Shanti Swaroop: ‘నేను చదివిన అత్యంత విషాదకరమైన వార్తలివే’: శాంతి స్వరూప్‌ అనుభవాలు

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ తన అనుభవాలను గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.

Updated : 05 Apr 2024 15:11 IST

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ (Shanti Swaroop) నేడు కన్నుమూశారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1983 నుంచి 2011 వరకు దూరదర్శన్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేసిన ఆయన జీవితంలోని అనుభవాలను గతంలో పంచుకున్నారు. ఒకసారి వాటిని గుర్తుచేసుకుందాం.

ఇలా సుపరిచితమయ్యారు..

ఇప్పుడంటే ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్‌ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఏ వార్త అయినా క్షణాల్లో తెలిసిపోతుంది. మూడు దశాబ్దాల క్రితం పరిస్థితి వేరు.. అందుకే శాంతి స్వరూప్‌ (Shanti Swaroop).. గొంతు కోసం కొన్ని లక్షల మంది టీవీలకు అతుక్కుపోయేవారు. సాయంత్రం 7 గంటలకు దూరదర్శన్‌లో వచ్చే మ్యూజిక్‌ వింటే చాలు, ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చేవాళ్లు. అలా మొట్టమొదటి తెలుగు టీవీ న్యూస్‌ రీడర్‌గా అందరికీ సుపరిచితమయ్యారు శాంతి స్వరూప్‌. 

అందరూ భయపడ్డారు..

ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు వార్తలు చదివిన వ్యక్తి శాంతి స్వరూప్‌ ఒక్కరే. న్యూస్‌ రీడర్‌గా, వ్యాఖ్యాతగా అందరినీ ఆకట్టుకున్నారు. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణ శైలి. తెలుగు భాషపై ఎంత పట్టు ఉందో ఆయన మాటల్లోనే తెలుస్తుంది. అప్పట్లో టెలీప్రాంప్టర్‌ లేదు. దీంతో స్క్రిప్ట్‌ పేపర్లనే ఆయన బట్టీ పట్టి చదివేవారు. వార్తలు ప్రారంభమైన పదేళ్లపాటు ఇదే పరిస్థితి. ఆయనెక్కడ తప్పులు చదువుతారో అని అక్కడున్నవారంతా భయపడేవారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక సందర్భంలో వెల్లడించారు.

సందర్భోచితంగా చదివేవారు..

వార్తలోని భావం ప్రేక్షకులకు అందాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకే ఆయన సందర్భోచితంగా వార్తలు చదివేవారు. ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతున్నట్లుగానో, తోటి వారికి చెబుతున్నట్లుగానో చదివేవారు. అదే ఆయన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది.

శాంతి స్వరూప్‌ ఎదుర్కొన్న సవాలు..

కేంద్ర ప్రభుత్వం నుంచి పది పేజీల రిపోర్టు ఇంగ్లిషులో ప్రతిరోజూ హైదరాబాద్ దూరదర్శన్‌కు వచ్చేది. దాన్ని అనువదించి, రికార్డు చేసి ప్రసారం చేసే బాధ్యతను యాజమాన్యం శాంతి స్వరూప్‌కు అప్పగించింది. ఆ పని చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే ఆయన ఆ రిపోర్టును తెలుగులోకి అనువదించకుండా, ఇంగ్లిష్‌లోనే ముందుగా చదివి అర్థం చేసుకుని వార్తలు చదివేవారు. ఆ పని చేయడం సవాలుతో కూడినది అయినా, ఆయన ఒక్క తప్పు కూడా జరగకుండా చదవడంతో అధికారులంతా ప్రశంసలు కురిపించేవారు. 

ఆయన చదివిన అత్యంత విషాదకరమైన వార్తలివే..

ఎన్నో రకాల వార్తలు చదివిన ఆయన రెండు వార్తలను మాత్రం అత్యంత విషాదకరమైనవని చెప్పారు. ‘‘ఇందిరాగాంధీ హత్య వార్త. ఆవిడ ఉదయం చనిపోతే సాయంత్రం వరకు ఆ విషయం వెల్లడించలేదు. ఆ తర్వాత 10 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఆ పది రోజులు టీవీ పెడితే విషాద సంగీతమే వచ్చేది. ఆవిడ పార్దీవదేహాన్ని తెరపై చూపిస్తుంటే వెనకాల నా గొంతు వినిపించేది. అలాగే రాజీవ్‌గాంధీ మరణవార్త కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇవే నా సర్వీసులో నేను చదివిన విషాద వార్తలు’’ అని చెప్పారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని