Kotabommali PS: ఈ సినిమా ఎవరినీ టార్గెట్‌ చేసి తీసింది కాదు: అల్లు అరవింద్‌

శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ కలిసి నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’. ఈ సినిమా టీజర్‌ విడుదల వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేదికపై అల్లు అరవింద్‌ మాట్లాడారు.

Published : 06 Nov 2023 22:55 IST

హైదరాబాద్‌: ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kotabommali PS) చిత్రాన్ని ఒకరిని టార్గెట్‌ చేస్తూ తీయలేదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) అన్నారు. ఆ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. శ్రీకాంత్‌ (Srikanth), రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ (Shivani)  ప్రధాన పాత్రల్లో దర్శకుడు తేజ మార్ని తెరకెక్కించిన చిత్రమిది. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీ వాసు, విద్య నిర్మించారు. నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్.. ఆ సారా నేను కాదు: సారా అలీఖాన్‌

ఈ వేడుకనుద్దేశించి అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘లింగి లింగి లింగిడి పాట ఈ సినిమాకే క్రేజ్‌ తీసుకొచ్చింది. ఎక్కడ విన్నా ఇదే పాట. టీజర్‌లోని డైలాగ్స్‌ బాగున్నాయి. అల్లు అరవింద్‌.. క్రికెటర్‌ ధోనీలాంటి వారు. ధోనీని చూసి టీమ్‌ అంతా బాగా ఆడుతుంది. అలాగే, అరవింద్‌ను చూస్తూ నిర్మాత బన్నీ వాసు సక్సెస్‌ అందుకున్నారు. గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లారు. అదే దారిలో ఎస్‌.కె.ఎన్‌ వచ్చాడు. ఇప్పుడు విద్య రాబోతున్నారు’’ అని అన్నారు.

అన్నీ డబ్బు కోసం కాదు: అల్లు అరవింద్‌

‘‘రాజకీయ నాయకులు పోలీసులను ఎలా వాడుకుంటున్నారోనన్న అంశం ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి ‘పోలీస్‌ ఛేజెస్‌ పోలీస్‌’ టైటిల్‌ పెట్టమని చెప్పా. తెలుగు పేరు బాగుంటుందనే ఉద్దేశంతో ‘కోట బొమ్మాళి’ పెట్టారు. ‘ఎన్ని వసూళ్లు వస్తాయని ఈ సినిమా కోసం ఇంతగా కష్టపడుతున్నారు’ అని మా స్టాఫ్‌లో కొందరు అనుకున్నారు. అన్ని సినిమాలు డబ్బుల కోసమే కాదు అని నేను సమాధానమిచ్చా’’ అని పేర్కొన్నారు. అనంతరం అరవింద్‌, నిర్మాత బన్నీ వాసు, రాహుల్‌, శివానీ, తేజ మార్ని మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలివీ..

* ఏదైనా రాజకీయ పార్టీని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా నిర్మించారా?

బన్నీ వాసు: ఒక పార్టీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు చేయలేదు. తమ పార్టీ గురించే చూపించామని ఎవరైనా భుజాలు తడుముకుంటే నాకు సంబంధం లేదు. సమకాలీన రాజకీయాలు ఎలా ఉన్నాయో దాన్నే ప్రస్తావించాం.

అల్లు అరవింద్‌: ఓ పార్టీనో, ఓ ప్రాంతాన్నో ఉద్దేశించి ఈ సినిమా తీయలేదు. ఇండియన్‌ పొలిటికల్‌ సిస్టమ్‌లో పోలీసులను రాజకీయ నాయకులు ఎంత దారుణంగా చూస్తారు? పోలీసులు ఎంత ఇబ్బంది పడుతున్నారోనన్న నేపథ్యంలో రూపొందింది. ఎవరినీ టార్గెట్‌ చేసి తీసింది కాదు.

* ఇంతటి సీరియస్‌ స్టోరీలో ‘లింగిడి’ పాట పెట్టడానికి కారణం?

బన్నీ వాసు: పాటలే సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేయగలుగుతాయి. ఈ చిత్రాన్నీ ఎక్కువ మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పాటను పెట్టాం.

* మాతృక (మలయాళ సినిమా నాయట్టు) కథలో ఎన్ని మార్పులు చేశారు?

తేజ: ఆ సినిమా సోల్‌ని మాత్రమే తీసుకుని మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేశాం.

* పోలీసు పాత్రలకు మీ ఫాదర్‌ (రాజశేఖర్‌) పెట్టింది పేరు. ఈ సినిమా కోసం మీరు ఖాకీ దుస్తులు ధరించడం ఎలా అనిపించింది?

శివాని: నాన్న పోలీసు పాత్రలతో మంచి గుర్తింపు పొందారు. తాత రియల్‌ పోలీసు. ఇందులో నేను కానిస్టేబుల్‌ పాత్ర పోషించా. నాన్నతో పోల్చి చూస్తారేమోనని టెన్షన్‌ పడేదాన్ని. బాగా నటించాననే అనుకుంటున్నా. ‘నా పరువు తీయకురా’ అని నాన్న సరదాగా అన్నారు.

* ‘గీతా ఆర్ట్స్‌’ మునుపటిలా పెద్ద సినిమాలు నిర్మించట్లేదనే విమర్శలపై మీరేమంటారు?

అల్లు అరవింద్‌: పెద్ద ప్రాజెక్టులు రెండు ఉన్నాయి. పలు కారణాల వల్ల అవి వాయిదా పడుతున్నాయి. చిన్న చిత్రాలు నిర్మించి మేం ఇండస్ట్రీని పోషించడమనేదేమీ లేదు. మా ప్రయాణం కొందరికి ఉపయోగపడుతుంది. మా ఉనికి కోసం మేం సినిమాలు చేస్తున్నాం. సినిమా బడ్జెట్‌లో హీరోలు 20 శాతమే రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారు. హీరోల వల్ల సినిమా కాస్ట్‌ పెరిగిపోతోందనడం కంటే బడ్జెట్‌ పెంచిన సినిమాల్లో హీరోలు ఉంటున్నారు అని అనడం బెటరేమో. హీరోలు ఎవరైనా సరే పెద్ద స్కేల్‌లో చూపిస్తేనే తప్ప ప్రేక్షకులు సినిమాలను ఆదరించని పరిస్థితి.

* త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. వాటిపై ఈ సినిమా ప్రభావం చూపుతుందా?

బన్నీ వాసు: నో కామెంట్స్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు