Khushbu: మన్సూర్‌ వ్యాఖ్యలపై ఖుష్బూ ఆగ్రహం

మన్సూర్‌ అలీఖాన్‌(Mansoor Ali Khan)పై జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ (Khushbu) ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిష (Trisha)కు ఆయన క్షమాపణ చెప్పననడాన్ని ఆమె తప్పుబట్టారు.

Published : 22 Nov 2023 16:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan)పై జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు, నటి ఖష్బూ (Khushbu) ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిష(Trisha)కు క్షమాపణలు చెప్పననడాన్ని ఆమె తప్పుబట్టారు. ‘‘ఇలాంటి వ్యక్తులు.. పక్కవాళ్లు చేసిన తప్పులను ఎత్తి చూపించి తాము చేసినదాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. మన్సూర్‌ అలీఖాన్‌ ఎదుటివాళ్లను వేలెత్తి చూపించే ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు స్త్రీలను ఎంతగా ద్వేషిస్తారో మీ అహంకార వైఖరి తెలియజేస్తుంది. క్షమించండి.. ఈ వివాదం నుంచి మీరు బయటపడలేరు. క్షమాపణలు చెప్పడంతో మీరేమీ తగ్గిపోరు. కానీ, మీ ఇంట్లో ఉండే మహిళలకు గౌరవాన్ని ఇచ్చినట్లు అవుతుంది. సినిమాల్లో పోషించిన పాత్రలనే నిజ జీవితంలోనూ మీరు ఫాలో అవుతున్నట్లు ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుగా అనిపిస్తుంది’’ అని ఖుష్బూ ట్వీట్‌ చేశారు.

అసలేం జరిగిందంటే: విజయ్‌ - త్రిష జంటగా నటించిన ‘లియో’ (leo)తో ప్రేక్షకులను అలరించారు మన్సూర్ అలీఖాన్‌. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన సహాయనటుడిగా కనిపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన త్రిషతో ఓ సన్నివేశంలో యాక్ట్‌ చేయడంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘‘కెరీర్‌ ఆరంభం నుంచి ఇప్పటివరకూ నేను ఎన్నో రేప్‌ సీన్స్‌లో యాక్ట్‌ చేశా. ‘లియో’లో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ చేసే అవకాశం ఉంటుందనుకున్నా. అలా లేకపోవడం నన్నెంతో బాధించింది’’ అని ఆయన అన్నారు.

ఆ విషయాన్ని తట్టుకోలేకపోయా.. రెండు సార్లు గుండెపోటుకు గురయ్యా: అనురాగ్‌ కశ్యప్‌

మన్సూర్‌ వ్యాఖ్యలు అంతటా చర్చకు దారి తీశాయి. సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే త్రిషకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ విషయంపై మన్సూర్‌.. మంగళవారం ప్రెస్‌మీట్ పెట్టారు. తాను క్షమాపణ చెప్పాలనుకోవడం లేదన్నారు. మరోవైపు, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అతడిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని