Leo2: ఇదేం ట్విస్ట్‌ లోకేషా... ‘లియో’ ఫ్లాష్ బ్యాక్‌ ఫేక్‌ అట!

Leo2 Update: ప్రస్తుతం ‘లియో’లో ఉన్న విజయ్‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ అసలైనది కాదని, వేరే ఉందని దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ చెప్పారు.

Updated : 30 Oct 2023 14:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో క్రేజ్‌ ఉన్న దర్శకుల్లో లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ఒకరు. ఆయన దర్శకత్వంలో విజయ్‌ (Vijay) కథానాయకుడిగా నటించిన ‘లియో’ (leo) ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మిశ్రమ స్పందనలు అందుకున్నా, ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ మూవీల వల్ల వచ్చిన క్రేజ్‌ కారణంగా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. తన సినిమాలోని పాత్రలతో లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (ఎల్‌సీయూ)ను సృష్టించిన లోకేష్‌ తాజాగా ‘లియో’ గురించి మాట్లాడుతూ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. ప్రస్తుతం మనం సినిమాలో చూసిన ‘లియో’ ఫ్లాష్‌బ్యాక్‌ అసలైనది కాదట. ఫేక్‌ అట. పార్తిబన్‌ అలియాస్‌ లియో గురించి తెలుసుకునే క్రమంలో జైలులో ఉన్న హిదయరాజ్‌ (మన్సూర్‌ అలీఖాన్‌)ను ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఆండ్రూస్‌ (గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌)కలుస్తాడు. ఈ సందర్భంగా ‘నా దృష్టికోణం నుంచి లియో కథ ఇది’ అని అతడు చెబుతాడు. కానీ, ‘లియో’ అసలు జీవితం మరొకలా ఉంటుందని లోకేష్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘లియో2’లో దాని గురించి పూర్తిగా ఉంటుందన్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ ఇంత సినిమా తీసి, ‘ఇదేం ట్విస్ట్‌ లోకేషా...’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా?

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లియో’ (Leo) సగటు ఎల్‌సీయూ (LCU) అభిమానిని కాస్త నిరాశపరిచిన మాట వాస్తవం. అందుకు కారణం.. ‘లియో’ ఫ్లాష్‌ బ్యాక్‌ను పవర్‌ఫుల్‌గా ఎస్టాబ్లిష్‌ చేయలేదు. లియో తండ్రి ఆంటోనీ దాస్‌, బాబాయ్‌ హరోల్డ్‌ దాస్‌ పాత్రలను కూడా బలంగా తీర్చిదిద్దలేదు. దీనికి తోడు ఆంటోనీదాస్‌ మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటాడు. అది సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించదు. హీరో కంటే విలన్‌ బలంగా ఉన్నప్పుడే కథ రక్తికడుతుంది. ఆ విషయంలో లోకేష్‌ ‘లియో’ఫ్లాష్‌ బ్యాక్‌ను చుట్టేశారేమో అనిపించింది. ఈ క్రమంలో విజయ్‌ అభిమానులతో పాటు, ఎల్‌సీయూకు కనెక్ట్‌ అయిన వారిని తృప్తిపరిచేందుకు ‘లియో ఫ్లాష్‌బ్యాక్‌ అది కాదు’ అంటూ లోకేష్‌ కొత్త పల్లవి అందుకున్నారనిపిస్తోంది. ‘లియో’కు అసలైన, బలమైన ఫ్లాష్‌ బ్యాక్‌ ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు వచ్చిన సినిమాలోనే చూపించి ఉంటే బాగుండేది కదాని అభిప్రాయపడుతున్నారు. బహుశా ‘ఎల్‌సీయూ’ ఒత్తిడి నేపథ్యంలో దాన్ని విస్మరించి ఉండవచ్చు. ఇప్పుడు ‘లియో2’లో ఆ పాత్రకు సంబంధించిన అసలు హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే అవకాశం ఉంది. కానీ, ‘లియో2’ అనుకున్న త్వరగా రాకపోవచ్చు.

ఇటీవల వివిధ ఇంటర్వ్యూల్లో లోకేష్‌ పంచుకున్న వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం రజనీకాంత్‌ సినిమాపైనే ఉంది. ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్తుంది. దీని తర్వాత వెంటనే ‘ఖైదీ2’ మొదలవుతుంది. దాని తర్వాత ‘రోలెక్స్‌’ పాత్ర నేపథ్యంలో స్పెషల్‌ మూవీ చేస్తారు. ఇది పూర్తయితేనే ‘లియో2’కు ఛాన్స్‌ ఉంటుంది. అప్పటి పరిస్థితిని బట్టి పక్కన కూడా పెట్టవచ్చు. ఒకవేళ ఇప్పుడు చూపించిన లియో ఫ్లాష్‌బ్యాక్‌ ఫేక్‌ అయితే, ఒరిజినల్‌ ఫ్లాష్‌బ్యాక్‌లో ఆంటోనీదాస్‌, హరోల్డ్‌ దాస్‌ పాత్రలు మళ్లీ వస్తాయి. దీన్ని ‘విక్రమ్‌2’తో కనెక్ట్‌ చేస్తారు. ఎల్‌సీయూలో చివరి సినిమాగా అంటే ‘ది ఎండ్‌ గేమ్‌’ మాదిరిగా ‘విక్రమ్‌2’ను తెరకెక్కిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని