రివ్యూ: థప్పడ్‌ 

వైవిధ్యమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్‌లో దూసుకుపోతున్న కథానాయిక తాప్సి. ఒకప్పుడు కేవలం గ్లామర్‌పాత్రలకే పరిమితమైన నటి ఇప్పుడు కథా బలమున్న చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.  గతేడాది ‘మిషన్‌ మంగళ్‌’, ‘సాండ్‌ కి ఆంఖ్‌’ చిత్రాల్లో నటించి...

Published : 28 Feb 2020 09:16 IST

చిత్రం: థప్పడ్‌ 

నటీనటులు: తాప్సి, పావిల్‌ గులాటి, రత్న పాథక్‌ షా, తన్వి అజ్మీ, రామ్‌ కపూర్‌, కుముద్‌ మిశ్రా తదితరులు

సంగీతం: అనురాగ్‌ సైకియా, మంగేశ్‌ థాకడే

సినిమాటోగ్రఫీ: సౌమిక్‌ ముఖర్జీ

ఎడిటింగ్‌: యషా రామచందాని

నిర్మాతలు: భూషణ్‌కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, అనుభవ్‌ సిన్హా

రచన, దర్శకత్వం: అనుభవ్‌ సిన్హా

బ్యానర్‌: బెనారస్‌ మీడియా వర్క్స్‌

విడుదల తేదీ: 28-02-2020

వైవిధ్యమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్‌లో దూసుకుపోతున్న కథానాయిక తాప్సి. ఒకప్పుడు కేవలం గ్లామర్‌పాత్రలకే పరిమితమైన నటి ఇప్పుడు కథా బలమున్న చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.  గతేడాది ‘మిషన్‌ మంగళ్‌’, ‘సాండ్‌ కి ఆంఖ్‌’ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక దర్శకుడు అనుభవ్‌సిన్హాది కూడా భిన్నమైన దారే.  ‘ముల్క్‌’, ‘ఆర్టికల్‌ 15’ వంటి చిత్రాలతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మరో వైవిధ్యమైన కథ ‘థప్పడ్‌’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? తాప్సీ ఏ మేరకు అలరించింది. అనుభవ సిన్హా మరోసారి తన దర్శకత్వంతో మెప్పించారా?

కథేంటంటే: అమృత(తాప్సి), విక్రమ్‌(పావిల్‌ గులాటి) భార్య భర్తలు. అందమైన జోడీ. ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రేమ, అనురాగం. అమృత తన జీవితానికి సంబంధించి ఎన్నో కలలుకంటుంటుంది. భార్యపై ప్రేమ ఉన్నా విక్రమ్‌ది సగటు మగాడి మనస్తత్వం. ఇంట్లో తన మాటే నెగ్గాలని అనుకుంటాడు. విక్రమ్‌కు ప్రమోషన్‌ వచ్చిన తర్వాత యూకే వెళ్లిపోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ఇద్దరూ కలిసి ఓ శుభకార్యానికి వెళ్తారు. అక్కడ చిన్న అపశ్రుతి చోటు చేసుకుంటుంది. ఈ కారణంతో అందరి ముందే విక్రమ్‌ తన భార్య అమృతను చెంపదెబ్బ కొడతాడు. దీంతో అమృత తీవ్ర మనస్థాపానికి గురవుతుంది. చివరకు అది విడాకుల వరకూ దారి తీస్తుంది. ప్రేమతో పాటే ఆత్మగౌరవం కూడా ముఖ్యమని భావించే అమృత తన విక్రమ్‌ను  తిరిగి కలిసిందా? లేక విడిపోయిందా? వీరి మధ్య సయోధ్య ఎలా కుదిరింది? అన్నది తెరపై చూడాలి. 

ఎలా ఉందంటే: భార్యపై భర్త చేయిచేసుకోవడం అనే చిన్న లైన్‌ను సినిమా తీయొచ్చని ఎవరూ ఊహించి ఉండరు. మహా అయితే సందేశం ఇచ్చేలా షార్ట్‌ ఫిల్మ్‌ తీస్తారేమో. కానీ, అనుభవ్‌ సిన్హా దీన్నో చక్కని చిత్రంగా తీర్చిదిద్దాడు. భార్యపై అందరి ముందు భర్త చేయి చేసుకోవడం అన్నది ఒక సగటు మహిళగా ఆమె ఆత్మగౌరవానికి సంబంధించింది. చెంపదెబ్బ వల్ల కలిగే బాధకన్నా అందరి ఎదుట తనపై చేయి చేసుకోవడాన్నీ ఏ మహిళా జీర్ణించుకోలేదు. ఒక మహిళపై పురుషుడు చేయి చేసుకున్నాడంటే, ఆమెను తనకన్నా తక్కువగా చూడటం, బలహీనురాలని, కొట్టినా తిరిగి చేయి చేసుకోలేదన్న ధీమాతోనే చాలా మంది ఇలాంటి చర్యలకు పాల్పడతారు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా చేయిచేసుకున్నా అది కూడా గృహహింస కిందకే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్త్రీ, పురుష భేదం లేదు. ఇదే విషయాన్ని అనుభవ్‌ సిన్హా చెప్పాలనుకున్నారు. ఈ నేపథ్యంలో న్యాయపరంగా వచ్చే అనేక ప్రశ్నలకు ఈ చిత్రంలో సమాధానం ఇచ్చారు. చెంపదెబ్బ కొట్టాడన్న దాని కన్నా ఆ మహిళకు జరిగిన అవమానం ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, దాన్ని భావోద్వేగాలతో తీర్చిదిద్దాడు దర్శకుడు. మహిళల మనోభావాలను చక్కగా చూపించారు. 

మొదట అమృత, విక్రమ్‌ల మధ్య బంధాన్ని చూపించిన దర్శకుడు చెంప దెబ్బ సన్నివేశంతో కథ కీలక మలుపు తిప్పాడు. తీవ్ర మనస్థాపానికి గురైన అమృత విడాకులు కోరటం, ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, దాన్ని తన ఆత్మగౌరవానికి జరిగిన అవమానంగా భావించి న్యాయపరంగా వెళ్లడం తదితర సన్నివేశాలను ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ‘కేవలం చెంప దెబ్బకే విడాకులు తీసుకోవాలా’ అని ప్రశ్నించే వారికి ‘అది కేవలం చెంప దెబ్బ అని ఇప్పుడు వదిలేస్తే భవిష్యత్‌లో తగిలే మరెన్నో దెబ్బలను మౌనంగా భరించాల్సి వస్తుంది’ అని అమృత చెప్పే సమాధానం మనల్ని కదిలిస్తుంది. నేటి సమాజంలో భర్త కోపంతో కొట్టినా, అనుకోకుండా కొట్టినా కన్నీళ్లను ఒత్తుకుని, తమలో తామే కుమిలిపోతూ కాపురం చేసే భార్యలు ఎంతో మంది మన కళ్ల ముందు కనపడతారు. దర్శకుడు ఈ పాయింట్‌నే భార్యపై ఏ పరిస్థితుల్లో చేయి చేసుకున్నా అది గృహ హింస కిందే వస్తుందని ఎంతో చక్కగా చెప్పాడు. పైగా మహిళపై చేయించుకోవడం గొప్పతనమని భావించే పురుషులకు ఈ చిత్రం జ్ఞానోదయం కలిగిస్తుంది. మీరు ఛాందస్సవాదులైతే సినిమా చూస్తున్నంత సేపు మిమ్మల్ని గొప్పగా ఊహించుకుంటూ సినిమాను కొట్టిపారేస్తారు. అదే ఏమాత్రం ఆలోచించేవారైనా తెరపై చూపించింది నిజమే కదా! అని తప్పకుండా అనిపిస్తుంది. భావోద్వేగాలు అదే స్థాయిలో ఉంటాయి. 

ఎవరెలా చేశారంటే:  ‘ఈ సమాజంలో మార్పు తీసుకురావాలంటే నా పని నన్ను చేయనీయండి. మీ పని మీరు చేసుకోండి’ ఇటీవల తాప్సి చెప్పిన మాట ఇది. ఇది అక్షర సత్యం. తాప్సి మరోసారి తన నటనతో కట్టిపడేసింది. అందరి ముందు అవమానించబడ్డ భార్య అమృత పాత్రలో చాలా బ్యాలెన్స్‌డ్‌గా నటించింది. ఆమె పాత్రకు సంభాషణలు కూడా తక్కువ. భావోద్వేగ సన్నివేశాల్లో మనతోనూ కంటతడి పెట్టిస్తుంది. ఈ చిత్రంలో చెప్పుకోదగిన పాత్ర కుముద్‌ మిశ్రా. అమాయకత్వం కలబోసిన పాత్రలో ఆయన నటన మెప్పిస్తుంది. అమృత భర్త విక్రమ్‌ పాత్రలో పావిల్‌ గులాటి పర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. 

సాంకేతికంగా అనురాగ్‌ సైకియా, మంగేశ్‌ థాకడేల సంగీతం బాగుంది. దర్శకుడు అనుభవ్‌ సిన్హా చాలా చిన్న లైన్‌ను తీసుకుని చక్కని సినిమాగా మలిచారు. భార్య అంటే చిన్నచూపు ఉండే భర్తలకు ఈ చిత్రం ఒక కనువిప్పు. అందరి భర్తలకు ఈ సినిమా రుచించకపోవచ్చు. కానీ, ఇదే వాస్తవం. ఎంతో కాలంగా సమాజంలో జరుగుతున్న ఘటనలను చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు బలహీనతలు
+ కథ - నిడివి
+ తాప్సీ నటన  
+ దర్శకత్వం  

చివరిగా: పురుష అహంకార ధోరణిపై ‘థప్పడ్‌’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని