Leo: ఆ యూనివర్స్‌లో ‘లియో’.. హీరో హింట్‌.. తెలుగు రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌

తమిళ హీరో విజయ్‌ నటించిన ‘లియో’ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. అనుకున్న తేదీనే (అక్టోబరు 19) ఈ సినిమా విడుదల కానుంది.

Published : 18 Oct 2023 19:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj). విజయ్‌ (Vijay) హీరోగా ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘లియో’ (Leo). ఇది LCU (లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌)లో భాగమా, కాదా?అని తెలుసుకునేందుకు ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఈ మేరకు దర్శకుడికి పలు ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు ఎదురైనా ఆయన మాత్రం సమాధానాన్ని దాటవేసేవారు. కానీ, నటుడు, తమిళనాడు రాష్ట్రమంత్రి ఉదయనిధి ఓ పోస్ట్‌తో హింట్‌ ఇచ్చారు. ఈ సినిమా ఈ నెల 19న విడుదలకానున్న సందర్భంగా టీమ్‌కు ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ #LCU హ్యాష్‌ట్యాగ్‌ జోడించారు. దాంతో, ‘లియో’.. లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగమే అని సినీ ప్రియులు ఫిక్స్‌ అయిపోతున్నారు.

విడుదలకు ముందు ‘లియో’కు షాకిచ్చిన తమిళనాడు ప్రభుత్వం..

మరోవైపు, ఈ సినిమా తెలుగు వెర్షన్‌ విడుదలపై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఈ చిత్రం తెలుగు రిలీజ్‌పై మంగళవారం స్టే విధించిన హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు తదుపరి విచారణ అనంతరం బుధవారం దాన్ని కొట్టివేసింది. దాంతో, తెలుగులోనూ ఈ సినిమా గురువారం విడుదల కానుంది. ‘లియో’ సినిమా టైటిల్‌ పూర్తి హక్కులు తమవేనని నిర్మాత దినకర్‌రాజు తెలుగు ఫిలిం ఛాంబర్‌ను సంప్రదించగా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేసును విచారించిన కోర్టు సినిమా విడుదలను 20వ తేదీ వరకు నిలిపివేస్తూ తొలుత ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న నిర్మాత నాగవంశీ ప్రెస్‌మీట్‌ నిర్వహించి ‘లియో’ టైటిల్‌ విషయంలో సమాచార లోపంతో సమస్య తలెత్తిందని, తామిరువురు చర్చించుకుని ఎవరికీ నష్టం జరగకుండా చూసుకుంటామన్నారు. విజయ్‌, లోకేశ్‌ కనగరాజ్‌ తెలుగు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలను పురస్కరించుకుని హీరో విశాల్ ‘లియో’ బృందానికి విషెస్‌ తెలిపారు. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్ర పోషించాల్సి ఉండగా కాల్షీట్స్‌ సర్దుబాటుకాక నటించలేకపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని