Manchu Vishnu: జగన్‌-చిరంజీవి భేటీపై మంచు విష్ణు షాకింగ్‌ కామెంట్స్‌..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ని ఇటీవల అగ్రకథానాయకుడు చిరంజీవి కలవడంపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తాజాగా తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు సినిమా .....

Updated : 07 Feb 2022 15:55 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ని ఇటీవల అగ్రకథానాయకుడు చిరంజీవి కలవడంపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు షాకింగ్‌ కామెంట్లు చేశారు. తాజాగా తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణు సినిమా టికెట్‌ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలు సినీ పరిశ్రమను ఎంతో ప్రోత్సహిస్తున్నాయన్నారు. స్వలాభం కోసం ఒకరిద్దరు వ్యక్తిగత నిర్ణయాలను బయటపెడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

‘‘తెలంగాణలో ఇటీవల సినిమా టికెట్‌ రేట్లు పెంచారు. దానిపై కొందరు కోర్టుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్లు తగ్గించారు. దానిపైనా కోర్టుకు వెళ్లారు. ధరలు తగ్గించడం మంచిదా? లేదా పెంచడం మంచిదా? అనేది చాలా పెద్ద అంశం. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒకే తాటిపైకి వచ్చి గళాన్ని విప్పాలి. ఇండస్ట్రీలో నిర్మాతల మండలి, ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌.. ఇలా పలు అసోసియేషన్స్‌ ఉన్నాయి. ఆయా అసోసియేషన్స్‌తో మేము చర్చలు జరుపుతున్నాం. ఈ ఇండస్ట్రీ ఏ ఒక్కరిదీ కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీ సొంతమే. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏ నిర్ణయం తీసుకుంటే మేము దానికి కట్టుబడి ఉంటాం. అంతేకానీ, వ్యక్తిగత అభిప్రాయాలను బయటపెట్టడం నాకు ఇష్టం లేదు. రెండు ప్రభుత్వాలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. టికెట్‌ ధరల విషయంపై ఆయా ప్రభుత్వాలతో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చర్చలు జరుపుతోంది. మాకు కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇస్తోంది. అలా, కాకుండా మమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాలని కోరితే తప్పకుండా మేము కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడతాం. ప్రస్తుతం ఈ విషయంపై పలువురు నన్ను విమర్శిస్తున్నారంటే.. నేను పాపులర్‌ అయ్యాననే అనుకుంటున్నా. ఇటీవల చిరంజీవి వెళ్లి జగన్‌ని కలిసి వచ్చారు. అది చిరు వ్యక్తిగత సమావేశం. ఈ సమావేశాన్ని అసోసియేషన్‌ భేటీగా భావించొద్దు. అలాగే టికెట్‌ ధరలపై వైఎస్‌ హయాంలో ఓ జీవో వచ్చింది. ముందు ఆ జీవో గురించి చర్చ జరగాలి’’ అని మంచు విష్ణు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు గత నెలలో జగన్‌ని కలిసిన చిరు.. సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను సీఎంతో చర్చించారు. సినిమా పరిశ్రమ మేలు కోసమే తాను సీఎంతో భేటీ అయ్యానని చిరు అప్పుడు ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని