Kotabommali PS ott: ఓటీటీలో ‘కోట బొమ్మాళి పి.ఎస్‌.’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Kotabommali PS ott: మలయాళ ‘నాయట్టు’ రీమేక్‌గా రూపొందిన ‘కోట బొమ్మాళి పి.ఎస్‌.’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 04 Jan 2024 13:56 IST

హైదరాబాద్‌: శ్రీకాంత్‌ కీలక పాత్రలో జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’. (Kotabommali PS ott) వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.. తేజ మార్ని దర్శకుడు. బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు, విమర్శకుల మెప్పును సైతం పొందింది. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి ‘కోట బొమ్మాళి పి.ఎస్‌.’ను ఓటీటీ ప్రేక్షకుల కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ‘ఆహా’ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ చిత్రంలోని ‘లింగిడి.. లింగిడి’ సాంగ్‌ మాస్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే.

ఇంతకీ ఈ చిత్ర కథేంటంటే: ఆంధ్రప్రదేశ్‌లో టెక్కలి ఉప ఎన్నికల హడావుడి మొదలవుతుంది. దీన్ని అధికార పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. అందుకే పార్టీని గెలిపించే బాధ్యతను హోంమంత్రి బరిసెల జయరామ్‌ (మురళీశర్మ) చేతుల్లో పెడుతుంది. ఎన్నికలకు మరో మూడు రోజులు సమయం ఉందనగా.. కోటబొమ్మాళి పీఎస్‌ పరిధిలో ఓ పోలీస్‌ జీప్‌ వల్ల జరిగిన రోడ్డు ప్రమాదం అధికార పార్టీకి తలనొప్పిగా మారుతుంది. ఆ ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందినవాడు. మరోవైపు ఆ ప్రమాదానికి కారణమైన పోలీస్‌జీప్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ (శ్రీకాంత్‌), కొత్తగా డ్యూటీలో చేరిన కానిస్టేబుల్‌ రవి (రాహుల్‌ విజయ్‌), మహిళా కానిస్టేబుల్‌ కుమారి (శివాని రాజశేఖర్‌) ఉంటారు. వీళ్లకు ఆ సామాజిక వర్గంలోని యువనేత మున్నా (పవన్‌ తేజ్‌ కొణిదెల)కు మధ్య అప్పటికే ఓ గొడవ జరిగి ఉంటుంది. అందుకే ఈ ప్రమాదాన్ని పావుగా వాడుకొని దాన్నొక రాజకీయ సమస్యగా మార్చి వాళ్లపై పగ తీర్చుకోవాలని ప్రణాళిక రచిస్తాడు మున్నా. అయితే ఈ సమస్య తీవ్రతను ముందుగానే పసిగట్టిన రామకృష్ణ.. రవి, కుమారిలను తీసుకొని పరారీ అవుతాడు. దీంతో అధికారిక పార్టీపై ఒత్తిడి పెరిగిపోతుంది. (Kotabommali PS Review in telugu) ఇది ఎన్నికల్లో విజయాన్ని నిర్దేశించే సమస్య కావడంతో హోంమంత్రి పరారీలో ఉన్న రామకృష్ణతో పాటు మిగతా ఇద్దరు నిందితుల్ని 48గంటల్లో అరెస్టు చేస్తామని శపథం చేస్తారు. ఇందుకోసం ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌.. ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మీ శరత్‌ కుమార్‌)ను రంగంలోకి దించుతారు. మరి పోలీస్‌ శాఖలో 20ఏళ్ల అనుభవం ఉన్న రామకృష్ణ.. రజియా వ్యూహాలను చిత్తు చేస్తూ ఎలా తప్పించుకున్నాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లేంటి? ఈ పోరులో పైచేయి సాధించిందెవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘నాయట్టు’ చిత్రానికి రీమేక్‌గా ‘కోటబొమ్మాళి పి.ఎస్‌.’ రూపొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని