Leo Review: ‘లియో’ సెన్సార్‌ రిపోర్ట్‌ ఇదే.. ఫస్ట్‌ రివ్యూ ఇచ్చేసిన అనిరుధ్‌!

విజయ్‌-లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘లియో’ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌బోర్డు మొత్తం 13 కట్స్‌ చెప్పింది.

Updated : 10 Oct 2023 15:35 IST

హైదరాబాద్‌: గత దసరాతో పోలిస్తే, ఈసారి పండగకు వినోదాల విందు రెట్టింపు కానుంది. ఇటు తెలుగుతో పాటు, అటు తమిళ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయనున్నాయి. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ (Vijay) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘లియో’ (Leo). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు ‘లియో’కు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఇక సినిమా పూర్తి రన్‌టైన్‌ 2 గంటల 44 నిమిషాలు. మొత్తం 13 చిన్న మార్పులను సెన్సార్‌ బోర్డు సూచించింది. ముఖ్యంగా రక్తం, హింస కనిపించే సన్నివేశాల్లో కోత పెట్టింది. అయితే, అవి కూడా చాలా తక్కువ సెకన్లే. గతంలో విజయ్‌-లోకేష్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్టర్‌’ మూవీకి కూడా సెన్సార్‌ తక్కువ కట్స్‌ చెప్పడం గమనార్హం.

‘కొత్త బంగారులోకం’.. ఆ హీరోలు చేయాల్సింది కానీ!

మరోవైపు ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సినిమాకు తన రివ్యూను ఇచ్చేశాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌ వేదికగా ఫైర్‌, బాంబ్‌, ఎమోషన్స్‌ ట్రోఫీల ఎమోజీలను షేర్‌ చేశాడు. సాధారణ సన్నివేశాన్ని కూడా తన నేపథ్య సంగీతంతో ఎలివేట్‌ చేయడంలో అనిరుధ్‌ సిద్ధహస్తుడు. ఆయన మ్యూజిక్‌ అందించిన గత చిత్రాలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇటీవల రజనీకాంత్‌ ‘జైలర్‌’ అందుకు మరో నిదర్శనం. ఇప్పుడు ‘లియో’ విషయంలోనూ అనిరుధ్‌ తన మేజిక్‌ను పునరావృతం చేసినట్లు అనిపిస్తోంది. తన ట్వీట్‌ చూస్తుంటే, ఫైనల్‌ అవుట్‌ఫుట్‌ ఓ రేంజ్‌లో వచ్చినట్లు అర్థమవుతోంది. మరి వెండితెరపై ఏ విధంగా మెరుస్తుందో తెలియాలంటే మరో పది రోజులు వేచి చూడాల్సిందే.  ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచింది. అదే సమయంలో కథను పూర్తిగా రివీల్‌ చేయకుండా లోకేష్‌ కనగరాజ్‌ చాలా జాగ్రత్త పడ్డారు. ‘లియో’ ట్రైలర్‌ సినిమాకు మినీయేచర్‌ అని, వెండితెరపై ఇంతకు మించిన యాక్షన్‌ ఉంటుందని లోకేష్‌ చెప్పడం గమనార్హం. విజయ్‌ జోడీగా త్రిష నటిస్తున్న ‘లియో’లో సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌మేనన్‌, మన్సూర్‌ అలీఖాన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రామ్‌చరణ్‌ అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని