Jawan ott release: ఓటీటీలో ‘జవాన్‌’.. స్ట్రీమింగ్‌ తేదీ ఇదే.. మరి సర్‌ప్రైజ్‌ ఏంటో తెలుసా?

Jawan ott release: షారుక్‌ఖాన్‌, అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన ‘జవాన్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 01 Nov 2023 01:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జవాన్‌’ (Jawan). సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్‌ వద్ద రూ.1,100 కోట్లు వసూలు చేసింది. షారుక్‌ ద్విపాత్రాభినయం, యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్‌ న్యూస్‌ రానే వచ్చింది. షారుక్‌ పుట్టినరోజును పురస్కరించుకుని నవంబరు 2వ (Jawan ott release date) తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘జవాన్‌’ అందుబాటులోకి రానుంది.

ఇక సర్‌ప్రైజ్‌ ఏంటంటే, థియేటర్‌లో నిడివి సమస్య తలెత్తకుండా కత్తిరించిన  అదనపు సన్నివేశాలను కూడా ఓటీటీలో జోడిస్తున్నారు. థియేటర్‌ కోసం 169 నిమిషాల నిడివి గల సినిమాను ప్రదర్శిస్తే, ఓటీటీలో ఆ సమయం ఇంకాస్త పెరగనుంది. నయనతార (Nayanthara) కథానాయికగా నటించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలతో ఒకే ఏడాది రెండు సార్లు బాక్సాఫీస్‌ వద్ద రూ.1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన నటుడిగా షారుక్‌ రికార్డు సృష్టించారు.

కథేంటంటే: గుండుతో క‌నిపించే ఓ అజ్ఞాత వ్య‌క్తి (షారుక్‌ ఖాన్‌) త‌న గ్యాంగ్‌లోని ఆరుగురు అమ్మాయిలతో క‌లిసి ముంబైలోని మెట్రో రైల్‌ని హైజాక్ చేస్తాడు. ప్ర‌భుత్వాన్ని రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తాడు. ఆ క్ర‌మంలో ప్ర‌యాణికుల ప్రాణాల్ని తీయ‌డానికి కూడా వెన‌కాడ‌డు. హైజాక‌ర్ల‌ని ప‌ట్టుకోవ‌డం కోసం ఐపీఎస్ న‌ర్మ‌ద (Nayanthara)ని రంగంలోకి దింపుతుంది అధికార యంత్రాంగం. అయినా తాను అనుకున్న‌ది సాధించి చాక‌చ‌క్యంగా త‌ప్పించుకుంటాడు. త‌న‌కి ఇచ్చిన రూ.40 వేల కోట్ల‌ని పేద‌ల ఖాతాల్లో జ‌మ చేస్తాడు. న‌యా రాబిన్‌ హుడ్‌ లాంటి ఆ హైజాక‌ర్ వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారుతుంది. న‌ర్మ‌ద‌, త‌న బృందం సాగించిన ప‌రిశోధ‌న‌లో హైజాక‌ర్...  ఓ కారాగారంలో విధులు నిర్వ‌ర్తించే జైల‌ర్ ఆజాద్ (షారుక్‌ ఖాన్) పోలిక‌ల‌తో ఉన్న‌ట్టు తేలుతుంది. జైల‌ర్ ఆజాద్ హైజాక‌ర్‌గా మారాడా? ఆయ‌న వెంట ఉన్న ఆరుగురు యువ‌తులు ఎవ‌రు? ఒక‌ప్పుడు ఆర్మీలో ప‌నిచేసిన విక్ర‌మ్ రాథోడ్ (షారుక్‌ ఖాన్‌)కీ, ఆజాద్‌కీ సంబంధం ఏంటి? (Jawan movie review) ప‌్ర‌పంచంలోని ఐదో అతి పెద్ద ఆయుధాల వ్యాపారి కాళీ గైక్వాడ్ (విజ‌య్ సేతుప‌తి) క‌థేంటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని