Harish Shankar: ‘2018.. ఇలాంటి సినిమా తెలుగు దర్శకులు తీయగలరా?’ హరీశ్‌ శంకర్‌ స్ట్రాంగ్‌ రిప్లై

రూ.100 కోట్ల వసూళ్లతో మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ఈసినిమా ‘2018’. త్వరలో ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వేదికగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్‌మీట్‌లో హరీశ్‌ శంకర్‌ పాల్గొన్నారు. 

Published : 25 May 2023 01:48 IST

హైదరాబాద్‌: ‘2018’ సినిమా ప్రెస్‌మీట్‌ వేదికగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar). ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తోందని ఆయన అన్నారు. టోవినో థామస్‌ ప్రధాన పాత్రలో జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ తెరకెక్కించిన ‘2018’ చిత్రం జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై త్వరలో తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఇందులో హరీశ్‌ శంకర్‌ పాల్గొని చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు.

‘క్యూ అండ్‌ ఏ’ సెషన్‌లో ఓ విలేకరి.. ‘‘2018’ సినిమా చూసిన తర్వాత తెలుగు దర్శకులు ఇలాంటి ప్రాజెక్ట్‌ చేయగలరా? తెలుగు నిర్మాతలు సాహసం చేయగలరా? అని మీకు అనిపించిందా?’’ అని బన్నీ వాసుని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన బన్నీ వాసు.. ‘‘ఈ ప్రశ్నకు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ సమాధానం చెబితే బాగుంటుంది’’ అని మైక్‌ హరీశ్‌కు అందించారు. 

‘‘ప్రెస్‌మీట్స్‌ జరిగిన ప్రతిసారీ ఆయన (సదరు విలేకరిని ఉద్దేశిస్తూ) ఎవరూ అడగని సాహసోపేతమైన ప్రశ్నలు అడిగి.. సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచి.. యూట్యూబ్‌లో ఒక ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు. (తెలుగు సినిమాని ఉద్దేశిస్తూ) ప్రస్తుతం ప్రపంచ సినిమా మన చేతికి వచ్చేసింది. అలాంటి టెక్నాలజీలో మనం ఉన్నాం. దీనిని డబ్బింగ్‌ సినిమా అని అంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బాహుబలి’ని హిందీలో ఎవరైనా డబ్బింగ్‌ సినిమా అనుకున్నారా? అనుకోలేదు కదా..! డబ్బింగ్‌ లేదా రీమేక్‌ సినిమా అనేది లేదు. కేవలం సినిమా అంతే. ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమా ఎక్కడికైనా వెళ్తున్నందుకు ఎంతో సంతోషించాలి. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తున్నప్పుడు మీరు ఇలాంటి ప్రశ్న వేశారంటే జాలిగా ఉంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలుగు దర్శకుల వైపు చూస్తోంది. ఆయన కేరళ దర్శకుడని నేను ఈ సినిమా చూడలేదు. ఆయన వర్క్ నాకెంతో నచ్చింది. పత్రికాముఖంగా ఆయన్ని మెచ్చుకుందామని ఇక్కడికి వచ్చాను.

‘గీతాఆర్ట్స్‌’ డబ్బింగ్‌ సినిమాలకే పరిమితమైపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు కదా. వరుసగా 100 డబ్బింగ్‌ సినిమాలు బన్నీవాసుతో నేనే రిలీజ్‌ చేయిస్తా. అందులో తప్పేంటి? ఒక మంచి సినిమాని పది మందికి చూపించాలని చేసే ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఈ సినిమాని ముందు మీకే చూపించాలని వాసు (నిర్మాత) అనుకున్నారు. ఎందుకంటే సినిమా మీకు నచ్చితే మీరు చేసినంత ప్రమోషన్‌ నిర్మాత కూడా చేయలేరు. డబ్బింగ్‌ లేదా రీమేక్‌ అనేది విషయం కాదు. మంచి సినిమాలు చేస్తున్నామా? లేదా? అనేది ముఖ్యం. భాషాపరమైన వ్యత్యాసాలు ఇప్పుడు లేవు. కేవలం మంచి సినిమా మాత్రమే ఉంది. అలాగే, సినిమా అంటేనే ఒక భాష. దానికి ప్రత్యేకంగా భాషతో సంబంధం లేదు. అదే ఒక ఎమోషన్‌’’ అంటూ హరీశ్‌ శంకర్‌ స్ట్రాంగ్‌గా బదులిచ్చారు.

జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ మాట్లాడుతూ.. ‘‘2018లో కేరళలో సంభవించిన వరదలకు మా ఇల్లు కూడా మునిగిపోయింది. కుటుంబ సభ్యులం ఒక్కొక్కరం ఒక్కో చోట తలదాచుకున్నాం. దాన్ని ఆధారంగా చేసుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘బోధిని’ అనే ఎన్జీవో సంస్థ షార్ట్‌ వీడియో తీయమని నన్ను సంప్రదించింది. ఆ క్రమంలో ఘటనకు సంబంధించిన ఎన్నో వార్తలు చదివా. వాటిల్లో నాకు సక్సెస్‌ స్టోరీలు కనిపించాయి. పార్టీలు, మతాలకు అతీతంగా ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. దాని గురించి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తెరకెక్కించా’’ అని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని