FIFA World Cup: ఫిఫా ఫైనల్‌ సెలబ్రేషన్స్‌.. నోరా ఫతేహి స్పెషల్‌ అట్రాక్షన్‌..

‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు ముందు బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి (Nora Fatehi) తన డ్యాన్స్‌ ప్రదర్శనతో అలరించేందుకు సిద్ధమైంది. బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ తన డ్యాన్స్‌ అలరించిన ఆమె గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 29 Oct 2023 11:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫుట్‌బాల్‌ సంబరం ‘ఫిఫా వరల్డ్‌కప్‌’ (FIFA World Cup) ముగింపునకు వచ్చేసింది. అర్జెంటీనా, ఫ్రాన్స్‌ దేశాలు ఫైనల్‌కు చేరాయి. ఆదివారం జరిగే తుది పోరులో ప్రపంచకప్‌ను ఏ దేశం ముద్దాడుతుందో చూసేందుకు క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు అదిరిపోయే ఈవెంట్లతో అటు మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు, ఇటు టీవీల ముందు కూర్చొన్న వారినీ అలరించడానికి ఫిఫా నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి (Nora Fatehi) డ్యాన్స్‌ ప్రదర్శన ఏర్పాటు చేశారు.  ఫైనల్‌ పోరు ముందు నోరా అదిరే స్టెప్‌లతో పాటు, తన అందాలతో కనువిందు చేయనుంది. మరోవైపు ఆమె ఇప్పటికే ఖతార్‌ చేరుకుంది. మరి ఫిఫా లాంటి అంతర్జాతీయ ఈవెంట్‌లో డ్యాన్స్‌ చేసే అవకాశాన్ని దక్కించుకున్న ఆమె గురించి ఆసక్తికర విషయాలు తెలుసా?

💃 బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ పలు ఐటమ్‌ సాంగ్స్‌కు డ్యాన్స్‌ చేసిన నోరా ఒక కెనడియన్‌ నటి. అంతేకాదు, ఆమె మోడల్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా మాత్రమే కాదు, నిర్మాతగానూ వ్యవహరించి తనొక మల్టీ టాలెండెట్‌ అనిపించుకుంది. ఫిఫా థీమ్‌ సాంగ్‌లోనూ ఆమె డ్యాన్స్ చేయడం విశేషం.

💃 2014లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం రోర్‌: టైగర్స్‌ ఆఫ్‌ ది సుందర్‌బన్స్‌ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ వెంటనే తెలుగు సినిమా ఆఫర్‌ తలుపు తట్టింది. ఎన్టీఆర్‌-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘టెంపర్‌’లో ‘ఇట్టాగే రెచ్చిపోనా’ పాటకు డ్యాన్స్‌ చేసి, ఓ ఊపు ఊపేసింది.

💃 బాలీవుడ్‌లో అతి పెద్ద రియాల్టీ షో అయిన ‘బిగ్‌బాస్‌’లోనూ తనదైన ముద్రవేసింది నోరా ఫతేహి(Nora Fatehi). ‘బిగ్‌బాస్‌ సీజన్‌-9’లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఎంటర్‌ అయిన ఆమె, ఆ తర్వాత 84వ రోజు బయటకు వచ్చేసింది. అంతేకాదు, ‘జలక్‌ దిఖల్‌జా సీజన్‌9’లోనూ పాల్గొంది.

💃 తెలుగులో ఆమె చేసిన ఐటమ్స్‌ సాంగ్స్‌ యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘బాహుబలి’లో ‘మనోహరి’ పాటలో ప్రభాస్‌తో ఆడి పాడింది. ఆ తర్వాత ‘కిక్‌2’లో ‘కిరుకు కిక్‌’, లోఫర్‌లో ‘నొక్కేయ్‌ దోచేయ్‌’, ఊపిరిలో ‘డోర్‌ నెంబర్‌’ తదితర పాటల్లో ఆడి పాడింది.

💃 బాలీవుడ్‌లో నోరాకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఆమె చేసిన ఐటమ్స్‌ సాంగ్స్‌ యూట్యూబ్‌లో విపరీతంగా ట్రెండ్‌ అయ్యాయి. ‘సత్యమేవజయతే’లో ‘దిల్‌బర్‌’, ‘స్ట్రీ’లో కామరియా, ‘సత్యమేవ జయతే2’లో ‘కుసు కుసు’, ‘యాన్‌ యాక్షన్‌ హీరో’ ‘జాదా నషా’ వంటి పాటలు పాపులర్‌ అయ్యాయి. అంతేకాదు, పదికి పైగా మ్యూజిక్‌ వీడియోల్లో పాటలు పాడి మెప్పించింది. ఆమె డ్యాన్స్‌ చేసిన ‘దిల్బర్‌’ సాంగ్‌ యూట్యూబ్‌లో బిలియన్‌ వ్యూస్‌కు పైగా సాధించింది.

💃 నటిగానూ పలు సినిమాల్లో నోరా (Nora Fatehi) తళుక్కున మెరిసింది. ‘భారత్‌’, ‘బాట్లా హౌస్‌’, స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డీ, భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్ ఇండియా, థ్యాంక్‌ గాడ్‌ వంటి చిత్రాల్లో నటించినా, ఐటమ్‌ సాంగ్స్‌తో పోలిస్తే, తక్కువ గుర్తింపు లభించింది. ఇక ‘స్టార్‌ వర్సెస్‌ఫుడ్‌: సీజన్‌2’, ‘మూవింగ్‌ మలైక’ వంటి వెబ్‌సిరీస్‌లను నోరాహి నటించింది. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌ అయిన ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఎలాంటి డ్యాన్స్‌ నంబర్‌తో నోరాహి కనువిందు చేస్తుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని