యువ దర్శకులకు రిషికపూర్‌ సలహా

సాధారణంగా సినిమా తీసేటప్పుడు ఏ దర్శకుడైనా ఏం చేస్తుంటాడు. మానిటర్‌లో చూస్తూ నటులకు సలహాలు, సూచనలిస్తుంటాడు. తను అనుకున్నట్లుగా సన్నివేశం వచ్చిందా లేదా..?

Published : 23 Feb 2020 21:48 IST

ముంబయి: సాధారణంగా సినిమా షూటింగ్‌ సమయంలో ఏ దర్శకుడైనా ఏం చేస్తుంటాడు. మానిటర్‌లో చూస్తూ నటులకు సలహాలు, సూచనలిస్తుంటాడు. తాను అనుకున్నట్లుగా సన్నివేశం వచ్చిందా..? బ్యాక్‌గ్రౌండ్‌ సరిగ్గా ఉందా లేదా అని గమనిస్తుంటాడు. అయితే, ఇది సరైన పద్ధతి కాదంటున్నారు బాలీవుడ్‌ దిగ్గజ నటుడు, దర్శక నిర్మాత రిషి కపూర్‌. అంతేకాదు.. నేటి తరం దర్శకులను ఉద్దేశిస్తూ ట్విటర్‌ వేదికగా ఓ పోస్టు చేశారు.
1966లో తీస్‌రీ మంజిల్‌ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఆ సినిమా దర్శకుడు విజయ్‌ ఆనంద్‌ పనితీరును ఆయన గుర్తు చేశారు. దానికి సంబంధించిన ఒక ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నారు. సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో హీరో షమ్మీ కపూర్‌ నటనను దర్శకుడు విజయ్‌ ఆనంద్‌ మానిటర్‌లో కాకుండా హీరో పక్కనే కూర్చొని నేరుగా గమనిస్తుంటారు. ‘ఇది నేటి తరం దర్శకుల కోసం.. మీరు మీ నటీనటుల ప్రదర్శనను గమనించాల్సింది మానిటర్‌ ముందు కాదు. సరైన విధానం ఇది’ అని ఆయన పేర్కొన్నారు. ఆ పోస్టుపై స్పందించిన మరో సినీ నిర్మాత శేఖర్‌ కపూర్‌.. ‘బాగా చెప్పారు. నాకు కూడా మానిటర్‌లో గమనించడం నచ్చదు. అందుకే నేను అలా చేయను. మానిటర్‌లో చూస్తూ సినిమా తీయడమంటే అది దర్శకుడి బద్దకాన్ని సూచిస్తుంది’ అని ఆయన అన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని