Animal movie ott release: ఎదురు చూపులకు తెర.. ఓటీటీలో ‘యానిమల్‌’ వచ్చేస్తోంది!

Animal movie ott release: సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘యానిమల్‌’ ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీని నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది.

Published : 25 Jan 2024 11:25 IST

హైదరాబాద్‌: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కీలక పాత్రలో సందీప్‌ వంగా (Sandeep Reddy) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘యానిమల్‌’ (Animal movie). డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. యువ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి (Animal movie ott release) హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే మూవీ చూసిన వారికి మరింత సర్‌ప్రైజ్‌ జోడించి ఓటీటీ వెర్షన్‌ అందించనున్నారు. దాదాపు 8 నిమిషాల అదనపు నిడివితో దీన్ని తీసుకొస్తున్నారు. థియేటర్‌లో చూడలేకపోయిన సన్నివేశాలను ఇందులో చూసే అవకాశం కల్పించారు. మూవీ రన్‌ టైమ్‌ 3 గంటల 21 నిమిషాలు కాగా, ఓటీటీ కోసం అదనపు సన్నివేశాల జోడింపుతో దాదాపు మూడున్నర గంటలతో ‘యానిమల్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. (Animal movie ott release date telugu) ఇక యాక్షన్‌ ప్రియులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చిన ఈ సినిమాకు కొనసాగింపుగా ‘యానిమల్‌ పార్క్‌’ (Animal Park) టైటిల్‌తో సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు దర్శకుడు సందీప్‌ వంగా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

కథేంటంటే: స్వ‌స్తిక్ స్టీల్స్ అధినేత‌, దేశంలోనే సంప‌న్నుడైన బ‌ల్బీర్ సింగ్ (అనిల్ క‌పూర్‌) త‌న‌యుడు ర‌ణ్ విజ‌య్ (ర‌ణ్‌బీర్ సింగ్‌). ఎవ‌రినైనా స‌రే ధైర్యంగా ఎదిరించే ర‌కం. చిన్నతనం నుంచే నాన్నంటే చెప్ప‌లేనంత ప్రేమ‌. కానీ, బ‌ల్బీర్ సింగ్ వ్యాపారాల‌తో బిజీగా గ‌డుపుతూ కొడుకును ప‌ట్టించుకోడు. దూకుడు మ‌న‌స్త‌త్వ‌మున్న విజ‌య్ ప‌నులు తండ్రి బ‌ల్బీర్‌కు న‌చ్చ‌వు. ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. దాంతో త‌ను ప్రేమించిన గీతాంజ‌లి (ర‌ష్మిక‌)ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతాడు. కొన్నేళ్ల త‌ర్వాత తండ్రిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌ని తెలియ‌డంతో హుటాహుటిన త‌న భార్య‌, పిల్ల‌ల‌తో ఇండియాకి వ‌స్తాడు. వ‌చ్చాక ఏం జ‌రిగింది? (Animal movie) త‌న తండ్రిని హ‌త్య చేయాల‌నుకున్న శ‌త్రువును విజ‌య్ ఎలా గుర్తించాడు? ఇంత‌కీ ఆ శత్రువు ఎవ‌రు? అత‌ని నుంచి కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనేది మిగ‌తా క‌థ‌.

‘యానిమల్‌’ పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని