Saindhav: ‘సైంధవ్‌’లో ఈ మార్పులు చేసుంటే బాగుండేది..: పరుచూరి గోపాలకృష్ణ

ఇటీవల విడుదలైన ‘సైంధవ్‌’ (Saindhav)ను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు.

Updated : 10 Feb 2024 14:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెంకటేశ్‌ 75వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘సైంధవ్‌’(Saindhav). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) విశ్లేషించారు. ‘పరుచూరి పాఠాలు’ ( Paruchuri Paatalu)లో భాగంగా ఆయన దీనిలోని పాత్రల ఎంపికల గురించి మాట్లాడారు. కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదన్నారు.

‘‘ఇలాంటి కథ విజయం సాధిస్తుందా? లేదా? అని చిత్ర బృందమంతా ఆలోచించాలి. ముఖ్యంగా హీరో దీనిపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఒకవేళ నాకు ఈ కథలో మార్పులు సూచించాలని అడిగి ఉంటే.. క్లైమాక్స్‌ను మార్చేసేవాడిని. వేరే భాష నటులకు అవకాశమిచ్చినప్పుడు సినిమా పూర్తి బాధ్యతలు వారిపై వేయకూడదు. మన ప్రేక్షకులకు పరిచమయమున్న వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. కూతుర్ని బతికించుకోవడం కోసం తండ్రిపడే ఆరాటమే ఈ కథ. అయితే, ఆ పాప బతికిందా? లేదా? అనేది సినిమా ఫలితంపై ప్రభావం చూపింది. ఈ ఒక్క పాయింటే సినిమా పెద్దగా మెప్పించలేకపోవడానికి కారణమని నా అభిప్రాయం’’.

‘ఫైటర్‌’ ముద్దుసీన్‌పై నోటీసులు.. దర్శకుడు ఏమన్నారంటే..?

‘‘హీరోయిన్‌ పాత్రలో కూడా కొన్ని మార్పులు చేసుంటే బాగుండేది. ఆమె పాత్ర స్వభావం తెలుగు ప్రేక్షకులు స్వీకరించలేరు. పూర్తిగా పెళ్లికాకుండా ఉన్నట్లు చూపించినా బాగుండేది. ఆమె మరొకరి భార్య అని చూపించే సరికి హీరోతో ప్రేమ సన్నివేశాలు రాసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. డైలాగులు కూడా స్క్రీన్‌ప్లేకు అనుగుణంగా లేవు. ‘మా నాన్న సూపర్‌ హీరో.. ఆయనుంటే నాకు భయం లేదు’ ఇలాంటివి ఆ చిన్నపిల్లతో చెప్పించకూడదు. అలాంటివి ఆ పాత్రకు సరిపోవు. కొన్ని సన్నివేశాల్లో వెంకటేశ్‌ (Venkatesh) నటన అద్భుతం. తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో వచ్చే సీన్స్ మెప్పించాయి. డ్రగ్స్‌ మాఫియాను ఎదుర్కోవడం వంటి సన్నివేశాలు వెంకటేశ్‌ బాడీ లాంగ్వేజ్‌కు అతకవు. అయినా ఆయన తన నటనతో ఆకట్టుకున్నారు. వెంకటేశ్‌ తెలుగు సినిమా పరిశ్రమకు వరం. ఈ సినిమా రెండో భాగం ఉంటే కథలో మార్పులు చేస్తే బాగుంటుంది. చిన్నపాప బతికే ఉందని అందులో ప్రారంభంలోనే చూపించగలిగితే సూపర్‌ హిట్‌ అవుతుంది’’ అని పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని