Mrunal Thakur: హృతిక్‌ రోషన్‌ విషయంలో.. చాలా బాధపడ్డా: మృణాల్‌ ఠాకూర్‌

హృతిక్‌ రోషన్‌ విషయంలో చాలా బాధపడ్డానని నటి మృణాల్‌ ఠాకూర్‌ అన్నారు. దేని గురించి చెప్పారంటే?

Published : 31 Jan 2024 15:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ల్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). ఎంపిక చేసుకున్న పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటివరకు కథా బలమున్న చిత్రాల్లో నటించడం వల్ల తనలోని డ్యాన్సర్‌ను చూపించే అవకాశం రాలేదని పేర్కొన్నారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘‘నేను సీరియస్‌ స్టోరీల్లో ఎక్కువగా నటించా. దాంతో ఉర్రూతలూగే డ్యాన్స్‌ చేసే అవకాశం రాలేదు. ముఖ్యంగా హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan)తో కలిసి నటించిన ‘సూపర్‌30’లో ఆయనతో ఆడిపాడే ఛాన్స్‌ దక్కనందుకు చాలా బాధపడ్డా. ‘జెర్సీ’ (Jersy) విషయంలోనూ అంతే. షాహిద్‌ కపూర్‌తో కలిసి డ్యాన్స్‌ చేసే పరిస్థితి లేదు. అందుకే ఆయనతో ఎంటర్‌టైనర్‌ మూవీలో నటించాలనుకుంటున్నా. ఇలా నా సహ నటులంతా మంచి డ్యాన్సర్లే. వారితో సినిమాల్లో డ్యాన్స్‌ చేసే స్కోప్‌ లేదు కాబట్టి   తెర వెనక చేస్తుంటా. వాటిని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటా. ఆ లోటును ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా తీరుస్తోంది’’ అని తెలిపారు.

గత ఇంటర్వ్యూలో ప్రేమకథా చిత్రాల అవకాశాలపై స్పందించారు. ‘‘హిందీలో రొమాంటిక్‌ చిత్రాల్లో నటించేందుకు నాకు ఛాన్స్‌ ఎందుకు రావడం లేదో తెలీదు. ప్రేమ కథల్లో నటించే అంతటి పాపులారిటీ నాకింకా రాలేదు అనుకుంటున్నా. ఆ జానర్‌ చిత్రాల్లో నటించాలని ఉంది. అలాంటివి నేను కూడా చేయగలనని నిరూపించుకోవడంలో విసిగిపోయా. ఇప్పటికే ఎంతోమందిని అడిగా. ఇకపై అది సహజంగా జరగాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

మహారాష్ట్రకు చెందిన మృణాల్‌ పలు ధారావాహికల్లో నటించి, 2014లో ‘హలో నందన్‌’ (మరాఠీ)తో హీరోయిన్‌గా మారారు. ‘లవ్‌ సోనియా’తో బాలీవుడ్‌లోకి, ‘సీతారామం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సీతామహాలక్ష్మి/ ప్రిన్సెస్‌ నూర్జహాన్‌గా నటించి తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ‘హాయ్‌ నాన్న’లో యష్న, వర్షగా అలరించారు. ప్రస్తుతం.. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) సరసన ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star)లో నటిస్తున్నారు. దీనికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు, హిందీలో ‘పూజా మేరీ జాన్‌’తో బిజీగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని