TollyWood Movies: ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు..!

అల వైకుంఠ‌పుర‌ములో అల్లు అర్జున్ చెప్పిన‌ట్టు ఎవ‌రూ కావాల‌ని గ్యాప్ ఇవ్వ‌రు.. వ‌స్తుందంతే. ఇత‌ర చిత్ర ప‌రిశ్ర‌మ‌ల న‌టుల విష‌యంలోనూ జ‌రిగేది ఇదే. నేరుగా తెలుగు సినిమాల్లో న‌టించాల‌ని ఉన్నా కొన్ని కార‌ణాల వల్ల‌ వీలుప‌డ‌దు.

Published : 03 Jun 2021 10:04 IST

‘అల వైకుంఠ‌పుర‌ములో’ అల్లు అర్జున్ చెప్పిన‌ట్టు ఎవ‌రూ కావాల‌ని గ్యాప్ ఇవ్వ‌రు.. వ‌స్తుందంతే. ఇత‌ర చిత్ర ప‌రిశ్ర‌మ‌ల న‌టుల విష‌యంలోనూ జ‌రిగేది ఇదే. నేరుగా తెలుగు సినిమాల్లో న‌టించాల‌ని ఉన్నా కొన్ని కార‌ణాల వల్ల‌ వీలుప‌డ‌దు. ఓ ర‌కంగా పాన్ ఇండియా స్థాయి చిత్రాలు ఆ లోటును తీరుస్తుంటే.. మ‌రికొన్ని తెలుగు సినిమాలు ఆయా న‌టుల‌కే అవ‌కాశం ఇవ్వాలంటుంటాయి. 90ల్లోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మైన కొంద‌రు మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఎవ‌రా న‌టులు.. ఆ చిత్రాలేంటి చూసేద్దాం...

1987 త‌ర్వాత ఇప్పుడే..

1987లో వ‌చ్చిన ‘త్రిమూర్తులు’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకి ప‌రిచ‌యం అయ్యారు అనుప‌మ్‌ ఖేర్‌. భార‌తీయ భాష‌ల‌తోపాటు ఇంగ్లిష్, చైనీస్ భాష‌ల్లోనూ న‌టించిన దిగ్గజ న‌టుడాయ‌న‌. 500లకు పైగా చిత్రాల్లో క‌నిపించిన అనుప‌మ ఖేర్ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. చందూ మొండేటి తెర‌కెక్కిస్తోన్న ‘కార్తికేయ 2’ లో ధ‌న్వంత‌రి అనే పాత్ర పోషిస్తున్నారు అనుప‌మ్‌. క‌థ‌కే కీల‌కంగా నిలిచే పాత్ర అని స‌మాచారం. నిఖిల్ క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న చిత్ర‌మిది. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ ప‌తాకంపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. సుమారు 34 ఏళ్ల త‌ర్వాత అనుప‌మ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండ‌టంతో ఈ సినిమాపై ఆస‌క్తి పెరుగుతోంది.

క‌మ్లి త‌ర్వాత విరాట‌ప‌ర్వం..

హిందీ, ఇంగ్లిష్‌, మ‌రాఠీ, మల‌యాళం.. భాష ఏదైనా త‌న హావభావాల‌తో ప్రేక్ష‌కుల్ని కట్టిపడేసే న‌టి నందితా దాస్‌. ‘క‌మ్లి’ అనే నాయికా ప్రాధాన్య చిత్రంతో తెలుగు తెరకి ప‌రిచ‌య‌మైంది. ఇందులోని ఆమె న‌ట‌న‌కు నంది అవార్డు ద‌క్కింది. కె.ఎన్‌.టి.శాస్త్రి దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా 2006లో వ‌చ్చింది. ఆ త‌ర్వాత అలాంటి పాత్ర కోస‌మే ఎదురు చూసిన నందిత‌కు ‘విరాట ప‌ర్వం’ చిత్రం ఎదురైంది. రానా, సాయి ప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. ఇందులో ఓ కీల‌క పాత్ర పోషించింది నందిత‌. ఈ సినిమా ఖ‌రారు చేసిన‌ప్పుడే త‌న పాత్ర‌పై ధీమా వ్య‌క్తం చేసిందామె. ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా వాయిదా ప‌డింది.

చంద్రలేఖ‌లో అలా.. కేజీయ‌ఫ్‌లో ఇలా

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కనిపించిన తెలుగు చిత్రం ‘చంద్ర‌లేఖ‌’. నాగార్జున హీరోగా కృష్ణ‌వంశీ  తెర‌కెక్కించిన ఈ సినిమాలో అతిథి పాత్ర పోషించారు సంజ‌య్‌. ఆ త‌ర్వాత డ‌బ్బింగ్ సినిమాల‌తో తెలుగు వారిని ప‌ల‌క‌రించారు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలు భాషాబేధం లేకుండా అన్ని ప‌రిశ్ర‌మ న‌టుల్ని ఒక‌టిగా నిలుపుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2’ తో అటు బాలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌, కోలీవుడ్ ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ చిత్రంలో అధీరా అనే పాత్ర పోషిస్తున్నారు సంజ‌య్‌. య‌శ్ హీరోగా క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న సినిమా ఇది. త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

ర‌థ‌సార‌థితో ప‌రిచ‌య‌మై..

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, వినోద్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ‘ర‌థ‌సార‌థి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ర‌వీనా టాండ‌న్‌. ‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశ వీధిలో’ మెరిసి తన అందంతో ఆకట్టుకుంది.  2014లో వ‌చ్చిన ‘పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద’ చిత్రంలో న‌టించిన ర‌వీనా.. ఇప్పుడు ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 2’ తో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మ‌హా స‌ముద్రంతో మ‌రో ప్ర‌యాణం..

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మ‌రిల్లు’, ‘ఓయ్‌’, ‘కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం’ త‌దిత‌ర చిత్రాల‌తో యువ‌త‌లో మంచి గుర్తింపు పొందాడు సిద్ధార్థ్‌. అటు త‌మిళ డ‌బ్బింగ్ చిత్రాల‌తో, ఇటు స్ట్రైట్ తెలుగు సినిమాల‌తో అల‌రించిన సిద్దార్థ్ కాస్త విరామం ఇచ్చాడు. 2013లో వ‌చ్చిన ‘బాద్ షా’ లో అతిథిగా మెరిసిన సిద్ధు ఇప్పటి వ‌ర‌కు నేరుగా మ‌రో తెలుగు చిత్రం చేయ‌లేదు.  ‘మ‌హా స‌ముద్రం’తో ఆ లోటు తీర్చ‌నున్నాడు. శ‌ర్వానంద్, సిద్ధార్థ్ క‌థానాయ‌కులుగా అజ‌య్ భూప‌తి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోంది. ‘ఓ మంచి ప్రాజెక్టు, పాత్రతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నా’ అంటూ త‌న ఆనందం వ్య‌క్తం చేశాడు సిద్ధార్ధ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని