Laal Singh Chaddha: ఓటీటీలో ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఆమీర్‌ఖాన్‌ కథానాయకుడిగా అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా ‘లాల్‌ సింగ్‌ చడ్డా (Laal Singh Chaddha) ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

Published : 07 Oct 2022 01:29 IST

హైదరాబాద్‌: ఆమీర్‌ఖాన్‌ కథానాయకుడిగా అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన కామెడీ డ్రామా ‘లాల్‌ సింగ్‌ చడ్డా (Laal Singh Chaddha). ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ స్ట్రీమింగ్‌ మొదలైంది. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. కరీనాకపూర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య కీలకపాత్రలో నటించారు. దాదాపు రూ.180 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌నూ మెప్పించలేకపోయింది.

క‌థేంటంటే: లాల్‌సింగ్ చ‌డ్డా (ఆమిర్‌ ఖాన్‌) కుటుంబంలో తాత ముత్తాత‌లంతా ఆర్మీలో ప‌నిచేసిన‌వాళ్లే. లాల్ కూడా ఆర్మీలో ప‌నిచేయ‌డ‌మే త‌న త‌ల్లికి ఇష్టం. కానీ, చిన్న‌ప్ప‌ట్నుంచి బ‌ల‌హీనుడిలా, నెమ్మ‌దైన కుర్రాడిలా క‌నిపించే లాల్‌కి ఒక‌రిని చంప‌డ‌మంటే ఇష్టం ఉండ‌దు. జీవితంలో అద్భుతాలు జ‌రుగుతుంటాయంటారు క‌దా, అలా రూప (క‌రీనా క‌పూర్‌) (Kareena Kapoor Khan) త‌న జీవితంలోకి రావ‌డం, ఆ త‌ర్వాత మ‌రికొన్ని అద్భుతాలు చోటు చేసుకోవ‌డంతో అత‌ను మామూలు కుర్రాడిగా మారి, ఆ త‌ర్వాత త‌ల్లి క‌ల‌లకి త‌గ్గ‌ట్టే ఆర్మీలో చేర‌తాడు. అక్క‌డే తోటి సిపాయి అయిన బాల‌రాజు (నాగ‌చైత‌న్య‌) (Naga Chaitanya) ప‌రిచ‌యం అవుతాడు. బాల‌రాజు కుటుంబానికీ ఓ చ‌రిత్ర ఉంది. బ‌నియ‌న్లు, డ్రాయ‌ర్లు త‌యారు చేసే కుటుంబం వాళ్ల‌ది. ఎప్ప‌టికైనా త‌న తాత ముత్తాత‌ల్లా బ‌నియ‌న్లు డ్రాయ‌ర్లు త‌యారు చేసే కంపెనీని ఏర్పాటు చేయాల‌ని క‌ల‌లు కంటుంటాడు. లాల్‌, బాల ఇద్ద‌రూ ఆర్మీ నుంచి బ‌య‌టికెళ్లాక క‌లిసి బ‌నియ‌న్లు, డ్రాయ‌ర్ల వ్యాపారం చేయాల‌నుకుంటారు. మ‌రి జీవితం ఆ ఇద్ద‌రినీ ఎక్క‌డి వ‌ర‌కు తీసుకెళ్లింది? చిన్న‌ప్పుడు త‌న ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రూప‌తో లాల్ జీవితాన్ని పంచుకున్నాడా లేదా? అనేది మిగ‌తా క‌థ‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని