హిట్‌ అవుతుందో.. ఫ్లాప్‌ అవుతుందో.. కథ విని చెప్పేసేవారు!

అలా కలిసుందాంరా, ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, గణేష్‌, నారప్ప..ఇన్నిచిత్రాల్లో ఒక్కోరకంగా కనిపిస్తాడు

Updated : 28 Jul 2021 15:40 IST

అది రామానాయుడి గారి గొప్పదనం

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో యూట్యూబ్‌ వేదికగా తన అనుభవాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘నారప్ప’ చిత్రం చూసిన ఆయన..దగ్గుబాటి కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మరి రామానాయడు, సురేష్‌బాబు, వెంకటేశ్‌, రానా గురించి ఆయన ఏం చెప్పారంటే.

ఎన్టీఆర్‌ దైవం.. రామానాయుడు గాడ్‌ఫాదర్‌

నారప్ప చిత్రం చూడగానే.. రామానాయుడు, సురేష్‌, వెంకటేశ్‌, రానా గుర్తొచ్చారు. అందుకే వాళ్ల కుటుంబంలో అందరి గురించి జ్ఞాపకం చేసుకొని ఒక రుణం తీర్చుకోవాలి. ఎన్టీఆర్‌ గారిని దైవంగా భావిస్తే రామానాయుడు గారిని గాడ్‌ ఫాదర్‌గా భావించేవాళ్లం. నారప్ప సినిమాను  రామానాయుడు గారు చూసుంటే వెంకటేశ్‌ నటన చూసి ఎంతో సంతోష పడేవారని అనిపించింది. ఆయన ప్రపంచంలో బెస్ట్‌ జడ్జి. కథ వినగానే ఇది ఆడుతుందని అన్నది ఏదీ ఫ్లాప్‌ కాలేదు. కథ బాలేదు అంటే మనం సరిచేసి చెబితే ఇప్పుడు బానే ఉంది అని చెప్పేవారు. ఆయన ‘ప్రతిధ్వని’ కథ విన్నది 7-8 నిమిషాలు అంతే.. ఆడేస్తుందయ్యా అన్నారు.. మొగుడ్ని పెళ్లాం.. లాఠీ పెట్టి కొట్టిందంటే.. ఎగబడి వస్తారు మహిళలు. అలా సినిమా పాయింట్‌ పట్టుకునేవారు.  ‘ఈ పిల్లకు పెళ్లవుతుందా’ సినిమా చూసి  ఆ పాత్ర నువ్వు పోషిస్తున్నావ్‌ అని మురళి నన్ను వద్దన్నా పరుచూరి గోపాలకృష్ణ చేస్తేనే నేనీ సినిమా తీస్తానని మురళి మీద ఎదురు తిరిగారు. గొప్ప గొప్ప నిర్మాతలు సైతం ఇప్పుడు మౌనంగా కూర్చుకుంటున్నారే తప్ప సినిమాలు తీయడం లేదు. ఏపీ ప్రసాద్‌, చలసాని గోపీ.. ఇలా రెగ్యులర్‌గా సినిమాలు తీసేవారు పుణ్యలోకాలకు వెళ్లిపోయారు. ఇంకా పెద్ద నిర్మాతలు ఉన్నారు కానీ వాళ్లసలు వీటి జోలికి రాకుండా..దూరంగా.. మౌనంగా.. బహుశా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌ వాళ్లకి నచ్చట్లేదేమోనని అనిపిస్తుంది.. కానీ రామానాయుడు ఉన్నంత కాలం సినిమాలు తీస్తూ ఉండేవారు.

ఆ షీల్డ్‌ ఎదురుగా పెట్టుకునేవారు..

ముందడుగు టైటిల్‌ నచ్చకపోతే.. ఏంటండి.. మీతో ముందడుగు వేద్దామంటే వెనకడుగు వేస్తున్నారంటే.. భలే కొట్టావయ్య సెంటిమెంట్‌ మీద అని.. ఆరోజు నుంచి ఆయన పరమపదించేవరకు కూడా... ముందడుగు 25 వారాల షీల్డ్‌ ఆయన ఎదురుగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ సినిమా నన్ను ముందడుగు వేయించిందని చెప్పేవారు.

ఇది బలపం పట్టి భామ ఒళ్లో  పాట చరిత్ర.

బలపం పట్టి భామ ఒళ్లో..  మూడో స్థానంలో ఉన్న పాట ఐదో స్థానంలో వేయమంటే..14వ రోజు రిలీజ్‌ పెట్టుకొని 10వరోజు మార్చడమా.. వెంకటేశ్‌కి ఈ పాట చాలా ఇష్టమంటే.. బాబు.. నీకు నాకు పందెం ఉంది. ఇది ఎన్ని కోట్లు చేస్తుందని.. మరి నేను పందెం గెలవద్దా అంటే. సరే.. మార్చుకోండి అన్నాను. అలా నా మాటను గౌరవించారు.

ఆయన సినిమాల్లో.. మూడో పాట గొప్పగా తీస్తారు

రాఘవేంద్రరావు మూడో పాట ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. ఇది ఆయన నాన్న దగ్గర చూసి నేర్చుకున్నారట. ఎందుకంటే పొరుగూరి నుంచి వచ్చినవాళ్లు మూడో పాట చూసి ఇళ్లకు వెళ్లిపోతారట. మళ్లీ వచ్చి సెకెండ్‌ ఆఫ్‌ కోసం మాట్నీ చూస్తారట. రిపీట్‌ వ్యాల్యూ ఉంటుందని చెబుతారాయన. కానీ  బలపం పట్టి భామ ఒళ్లో వస్తే కట్టేసినట్టు కూర్చుంటారని దాని అక్కడ మార్చినప్పుడు ఆయన అంగీకరించారు.

సురేష్‌బాబు కూడా అంచనా వేయగలడు

రామానాయుడి గారికి ఫ్లాప్స్‌, హిట్స్‌ ఉన్నాయి.సురేష్‌బాబుకి 90-95 శాతం వరకూ హిట్స్‌ ఉన్నాయి. అసలు సురేష్‌ బాబు హాలీవుడ్‌లో స్ర్కీన్‌ప్లే చదువుకొచ్చాడా అనేంత అనుమానంగా ఉండేది.చదువుకోసం విదేశాలు వెళ్లాడు కానీ అతడు చదువుకుంది స్ర్కీన్‌ప్లే .. అలా అద్భుతాన్ని సృష్టించగలిగే మేధస్సు కలిగి ఉన్నవాడు. కర్టెక్‌గా మనం చెబుతున్నప్పుడు.. ఇది కర్టెక్‌ కాదా అని అంచనా వేయగలడు. 48-50 సినిమాలు వాళ్లవి.. అందులో 44 సూపర్‌ హిట్లే. అంటే రామానాయుడు ఎంతో.. అందులో సురేష్‌ బాబుకి అంతే భాగస్వామ్యం ఇస్తారు.

వెంకటేశ్‌లో వివేకానందుడు ఉన్నాడు..

వెంకటేశ్ అ‌త్యంత అద్భుతమైన మనసు ఉన్నవాడు. మీకు తెలిదు..అతనిలో ఒక వివేకానందుడు ఉన్నాడు. అన్నిరోజులు మనవికాదు.. అలా అని అన్నిరోజులు మనవి కాకుండా పోవు. మనరోజు మనకి వస్తుంది. బాధపడొద్దు. మళ్లీ వచ్చేరోజు వస్తుందని చెప్పేంత అద్భుతమైన తత్వం ఆయన శరీరంలో ఉంది. కలిసుందాంరా, ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, గణేష్‌, నారప్ప..ఇన్నిచిత్రాల్లో ఒక్కోరకంగా కనిపిస్తాడు.

రానా ఎన్టీఆర్‌ని ఇమిటేట్‌ చేసేవాడు

అప్పట్లో మా ఇంటి నుంచి నాలుగో ఇంట్లో రామానాయుడు ఉండేవారు. చూడు రానా.. ఎన్టీఆర్‌ని ఎలా ఇమిటేట్‌ చేస్తున్నాడో అని అనేవారు. రామానాయుడు గారు..  చనిపోతే.. అదే ఏడాది జులైలో బాహుబలి వచ్చింది.. బాహుబలిలో రానా పోషించిన తీరు చూసి ఉంటే ఎంత సంతృప్తిపడేవారో అని అనిపిస్తుంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని