Brahmastram: అభిమానులకు ఎన్టీఆర్‌ క్షమాపణలు.. ‘బ్రహ్మాస్త్రం’ వేడుక రద్దుపై రాజమౌళి ఏమన్నారంటే?

రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్రం. నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీరాయ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది.

Updated : 03 Sep 2022 06:40 IST

హైదరాబాద్‌: రణ్‌బీర్‌ కపూర్‌ ( Ranbir Kapoor), అలియా భట్‌ (Alia Bhatt) ప్రధాన పాత్రల్లో అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్రం’ (Brahmastram). నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీరాయ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. చిత్ర బృందంతోపాటు ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌, దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు. 

పోలీసుల మాట వినటం మన ధర్మం

శుక్రవారం సాయంత్రం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరగాల్సిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వాయిదాపై ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ఈవెంట్‌ వేదికకు వచ్చిన, రావాలనుకున్న నా అభిమానులకు ముందుగా క్షమాపణలు. మీరు వేడుకకు రాకపోయినా మంచి చిత్రాలను, నన్ను ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మీడియానూ క్షమాపణలు కోరుకుంటున్నా. వినాయక విగ్రహ నిమజ్జనాల నేపథ్యంలో అధిక బందోబస్తును ఏర్పాటు చేయలేమని పోలీసు డిపార్ట్‌మెంట్‌ చెప్పింది. పోలీసులు ఉండేది మన భద్రత కోసం.. వారు చెప్పింది వినటం మన ధర్మం. అందుకే వారికి సహకరించి మేం ఇలా  చిన్న వేదికపై నుంచి మీతో మాట్లాడుతున్నాం. నేను చాలా మంది నటులను ఇష్టపడతా. అమితాబ్‌ బచ్చన్‌ ప్రభావం ఓ నటుడిగా నాపై చాలా ఉంది. ఆయనకు నేను వీరాభిమానిని. ఆ తర్వాత నేనంతగా ఇష్టపడేది రణ్‌బీర్‌నే. అతనితో కలిసి ఈ వేదికను పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు. అలియా, అయాన్‌.. చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్‌ ది బెస్ట్‌. తెలుగు నటుడు హిందీ సినిమాలో నటించి, హిందీ మాట్లాడితే ఎలా ఉంటుందనేది నాగార్జున బాబాయ్‌ ‘ఖుదా గవా’ చూసి తెలుసుకున్నా. ‘బ్రహ్మాస్త్రం’లోనూ ఆయన హిందీ మాట్లాడారనుకుంటున్నా. మనపై ఒత్తిడి ఉన్నప్పుడే బెటర్‌గా పనిచేయగలుగుతామనే దాన్ని నేను నమ్ముతా. ఈ ఛాలెంజ్‌ని ఇండస్ట్రీ స్వీకరించాలి. నేను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటం లేదు. ప్రేక్షకులకు మంచి కథలను అందించేందుకు ప్రయత్నిద్దాం’’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

అందుకే ఈవెంట్‌ రద్దైనట్లుంది: రాజమౌళి

రాజమౌళి (Rajamouli) మాట్లాడుతూ.. ‘‘ఈవెంట్‌కు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. మీరంతా చూస్తే ఎంతో బాగుంటుందని అనుకున్నా. టీమ్‌ అంతా చాలా కష్టపడింది. కానీ, అనుకున్నట్టు జరగలేదు. కరణ్‌ జోహార్‌ వినాయక పూజ సరిగా చేసుండరు.. అందుకే ఇలా జరిగిందేమో (నవ్వుతూ..). పోలీసు అధికారుల నుంచి ఇప్పటికే అనుమతి పొందాం. ఈరోజు గణేశ్‌ విగ్రహ నిమజ్జనాలు ఎక్కువగా ఉండటం వల్ల బందోబస్తు ఏర్పాటు చేయలేకపోతున్నామన్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌ అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాడు. దానికి తగ్గట్లు వేడుకలో ఎన్టీఆర్‌ తొడగొడితే ఫైర్‌ వచ్చే విధంగా ప్లాన్‌ చేశాం. సక్సెస్‌ ఈవెంట్‌లో అది తప్పకుండా చేస్తాం’’ అని రాజమౌళి తెలిపారు. ఈ సినిమాని తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్న విషయం తెలిసిందే. Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని