తిండిలేక నీళ్లు తాగి నిద్రపోయేవాళ్లం: బ్రహ్మానందం

కరోనాపై పోరుకు ఓర్పు, సహనం చాలా అవసరమని ప్రముఖ నటుడు బ్రహ్మానందం తెలిపారు. ఆయన తాజాగా ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారిని కాపాడేందుకు దేశ నాయకులు కృషి చేస్తున్న తీరును ఉద్దేశించి ప్రసంగించారు......

Published : 24 Apr 2020 17:45 IST

కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌.. ఓ భరోసా!

హైదరాబాద్‌: కరోనాపై పోరుకు ఓర్పు, సహనం చాలా అవసరమని ప్రముఖ నటుడు బ్రహ్మానందం తెలిపారు. ఆయన తాజాగా ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారిని కాపాడేందుకు దేశ నాయకులు కృషి చేస్తున్న తీరును ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేశారు. ‘ఇప్పుడు ఓర్పు చాలా అవసరం. గాంధీ ఓర్పుతో ఉన్నారు కాబట్టే స్వతంత్రం వచ్చింది. నెల్సన్‌ మండేలా సహనంతో ఉన్నారు కాబట్టే దక్షిణాఫ్రికాకు స్వేచ్ఛ వచ్చింది. అంబేడ్కర్‌ గంగానది ఈదుకుంటూ వెళ్లి చదువుకున్నారు కాబట్టే ఆ స్థితిలో ఉన్నారు. వీళ్లంతా తమ జీవితంలో వచ్చిన సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలిగారు కాబట్టే గొప్ప వారు అయ్యారు. వారే స్ఫూర్తి.. వీరితోపాటు నా పేరు కలుపుకొంటే బాగోదని చెప్పలేదు’.

‘ఒక పూట భోజనం లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు. మా నాన్న భోజనం పెట్టే వరకూ మా ఆరుగురు అన్నదమ్ములు ఎదురుచూడటమంటే ఏంటో నాకు తెలుసు. కొన్నిసార్లు కేవలం మంచినీళ్లు తాగి పడుకొన్న రోజులు ఉన్నాయి.  రెక్కాడితో కానీ డొక్కాడదనే పరిస్థితి నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఇవన్నీ నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఎం.ఎ చేసి, లెక్చరర్‌ ఉద్యోగంలో చేరి.. ఈ స్థితికి వచ్చాను. అందుకే సహనంగా, ఓర్పుగా ఉండమని చెప్పే అర్హత నాకు ఉంది కాబట్టి చెబుతున్నా. పనికి వెళ్తేనే కుటుంబానికి రోజు గడిచే పరిస్థితిని నేను అనుభవించా. (భావోద్వేగంతో..) అది ఎంతో భయంకరంగా ఉంటుంది. ‘18 రోజులు తిండి తినకపోతే చనిపోతారంటారు. 17 రోజులు ఎవరి ముందు చేతులు చాచొద్దు. 18వ రోజు అడుక్కోరా.. లేకపోతే చచ్చిపోతావు..’ అని మా నాన్న నాకు చెప్పేవారు’

‘చేతులు శానిటైజ్‌ చేసుకోండి, మాస్కులు వేసుకోండి, ఇంట్లోనే ఉండమని అంటున్నారు. మన దేశంలో సొంతిల్లు, ఇన్ని సౌకర్యాలు ఎంత మందికి ఉన్నాయి? కానీ దీనికి మించి ఏం చెప్పలేం. మానవ తప్పిదాల వల్ల మనకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో మనందరి కోసం పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, పోలీసుల్ని, పాత్రికేయుల్ని అభినందించాలి. ప్రధాని మోదీ గారు వీరందరినీ ప్రోత్సహిస్తూ సమావేశాల్లో ప్రసంగిస్తున్నారు. ఆయన ఓ గొప్ప నాయకుడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టారంటే.. ఓ భరోసా. ‘ఇప్పుడు ఆయన ఏదో ఒకటి చెబుతారు. మనల్ని ఈ బాధ నుంచి బయటపడేస్తారు..’ అనే భరోసా ప్రజల్లో ఏర్పడుతోంది. అంతటి గొప్ప నాయకుడు ఆయన. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ వయసులో చిన్నవాడు. అయినా సరే అక్కడి మంత్రులతో చర్చించి, ప్రజలు బాధపడకూడదని చర్యలు తీసుకుంటున్నారు’ అని బ్రహ్మానందం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని