Bramayugam: మమ్ముట్టి మరో ప్రయోగం.. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ‘భ్రమయుగం’

మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘భ్రమయుగం’ విడుదలకు సిద్ధమైంది. తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది.

Updated : 03 Feb 2024 20:23 IST

హైదరాబాద్‌: 70ఏళ్ల వయసులోనూ ప్రయోగాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు మమ్ముట్టి (Mammootty). ఇటీవల ‘కాథల్‌: ది కోర్‌’లో ‘గే’ పాత్రలో నటించి విమర్శకులను సైతం మెప్పించారు. ఇప్పుడు మరో విభిన్న కథతో రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రాహుల్‌ సదాశివన్‌ తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం ‘భ్రమయుగం’ (Bramayugam). నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. అర్జున్‌ అశోకన్‌, సిద్ధార్థ్‌ భరతన్‌, అమల్దా లిజ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

భిన్నమైన హారర్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన ఈ చిత్రంతో మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ మూవీని థియేటర్స్‌లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ థీమ్‌లోనే విడుదల చేయబోతున్నారు. అంటే ఒక్క సన్నివేశం కూడా కలర్‌లో ఉండదు. సాధారణంగా ఫ్లాష్‌బ్యాక్‌ చూపించాలనుకున్నప్పుడు కొన్ని సన్నివేశాలకు ఆ థీమ్‌ను ఉపయోగిస్తారు. కానీ, సినిమా మొత్తం బ్లాక్ అండ్‌ వైట్‌లో వస్తుండటంతో ఇప్పుడిది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల విడుదలైన మలయాళ టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఫిబ్రవరి 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఇటీవల సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. ఈ సందర్భంగా కథకు సంబంధించిన వివరాలు కాస్త బయటకు వచ్చాయి. కేరళలో మాయలు, మంత్రాలు, తంత్రాలు వాస్తవిక ప్రపంచంలో ఉన్న రోజులవి. పానన్‌ వర్గానికి చెందిన తేవన్‌ అనే జానపద గాయకుడు భగవంతుడిని కీర్తిస్తూ పాటలు పాడుతుంటాడు. బానిసల క్రయ విక్రయాలు ఆ రోజుల్లో సర్వసాధారణం. అలా తేవన్‌ కూడా బానిసగా అమ్ముడుపోయే క్రమంలో ఆ మార్కెట్‌ నుంచి తప్పించుకుంటాడు. అనుకోకుండా ఒక ప్రదేశంలోకి వెళ్తాడు. అక్కడ రహస్య మార్గంలో పయనించడం మొదలుపెడతాడు. మరి ఆ మార్గం అతడిని ఎటువైపు తీసుకెళ్లింది? దాని నుంచి బయటపడ్డాడా? లేదా అన్నది కథ. ఇందులో మమ్ముట్టి నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని