Atlee: ఆ నలుగురు హీరోలతో సినిమాలు తీయాలనుంది: ‘జవాన్‌’ దర్శకుడు

నలుగురు హీరోలతో సినిమాలు తెరకెక్కించానుందని ‘జవాన్‌’ దర్శకుడు అట్లీ తెలిపారు. వారెవరంటే?

Published : 20 Sep 2023 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జవాన్‌’ (Jawan) సినిమా విజయంతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ (Atlee). షారుక్ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విజయోత్సాహంలో అట్లీ పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర విశేషాలు పంచుకుంటున్నారు. తాను ఏయే హీరోలతో సినిమాలు తెరకెక్కించాలనుకుంటున్నారో తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. బాలీవుడ్‌ స్టార్స్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan), హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh), రణ్‌బీర్‌ కపూర్‌ ( Ranbir Kapoor)లతో పని చేయాలనుందని మనసులో మాట బయటపెట్టారు. ముందుగా సల్మాన్‌, రణ్‌బీర్‌తో సినిమాలు తెరకెక్కించాలనుందని చెప్పారు.

ఆయనతో మాట్లాడి ‘జవాన్‌’ను ఆస్కార్‌కు పంపుతా: అట్లీ

‘‘జవాన్‌’ విషయంలో దేవుడి ఆశీస్సులు నాపై ఉన్నాయనుకుంటున్నా. మంచి స్క్రిప్టు రాయగలిగేలా చేశాడాయన. అది పక్కాగా ఉండడంతో తర్వాత ప్రాసెస్‌ (చిత్రీకరణ, పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు) సజావుగా సాగింది’’ అట్లీ తెలిపారు. మరో ఇంటర్వ్యూలో వరుస విజయాలు సాధించడంపై స్పందిస్తూ.. ‘‘నేను రచయితలా, దర్శకుడిగా సినిమా తీయను. ఓ అభిమానిగా తెరకెక్కిస్తా. వ్యక్తికి అభిమానిని కాదు.. సినిమాకు అభిమానిని. ఒక చిత్రంలో అన్నింటినీ బ్యాలెన్స్‌ చేయడానికి నా దగ్గర ఎలాంటి ఫార్ములాలు లేవు. ఏది బాగుంటుందనిపిస్తే అది చేస్తా. నా జీవితంలో నేర్చుకున్న విషయాలనే సినిమాలో చూపిస్తా. నాకుటుంబం, నా చుట్టూ ఉండే వ్యక్తుల నుంచి నేను గమనించిన విషయాలను సినిమాగా చిత్రీకరిస్తా. అదే నా విజయం వెనుక రహస్యం’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని