HIT 2: ఆ సినిమాలా రూ.300 కోట్లు రాలేదు కానీ..: శైలేశ్ కొలను

శైలేశ్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌’. ఇప్పుడదే చిత్రానికి సీక్వెల్‌గా సిద్ధమవుతోన్న చిత్రం ‘హిట్‌ -2’. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. 

Published : 03 Nov 2022 14:00 IST

హైదరాబాద్: పోలీసు వ్యవస్థపై తనకెంతో గౌరవం ఉందని అన్నారు దర్శకుడు శైలేశ్‌ కొలను. సమాజంలో శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసులు ఎంతో కష్టపడుతున్నారని, వాళ్ల సేవలను తెలియజేయడం కోసమే తాను ‘హిట్‌’ యూనివర్స్‌ క్రియేట్‌ చేస్తున్నానని ఆయన తెలిపారు. ‘హిట్‌-2’ టీజర్‌ విడుదల అనంతరం హీరో అడివి శేష్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

టీజర్‌ చివర్లో భయానక దృశ్యాలు చూపించారు. దానివల్ల ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయా?

శైలేశ్‌: ప్రేక్షకులు ఇబ్బంది పడకుండా.. కేవలం క్రైమ్‌లోని తీవ్రత తెలిసేలా మాత్రమే షూట్‌ చేశాం. అందుకోసం మణి సృజనాత్మకంగా పని చేశారు. సినిమాలో ఉండే అత్యంత భయానక దృశ్యమిదే. ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు దాన్ని టీజర్‌లో చూపించాం. సినిమాని ఎలా చూపించాలనే విషయంలో నాకు ఒక స్పష్టత ఉంది. దానికి అనుగుణంగానే వర్క్‌ చేశా.

ఈ కథకు స్ఫూర్తి ఏమిటి?

శైలేశ్‌: వేరు వేరే సందర్భాల్లో చదివిన పుస్తకాలు, న్యూస్‌ పేపర్లలో వచ్చే వార్తలను ఆధారంగా చేసుకునే.. ‘హిట్‌’వర్స్‌లో కథలు రాస్తున్నా.

మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లే అవకాశం ఉందా?

శైలేశ్‌: ‘హిట్‌’ని బాలీవుడ్‌లో దర్శకత్వం వహించి.. అక్కడివారికి పరిచయమయ్యా. బాలీవుడ్‌ నాకు మంచి అనుభవాన్ని అందించింది. డైరెక్టర్‌గా నేను పర్‌ఫెక్ట్‌గా వర్క్‌ చేశా. బాక్సాఫీస్‌ వద్ద సినిమా ఎంత వసూళ్లు రాబడుతుందనేది రిలీజ్‌ టైమ్‌, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ‘భూల్‌ భూలయ్యా - 2’ మాదిరిగా రూ.300 కోట్లు వసూలు చేయకపోయినా.. నా నిర్మాతలకు డబ్బులు మాత్రం వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌లోనూ ‘హిట్‌’ (హిందీ) ట్రెండింగ్‌లో ఉంది.

ఇండస్ట్రీలో ఉన్న హీరోల సపోర్ట్‌ మీకు ఉంది కదా. మీరు, భవిష్యత్తులో ఏ హీరోతోనైనా సినిమా నిర్మిస్తారా?

శేష్‌: తప్పకుండా. నా సినిమాలతో కొత్త దర్శకులు, సంగీత దర్శకులు, నటీనటులు, రచయితలను ప్రోత్సహించా. త్వరలోనే కొత్త హీరోను కూడా ప్రోత్సహిస్తా.

‘మేజర్‌’తో పాన్‌ ఇండియా హీరో అయ్యారు. మరి, ఈ సినిమా కేవలం తెలుగుకే పరిమితం అవుతుందని ఫీలవుతున్నారా?

శేష్‌: కథ గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తా. ఇది వైజాగ్‌లో జరిగే కథ. అందులో డైలాగ్స్‌, సీన్స్‌ ఇక్కడి వారికి సెట్‌ అయ్యేలా ఉంటాయి. అయితే, ప్రస్తుతానికి ఈ సినిమాని డబ్‌ చేయడం పై చర్చలు జరుగుతున్నాయి. తెలుగు తర్వాత వీలుంటే హిందీలోనూ రిలీజ్‌ చేస్తాం.

‘హిట్‌’లో విశ్వక్‌సేన్‌ చేశారు. ‘హిట్‌ -2’లో మీరు చేస్తున్నందుకు ఏమైనా ఫీలవుతున్నారా?

శేష్‌: శైలేశ్‌ నా వద్దకు వచ్చినప్పుడు.. ‘విశ్వక్‌ ఉండగా నేను నటించడం ఏమిటి?’ అనే అడిగా. శైలేశ్‌.. హిట్‌ యూనివర్స్‌ క్రియేట్‌ చేయాలనుకున్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగే క్రైమ్స్‌ను ఒక్కో స్టోరీగా చూపించనున్నారు. ఆయా కథల్లో వేర్వేరు హీరోలతో తెరకెక్కించి.. అందర్నీ ఒకే కథలోకి తీసుకురానున్నారు. హల్క్‌ ఇప్పటికే ఉన్నాడు. కెప్టెన్‌ అమెరికా కూడా వస్తే బాగుంటుందని నాకు ఫోన్‌ చేశారు.

హిట్‌వర్స్‌లో వచ్చే కథలన్నీ ఒకే టైమ్‌లో జరుగుతుంటాయా?

శైలేశ్‌: ‘హిట్‌’ యూనివర్స్‌లో వివిధ కథలు చూపించినప్పటికీ.. అవన్నీ ఒకే సయమంలో జరుగుతున్నట్టు చూపించనున్నాం. హీరోలందరూ వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీస్‌ ఆఫీసర్లుగా కనిపించనున్నారు. క్రైమ్‌ పెద్దదైనప్పుడు వీళ్లందరూ కలిసి కనిపించనున్నారు. తప్పకుండా మీరు సర్‌ప్రైజ్‌ కానున్నారు.

‘‘మీ అందర్నీ ఇలా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. కొంత సేపటి నుంచి నా జర్నీ గురించే ఆలోచిస్తున్నా. ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికీ నచ్చే హీరోని నేనేనని అందరూ అంటుంటారు. ‘క్షణం’ రిలీజైనప్పుడు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ సినిమాల కోసం ట్వీట్‌ చేయని బన్నీ మా సినిమా కోసం ఒక లేఖ రాసి పోస్ట్‌ చేశాడు. అది మా సినిమాకు ఎంతో సపోర్ట్‌ ఇచ్చింది. ‘మేజర్‌’కు మహేశ్‌బాబు నిర్మాతగా వ్యవహరించారు. నన్ను పాన్‌ ఇండియా హీరోగా చేశారు. ఇక, నాని తన ‘హిట్‌’ ప్రపంచంలో నన్నూ భాగం చేశారు. ఇండస్ట్రీలోని పెద్దలు నన్ను అంతలా నమ్మడానికి కారణం సినిమాపై నేను చూపించే ఆసక్తి. ఈ సినిమా విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా. మీ అందరూ తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. సినిమా బాగుంటుంది. ‘హిట్‌-1’ ప్రశ్నలతో ఉత్కంఠకు గురి చేసింది. ‘హిట్‌-2’ భయపెట్టి అందర్నీ థ్రిల్‌ చేస్తుంది. ఇప్పటి వరకూ నేను నటించిన ఐదు సినిమాలు వర్కౌట్‌ అయ్యాయి. ఈ సినిమా కూడా హిట్‌ అవుతుందని నమ్ముతున్నా’’ అని శేష్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని