Vani jayaram: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
ఎన్నో వేల పాటలు ఆలపించి.. తన మధురమైన గాత్రంతో సినీ ప్రేక్షకులను అలరించిన గాయని వాణీ జయరామ్ (Vani Jayaram). దక్షిణాదికి చెందిన ఆమె బాలీవుడ్‌లో ఎంతోమంది గొప్ప సంగీత దర్శకుల సారథ్యంలో పాటలు ఆలపించి ఖ్యాతి సొంతం చేసుకున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: ‘ఆనతి నీయరా హరా’, ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘దొరకునా ఇటువంటి సేవ’, ‘తెలిమంచు కరిగింది’.. ఇలా ఎన్నో మధురమైన పాటలు ఆలపించి తెలుగువారి మదిలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు ప్రముఖ గాయని వాణీ జయరాం (Vani jayaram). దక్షిణాదికి చెందిన ఆమె వివాహం తర్వాత ముంబయికి వెళ్లి హిందీ సినిమాల్లో (Bollywood) ఎన్నో పాటలు పాడి.. కొన్నేళ్లపాటు అక్కడ అగ్రస్థానంలో కొనసాగారు. ఈ క్రమంలోనే ఎదురైన పలు చేదు అనుభవాలు తట్టుకోలేక మళ్లీ తాను మద్రాసుకు వచ్చేసినట్లు గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో వాణీ తెలిపారు. ఆమె అకాలమరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొన్న వేళ.. తన కెరీర్ గురించి వాణీ జయరామ్ గతంలో పలు సందర్భాల్లో పంచుకున్న విశేషాలు మీకోసం.
చిన్నప్పుడే ఆ మాట చెప్పారు..!
‘‘1945 నవంబర్ 30న నేను జన్మించాను. నా అసలు పేరు కలైవాణి. మా తల్లిదండ్రుల పేర్లు పద్మావతి, దొరస్వామి. మా అమ్మకు సంగీతంలో ప్రావీణ్యం ఉండేది. నా తొలి గురువు ఆమే. చిన్నతనంలోనే నా సంగీత పరిజ్ఞానం చూసి పురోహితులకు జాతకం చూపించగా.. నేను పెద్ద గాయకురాలిని అవుతానని చెప్పారు. అలా, ఐదేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకున్నా’’
ఆ పాటలు వింటే అపచారం చేసినట్టే..!
‘‘శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా, చిన్నప్పటి నుంచి నాకు సినిమా పాటలంటేనే ఎక్కువ మక్కువ. లతా మంగేష్కర్, రఫీ, నూర్జహాన్ పాటలు వినడానికి ఇష్టపడేదాన్ని. అయితే, మా ఇంట్లో సినిమా పాటలు పాడటం, వినడం నిషేధం. ఆ పాటలు వింటే ఏదో అపచారం చేసినట్లు భావించేవారు. ఎవరికీ తెలియకుండా సౌండ్ తగ్గించి రేడియోలో సినిమా పాటలు వినేదాన్ని’’
ఆ మధుర జ్ఞాపకం మర్చిపోను..!
‘‘పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నా తల్లిదండ్రులు మద్రాసుకు మకాం మార్చారు. ఆ సమయంలో నేను వీలు దొరికినప్పుడల్లా రేడియోలో కచేరీలు ఇచ్చేదాన్ని. అలా, ఓసారి ఘంటసాలను కలిశాను. ఆయన వద్దకు వెళ్లి.. ‘‘అంకుల్ నాకోసం ఓ పాట పాడారా’’ అని అడిగాను. ఆయన పాడి వినిపించారు. అలాగే కళాశాలలో చదువుతున్నప్పుడు ఓ సంగీత కచేరీ కోసం ఘంటసాల గారి తంబూర వాయించాను. ఆ రెండు విషయాలను ఎప్పటికీ మర్చిపోను’’
తొలి ఉద్యోగం..!
‘‘డిగ్రీ పాసైన తర్వాత భారతీయ స్టేట్ బ్యాంకులో నాకు ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తర్వాత బదిలీలో భాగంగా సికింద్రాబాద్ వచ్చాను. ఇక్కడే నా వివాహం జరిగింది. నా భర్త పేరు జయరాం. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆయన ప్రోత్సాహంతోనే సినిమాల్లో పాటలు పాడగలిగాను. మావారి ఉద్యోగ రీత్యా.. వివాహమైన వెంటనే ముంబయికి వెళ్లిపోయాను. మా వారికి సంగీతమంటే ప్రాణం. పండిట్ రవిశంకర్ వద్ద ఆరేళ్లు సితార్ నేర్చుకున్నారు. ఆయన చొరవతోనే వివాహమైన తర్వాత వసంత్‌దేశాయ్ వద్ద సాధన మొదలుపెట్టాను. శిక్షణకు ఇబ్బంది అవుతోన్న కారణంగా బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాను’’
‘గుడ్డి’లో తొలి అవకాశం..!
‘‘వసంత్‌దేశాయ్ సాయంతో ‘గుడ్డి’ అనే హిందీ సినిమాతో గాయకురాలిగా పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అందులో నేను పాడిన పాటలు శ్రోతల మదిని గెలిచాయి. ముఖ్యంగా అందులోని ‘బోలే రే పపీ హరా’ పాటకు నాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. దాని తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద పాటలు పాడే అవకాశం లభించింది’’
దక్షిణాదిలో తొలి సినిమా..!
‘‘స్వప్నం’ అనే మలయాళీ చిత్రం కోసం మొదటిసారి దక్షిణాదిలో పాట పాడాను. ఆ తరువాత రోజే ‘తాయుంసేయుమ్’ అనే తమిళ సినిమా కోసం పాట పాడాను. నా దురదృష్టం కొద్దీ ఆ సినిమా విడుదల కాలేదు. ‘స్వప్నం’ పాటలు బాగా ప్రాచుర్యం సొంతం చేసుకున్నాయి. దర్శకుడు కోదండపాణి తెరకెక్కించిన ‘అభిమానవంతులు’తో తెలుగువారికి పరిచయం అయ్యాను. ఈ సినిమా తర్వాత ‘నోము’, ‘పూజ’, ‘మరో చరిత్ర’, ‘సీతామాలక్ష్మి’, ‘శంకరాభరణం’, ‘సీతాకోక చిలుక’, ‘ఘర్షణ’, ‘స్వర్ణ కమలం’, ‘స్వాతికిరణం’ వంటి చిత్రాల కోసం తెలుగులో పాటలు పాడాను’’
లతాజీతో గొడవ..!
‘‘నా పాటలు మంచి ఆదరణ పొందేసరికి తనకి ఎక్కడ పోటీగా వస్తానోనని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ (Lata Mangeshkar) భయపడ్డారు. ‘గుడ్డి’లో నా పాటలు ప్రజాదరణ పొందాక.. ఆమె ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్లాను. కాకపోతే నన్ను కలవడానికి ఆమె ఆసక్తి చూపించలేదు. 1979లో విడుదలైన ‘మీరా’ మా మధ్య మరింత దూరాన్ని పెంచింది. ‘మీరా’ చిత్రానికి పండిట్ రవిశంకర్‌ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు దర్శకుడు గుల్జార్. అయితే అది లతా మంగేష్కర్‌కు నచ్చలేదు. తన సోదరుడిని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోకపోతే ఈ సినిమాలో తాను పాటలు పాడనని చెప్పారు. దాంతో గుల్జార్ నాతో ఆ సినిమాలోని పాటలన్నీ పాడించారు. అలా, లతాజీకి నాపై కోపం ఎక్కువైంది. కొన్నాళ్లుకు బాలీవుడ్‌లో రాజకీయాలు చూసి విసుగు వచ్చేసి మద్రాస్‌కు తిరిగి వచ్చేశాను’’
19 భాషలు వేల పాటలు..!
‘‘మద్రాసుకు వచ్చిన తర్వాత దక్షిణాది చిత్రాల్లో పాటలు పాడాను. అప్పటికే దర్శకుడు కె.బాలచందర్ తెరకెక్కించిన ‘అపూర్వ రాగంగళ్’లో నేను ఆలపించిన పాటలకు మంచి గుర్తింపు లభించింది. ఆ చిత్రానికి గానూ జాతీయ అవార్డు కూడా అందుకున్నాను. తెలుగులోనూ ‘శంకరభరణం’లోని ‘మానస సంచరరే’ , ‘స్వాతి కిరణం’ ‘ఆనతి నీయరా హరా’ పాటలకు ఉత్తమ గాయనిగా నేషనల్ అవార్డులు పొందాను. వరుస సినిమాల్లో పాటలు పాడుతూ గాయనిగా ఎంతో బిజీ అయ్యాను. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ మాత్రమే కాకుండా దాదాపు 19 భాషల్లో కొన్ని వేల పాటలు ఆలపించాను’’
మంగళగిరి చీరలంటే మక్కువ..!
‘‘గుంటూరు జిల్లా మంగళగిరి చేనేతలంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువగా ఆ చీరలే ధరిస్తుంటాను. నాకు కవిత్వాలు, పాటలు రాయడమంటే ఆసక్తి. వీలు కుదిరినప్పుడు పాటలు రాస్తుంటాను. అప్పుడప్పుడూ పెయింటింగ్ వేస్తుంటాను’’
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్
-
Movies News
భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!
-
Movies News
Ram gopal varma: ఆర్జీవీ నా ఫస్ట్ ఆస్కార్ అన్న కీరవాణి.. వర్మ రిప్లై ఏంటో తెలుసా?
-
Politics News
Rahul Gandhi: ‘వాజ్‌పేయీ మాటలను గుర్తుతెచ్చుకోండి’.. అనర్హత వేటుపై ప్రశాంత్ కిశోర్!