MAA Election: ‘మా’టల్తో హీటెక్కిస్తున్నారు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష ఎన్నికల కారణంగా గడిచిన వారం రోజుల నుంచి టాలీవుడ్‌లో పరిస్థితుల హీటెక్కినట్లే అనిపిస్తున్నాయి. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ పలకరించుకునే నటీనటులు....

Published : 29 Jun 2021 01:39 IST

కలిసి పని చేద్దామంటున్నారు.. చర్చలకు తావిస్తున్నారు

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్ష ఎన్నికల కారణంగా గడిచిన వారం రోజుల నుంచి టాలీవుడ్‌లో పరిస్థితులు హీటెక్కినట్లే అనిపిస్తున్నాయి. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ పలకరించుకునే నటీనటులు ఇప్పుడు ఒకరిపై ఒకరు పరోక్షంగా చిరు విమర్శలు చేస్తున్నారు. అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరూ ‘కలిసి పనిచేద్దాం’ అంటున్నప్పటికీ.. అదే సమయంలో వివాదాలకు తావిచ్చేలా కొన్ని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

లోకల్‌ నాన్‌లోకల్‌..!

ఈ ఏడాది ‘మా’ ఎన్నికల కారణంగా తెరపైకి వచ్చిన విషయం లోకల్‌ - నాన్‌లోకల్‌. అధ్యక్ష పదవికోసం పోటీ చేస్తున్న ఓ ప్రముఖ నటుడు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని.. ఆయనకు ఇక్కడి సమస్యలు, కళాకారులు ఎదుర్కొంటున్న బాధలు తెలియవని.. ఆయన ఇక్కడ ఎలా పోటీలో నిలబడతారన్న కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. అవి కచ్చితంగా ఎవరు చేశారో తెలియకున్నా, ఆ వ్యాఖ్యలు నెట్టింట్లో చర్చకు దారి తీశాయి. దీనిపై ప్రముఖ నటీనటులు స్పందించారు.  ‘మా’ సభ్యత్వం ఉన్నవారెవరైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అని చెప్పడంతో అది కాస్తా సద్దుమణిగింది.

‘మా’ మసకబారింది..!

అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘మా’ మసకబారింది’ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు అందర్నీ షాక్‌కు గురిచేశాయి. ఈ మాటలపై ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ సైతం అసంతృప్తి వ్యకం చేశారు. నరేష్‌.. ప్రకాశ్‌ రాజ్‌ మీడియా సమావేశమైన తర్వాత రోజే కౌంటర్‌గా ప్రెస్‌మీట్‌ పెట్టారు. నాగబాబు మాటలు తనని ఎంతో బాధించాయని అన్నారు. తనకి కథలు చెప్పే అలవాటు లేదని.. పదవులపై ఎలాంటి వ్యామోహం లేదని.. అలాగే, ఎన్నికలు ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

వాళ్లని సస్పెండ్‌ చేయాలి..!

ప్రస్తుతం ఫోర్స్‌లో ఉన్న ‘మా’ జనరల్‌ కమిటీ సభ్యులు మరో ప్యానల్‌లో ఎలా చేరతారంటూ నటి కరాటే కల్యాణి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ సభ్యులందర్నీ సస్పెండ్‌ చేయాలంటూ ఆమె డిమాండ్‌ చేశారు. పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఎంతో కష్టపడి కళాకారుల సంక్షేమం కోసం పనిచేస్తున్నప్పటికీ తమ బృందంపై కొంతమంది కావాలనే విమర్శల వర్షం కురిపిస్తున్నారని ఆమె అన్నారు కూడా.

‘మా’దే కానీ రెండు విభాగాలు..!

ఈ ఏడాది జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు నటుడు సీవీఎల్‌ నరసింహారావు. పేద, చిన్న కళాకారుల సంక్షేమమే ధ్యేయమన్న ఆయన.. పరభాషా నటీనటులకు అవకాశం ఇవ్వడం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని వారికి అన్యాయం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ‘మా’లో తెలంగాణ, ఆంధ్రా అనే రెండు విభాగాలుండాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్‌నగర్‌లో ప్రతి ఒక్కర్నీ షాకయ్యేలా చేశాయి. మరోవైపు ఆయన చేసిన వ్యాఖ్యలకు నటి విజయశాంతి కూడా సపోర్ట్‌ చేయడం సినీ ప్రియుల్ని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని