Harish Shankar: ధైర్యం ఉంటే నా ఫొటో పెట్టి అలా రాయండి: హరీశ్‌ శంకర్‌

‘ఈగల్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ పలు వెబ్‌సైట్లపై ఘాటుగా మాట్లాడారు. ధైర్యం ఉంటే తన ఫొటో పెట్టి ఆర్టికల్స్‌ రాయాలన్నారు.

Published : 12 Feb 2024 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ (Ravi Teja) హీరోగా దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం ‘ఈగల్‌’ (Eagle). అనుపమ పరమేశ్వరన్‌, కావ్యా థాపర్‌ హీరోయిన్లు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలై, పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌కు డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు వెబ్‌సైట్లు కావాలనే సినిమాకి నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చాయని ఆరోపించారు. వ్యక్తిగతంగా ఎటాక్‌ చేస్తున్నారన్నారు.

రివ్యూ: ఈగల్‌

‘‘ఈగల్‌’ అదిరిపోయింది. ఇదే కథను నన్ను తెరకెక్కించమంటే ఇంత ఇంపాక్ట్‌గా తీసేవాడిని కాదేమో. సినిమా చూడక ముందు అందరిలానే నేనూ ఆన్‌లైన్‌లో రివ్యూలు/పోస్ట్‌లు చదివా. ఒకదాంట్లో ‘లవ్‌స్టోరీ ఇంకా బాగా చూపించి ఉండే బాగుండేది’ అనే కామెంట్‌ కనిపించింది. దీనికేమైనా ‘ప్రేమ పావురాలు’, ‘ప్రేమ పంజరం’లాంటి టైటిల్‌ పెట్టారా? గడ్డం పెంచుకుని, తుపాకీ పట్టుకుని హీరో కనిపిస్తుంటే ప్రేమ గురించి మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలో నాకు అర్థంకాలేదు. నేను ఇలా అంటుంటే కాంట్రవర్సీ అంటారు. మీరు అనుకోవడం మానరు, నేను అనడం మానను. కార్తీక్‌ను విమర్శించే ముందు ఒక్కసారి ఆలోచించండి. అన్ని సినిమాలు అందరికీ నచ్చాలనే రూల్‌ లేదు. అతడు అద్భుతమైన సినిమాటోగ్రాఫర్‌. అక్కడితో ఆగిపోకుండా ఎంతో కష్టపడి దర్శకుడయ్యాడు. అతడి జర్నీ గురించైనా ఒక్కసారి ఆలోచించాలి కదా. ఇందులో లవ్‌స్టోరీ లేదన్న వారే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రొమాన్స్‌ లేదని అన్నారని తర్వాత తెలిసింది. సినీ జర్నలిస్టులూ ఇండస్ట్రీలో భాగమే. మనం ఒకరిపై ఒకరం రాళ్లు వేసుకోవడమేంటి?’’

‘‘నేను ఓ విలేకరికి కౌంటర్‌ ఇచ్చినందుకు నాకు వందల కాల్స్‌ వచ్చాయి. కౌంటర్‌కు ప్రశంసలేంటి? అని ఆలోచించా. నేను గొప్పగా ఏం మాట్లాడలేదు. సదరు జర్నలిస్టు పలు సందర్భాల్లో తప్పుగా మాట్లాడారు. అతనిపై ఉన్న కసిని కొందరు నాకు ప్రశంస అన్నట్లుగా మార్చారు. అది నాకు బాధ కలిగించింది. రివ్యూల్లో విమర్శ కనిపిస్తే ఓకేగానీ అది ఎగతాళి స్థాయికి వెళ్తోంది. ‘‘నాలుగేళ్లయింది.. సినిమా ఆలస్యమవుతుండడంతో నిర్మాత ఇంట్లో కూర్చొని మద్యం తాగిన డైరెక్టర్‌.. ఇతను పవన్‌ కల్యాణ్‌తో బ్లాక్‌ బస్టర్‌ తీశాడు ఇంతకు ముందు’’ అని ఓ సైట్‌ రాసింది. పూర్తిగా రాసేందుకు అలాంటి వారికి ధైర్యం ఉండదు. సింబాలిక్‌ ఫొటో పెడతారు. ధైర్యం ఉంటే నా ఫొటో పెట్టి, హరీశ్‌ శంకర్‌ ఇలా చేశాడని రాయండి. అయినా ఎంతకాలం ఇలా?’’

‘‘నా విషయంలో ప్రతిసారి గ్యాప్‌ వచ్చిందంటున్నారు. ప్రస్తుతం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, ‘మిస్టర్‌ బచ్చన్‌’ చేస్తున్నా. త్వరలోనే రెండు పెద్ద సినిమాల ప్రకటన వస్తుంది. నాలుగేళ్లుకాకపోతే ఐదేళ్లు సినిమా చేయకుండా ఉంటా. వ్యక్తిగతంగా ఎటాక్‌ చేస్తున్నారు. మేం మహాత్ములమని చెప్పామా మీకు. విశ్వ ప్రసాద్‌ 100 సినిమాలు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నారు. 50 చిత్రాలతోనే ఆయన్ను పంపించేస్తే మనకే రెవెన్యూ పోతుంది. అందుకే ‘సేవ్‌ ది టైగర్స్‌’ కాదు ‘సేవ్‌ ది ప్రొడ్యూసర్స్‌’. సినిమా పుట్టాక వెబ్‌సైట్లు పుట్టాయిగానీ వెబ్‌సైట్లు పుట్టాక సినిమా పుట్టలేదు. నాకు ట్రోల్స్‌ ఏమీ కొత్తకాదు. అన్నింటికీ తెగించే మేం ఇక్కడికొచ్చాం’’ అని ఘాటుగా ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని