల్లో సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.


సముద్ర ఖని

సముద్రఖని (Samuthirakani) కూడా యాక్టర్‌కావాలనుకుని డైరెక్టర్‌గా మారిన వ్యక్తే. పలు తమిళ ధారావాహికల్లో నటించిన ఆయన ‘పార్థలే పరవశం’లో ఓ చిన్న పాత్ర పోషించారు. తొలిసారిగా ‘ఉన్నై చరణదైందెన్‌’ సినిమాకి దర్శకత్వం వహించారు. ‘శంభో శివశంభో’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఓవైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ‘ఒప్పమ్‌’ (మలయాళం), అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’, మహేశ్‌ బాబు ‘సర్కారు వారి పాట’, నితిన్‌ ‘మాచర్ల నియోజకవర్గం’, ధనుష్‌ ‘సార్‌’ తదితర సినిమాల్లో నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలు పోషించి మెప్పించారు. ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘భారతీయుడు 2’ సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ల ‘బ్రో’ (Bro) సినిమాని తెరకెక్కించింది ఈయనే.


గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌

నాగ చైతన్య ‘ఏమాయ చేసావె’, వెంకటేశ్‌ ‘ఘర్షణ’, సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్’ తదితర చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon). ‘కాఖా కాఖా’, ‘ఎన్నై అరింధాళ్‌’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ తదితర చిత్రాల్లో గౌతమ్‌ మేనన్‌ పోలీసు అధికారిగా కనిపించి అలరించారు. సందీప్‌ కిషన్‌ ‘మైఖేల్‌’ తదితర చిత్రాల్లో విలన్‌గాను మెప్పించారు. ‘హిట్‌లిస్ట్‌’ అనే తమిళ సినిమాలోనూ నెగెటివ్‌ ఛాయలున్న పాత్ర పోషించారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని